మార్కెట్‌ అక్కడక్కడే

Sensex Clocks Longest Monthly Rally In Two Years - Sakshi

చైనాకు అమెరికా సుంకాల సెగ

డబ్ల్యూటీఓ నుంచి బైటకు వస్తామన్న ట్రంప్‌

చమురు ధరల భగభగలు

71కి రూపాయి పతనం

45 పాయింట్లు నష్టపోయి 38,645కు సెన్సెక్స్‌

4 పాయింట్లు పెరిగి 11,681కు నిఫ్టీ

అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటానికి రూపాయి జీవిత కాల కనిష్ట పతనం కూడా తోడవడంతో మన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం అక్కడక్కడే ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం తొలిసారిగా 71 మార్క్‌కు పడిపోవడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటం, చైనాపై మరిన్ని సుంకాల విధింపుకు అమెరికా సన్నాహాలు చేయడం ప్రతికూల ప్రభావం చూపించాయి. మార్కెట్‌ ముగిసిన తర్వాత క్యూ1 జీడీపీ గణాంకాలు వెలువడనుండటంతో మార్కెట్లో అప్రమత్త వాతావరణం ఏర్పడింది.

సెన్సెక్స్‌ వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లోనే ముగియగా, నిఫ్టీ కీలకమైన 11,700 పాయింట్ల దిగువనే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 45 పాయింట్లు నష్టంతో 38,645 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4 పాయింట్లు లాభంతో 11,681 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, ఇంధనషేర్లు నష్టపోయాయి. ఐటీ, ఫార్మా షేర్లు పెరిగాయి. చివర్లో కొనుగోళ్ల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల నష్టాలు తగ్గాయి.

276 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌: ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఒక దశలో 148 పాయింట్లు లాభపడగా, మరో దశలో 128 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 276 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. అయితే నెలవారీగా చూస్తే, వరుసగా ఐదో నెలలోనూ స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. వరుసగా ఆరో వారమూ స్టాక్‌ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 393 పాయింట్లు, నిఫ్టీ 123 పాయింట్లు చొప్పున పెరిగాయి.

ప్రపంచ మార్కెట్ల పతనం...
20,000 కోట్ల డాలర్ల విలువైన చైనా వస్తువులపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ సన్నాహాలు చేస్తున్నారని, అంతే కాకుండా వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూటీఓ) నుంచి బయటకు వచ్చేస్తామని ఆయన బెదిరించడం కూడా ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. చైనా–అమెరికాల మధ్య వాణిజ్య యుద్దం మరింతగా ముదురుతుండటం, నెలాఖరు కావడంతో అమెరికా డాలర్‌ కోసం చమురు దిగుమతిదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో రూపాయి ఇంట్రాడేలో జీవిత కాల కనిష్ట స్థాయి, 71కు పడిపోయింది.

మళ్లీ మొదటి స్థానంలోకి టీసీఎస్‌: అత్యధిక మార్కెట్‌ క్యాప్‌కంపెనీగా మళ్లీ టీసీఎస్‌ అవతరించింది. దాదాపు వారం తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను తోసిరాజని అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా అవతరించింది. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌రూ.7,86,471 కోట్లుగా ఉండగా, టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,95,654 కోట్లుగా ఉంది.  యస్‌ బ్యాంక్‌ 5.1 శాతం నష్టంతో రూ.343 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. యస్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓగా రాణా కపూర్‌ కొనసాగవచ్చని, తదుపరి నోటీస్‌ ఇచ్చేంత వరకే ఆయన కొనసాగవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. రాణా కపూర్‌ పదవీకాలంపై అనిశ్చితి కారణంగా ఈ షేర్‌ పతనమైంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top