మార్కెట్‌కు ముడి చమురు సెగ

Sensex closes 227 points down, Nifty below 10240 - Sakshi

మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

ప్రభావం చూపిన లాభాల స్వీకరణ  

228 పాయింట్లు పతనమై 33,228కు సెన్సెక్స్‌

82 పాయింట్ల నష్టంతో 10,240కు నిఫ్టీ  

ద్రవ్యోల్బణ గణాంకాలు ఎలా ఉంటాయోనన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమనడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. ముడి చమురు ధరలు పెరగడంతో భవిష్యత్తులో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాల్లేవన్న అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఇటీవల పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో  స్టాక్‌ సూచీల మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు.

  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 228 పాయింట్లు పతనమై 33,228 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి 10,240 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్టీ, విద్యుత్తు, బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి.  కీలకమైన కేంద్ర బ్యాంక్‌ల సమావేశాల ఫలితంగా డాలర్‌ బలపడటంతో ఆసియా మార్కెట్లు నష్టపోవడం, గణాంకాల వెల్లడి కారణంగా ఇన్వెస్టర్లలో అప్రమత్తత నెలకొనడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై కేంద్రం పన్ను విధించే అవకాశాలున్నాయన్న వార్తలు హల్‌చల్‌ చేశాయని వివరించారు.   

రెండున్నరేళ్ల గరిష్టానికి చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు  ధర 65 డాలర్లకు ఎగసింది. ఇది దాదాపు రెండున్నరేళ్ల గరిష్ట స్థాయి. దీంతో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాలకు గండిపడింది. మరోవైపు కీలకమైన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఫెడరల్‌ రిజర్వ్‌ 0.25 శాతం చొప్పున రేట్లను పెంచే అవకాశాలున్నాయి. ఈ రేట్ల నిర్ణయం నేడు(బుధవారం) రాత్రి వెలువడుతుంది.  

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 3 శాతం అప్‌..
హైదరాబాద్‌ ప్లాంట్‌కు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్‌(ఈఐఆర్‌) అందిన నేపథ్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ 2.8 శాతం లాభపడి, రూ.2,255 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top