కొత్త ఏడాది కొత్త శిఖరాలకు

Sensex closes at 184 points higher - Sakshi

సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు

కలసివచ్చిన దేశీయ అంశాలు

ఇంట్రాడేలోనూ, క్లోజింగ్‌లోనూ సూచీల కొత్త రికార్డ్‌

కొత్త సంవత్సరం ఐదో రోజునే స్టాక్‌ సూచీలు కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. కొత్త ఏడాది తొలి మూడు రోజులు స్తబ్దుగా నష్టాల్లో కొనసాగిన స్టాక్‌ మార్కెట్‌ ఆ తర్వాత రెండు రోజుల్లో లాభాల బాట పట్టింది. ఐదో రోజైన శుక్రవారం నాడు కొనుగోళ్ల జోరుతో స్టాక్‌సూచీలు  శిఖర స్థాయిలకు చేరాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్ల ఎగువన ముగిశాయి.

అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో పాటు దేశీయంగా పలు అంశాలు కలసిరావడంతో ప్రధాన స్టాక్‌ సూచీలు–బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లు సృష్టించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 184 పాయింట్లు లాభపడి 34,154 పాయింట్ల వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 10,559 పాయింట్ల వద్ద ముగిశాయి.

వరుసగా రెండో రోజూ స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. ఇక వారం పరంగా చూస్తే, వరుసగా ఐదో వారమూ స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. ఈ ఏడాది తొలివారంలో సెన్సెక్స్‌ 97 పాయింట్లు, నిఫ్టీ 28 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. టెలికం, కన్సూమర్‌ డ్యూరబుల్స్, రియల్టీ, లోహ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి.

మంగళవారం సెన్సెక్స్‌ లాభాల్లో ప్రారంభమైంది. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు రోజంతా కొనసాగడంతో సూచీలు దూకుడు కొనసాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 219 పాయింట్ల లాభంతో 34,189 పాయింట్ల వద్ద, నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 10,566 పాయింట్లను తాకాయి. ఇవి రెండూ ఈ సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. సూచీలు ఆల్‌టైమ్‌ హైని తాకిన తర్వాత కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అయినప్పటికీ రికార్డ్‌ స్థాయిల వద్దే స్టాక్‌ సూచీలు ముగిశాయి.

 లాభాలు ఎందుకంటే....
ప్రపంచ మార్కెట్లు పెరిగాయ్‌: అమెరికాలో ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించడంతో అమెరికా డో జోన్స్‌ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ సూచీ తొలిసారిగా 25 వేల పాయింట్లకు ఎగిసింది. ఈ సూచీతో పాటు ఇతర అమెరికా సూచీలు–ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌ కాంపోజిట్‌లు  రికార్డ్‌ స్థాయికి చేరిన జోష్‌తో ఆసియా మార్కెట్లు లాభపడటం, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది.
బ్యాంక్‌ల మూలధన నిధులకు పార్లమెంట్‌ పచ్చజెండా: ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన రూ.80,000 కోట్ల మూలధన బాండ్లకు పార్లమెంట్‌ ఆమోదం లభించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది.
ద్రవ్యలోటు లక్ష్యం సాకారమే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 3.2 శాతంగా నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించగలదనే అంచనాలు.
ఫిచ్‌ నివేదిక: రానున్న ఐదేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ మనదేనని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ తాజా నివేదిక సెంటిమెంట్‌కు కిక్‌నిచ్చింది.
 ఇన్వెస్టర్ల సంపద : రూ.153.7 లక్షల కోట్లకు స్టాక్‌ మార్కెట్‌ శిఖర స్థాయిలకు చేరడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.13 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,13,925 కోట్లు పెరిగి 1,53,77,070 కోట్లకు (2.4 లక్షల కోట్ల డాలర్లకు) ఎగసింది.

సూచీల కొత్త రికార్డ్‌లు
 సూచీ      ఇంట్రాడే   ముగింపు
 సెన్సెక్స్‌     34,189    34,154
 నిఫ్టీ         10,566    10,559

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top