బుల్‌.. ధనాధన్‌!!

Sensex Above 38300, Nifty Breaches 11550 For The First Time Ever - Sakshi

స్టాక్‌ మార్కెట్లో లాభాల వర్షం

ఇంట్రాడేలో, ముగింపులో కొత్త రికార్డ్‌లు

సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు

కలసివచ్చిన రూపాయి రికవరీ

రిలయన్స్, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం జోరు

331 పాయింట్ల లాభంతో 38,279కు సెన్సెక్స్‌

81 పాయింట్లు పెరిగి 11,552కు నిఫ్టీ

సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో పరుగులు పెట్టింది. సూచీల బుల్‌ రంకెల ధాటికి పాత రికార్డులు బద్దలవుతున్నాయి. సెన్సెక్స్‌ 38 వేల పాయింట్లపైకి, నిఫ్టీ 11,500 పాయింట్ల పైకి ఎగబాకి కొత్త రికార్డులు సృష్టించాయి. అంతర్జాతీయ సంకేతాలు కలసిరాగా, లోహ, వాహన, క్యాపిటల్‌ గూడ్స్, బ్యాంక్, ఇంధన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి.

రూపాయి బలపడటం, ఇండెక్స్‌ హెవీ వెయిట్స్‌–రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎల్‌ అండ్‌ టీలు లాభపడటం, విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండటం.. సానుకూల ప్రభావం చూపించాయి.   సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. సెన్సెక్స్‌ 331 పాయింట్ల లాభంతో 38,279 పాయింట్ల వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 11,552 వద్ద ముగిశాయి. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,341 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,565 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఇన్ఫోసిస్‌ ప్రభావం, రూపాయి రికవరీతో ఐటీ షేర్లు పతనమయ్యాయి.  

లాభాలు ఎందుకంటే...
సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు: అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఇరు దేశాల అధికారుల మధ్య మంగళవారం నుంచి రెండు రోజుల పాటు వాషింగ్టన్‌లో చర్చలు జరగనున్నాయన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. ముడి చమురు ధరలు చల్లబడటం కలసివచ్చింది. ఆసియా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  
♦  హెవీ వెయిట్‌ షేర్లలో కొనుగోళ్లు: ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, వేదాంత, బజాజ్‌ ఆటో షేర్లు ఎగబాకాయి.   
♦  రూపాయి రికవరీ: గత వారంలో జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోయిన డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం రికవరీ కావడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. గత గురువారం 26 పైసల నష్టంతో 70.15కు పడిపోయిన రూపాయి సోమవారం  33 పైసలు లాభపడి 69.82 వద్ద ముగిసింది.
♦  మళ్లీ విదేశీ పెట్టుబడులు: విదేశీ ఇన్వెస్టర్లు ఈ  నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ.7,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ముడి చమురు ధరలు తగ్గుతుండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారత్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.  
 సానుకూల వ్యాఖ్యలు, నివేదికలు: భారత్‌ రికవరీ బాట పట్టిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5% వృద్ధి సాధించగలదని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్‌ విర్మాణి వ్యాఖ్యానించడం కలసివచ్చింది. అమెరికా–చైనాల వాణిజ్య పోరు వల్ల అమెరికాకు మన ఎగుమతులను పెంచుకునే అవకాశం అందుబాటులోకి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది ఆదాయపు పన్ను వసూళ్లు రికార్డ్‌ స్థాయిలో రూ.10.03 లక్షల కోట్లకు పెరిగిందని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ వెల్లడించడం కూడా సానుకూల ప్రభావం చూపించింది. వర్ధమాన దేశాల్లో, భారత్‌  మెరుగ్గా ఉందని మెర్గాన్‌ స్టాన్లీ నివేదిక పేర్కొంది.  
♦  టెక్నికల్‌ అంశాలు:  కీలకమైన నిరోధ స్థాయి 11,500  పాయింట్లను నిఫ్టీ అధిగమించడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. నిఫ్టీ సూచీ 20, 50, 100 రోజుల సింపుల్‌ మూవింగ్‌ యావరేజ్‌(ఎస్‌ఎమ్‌ఏ)పైన ట్రేడ్‌ కావడం స్వల్ప కాలంలో సానుకూల ధోరణిని సూచిస్తోందని, అందుకే కొనుగోళ్లు జోరుగా సాగాయని టెక్నికల్‌ విశ్లేషకులంటున్నారు.

మరిన్ని విశేషాలు....
 స్టాక్‌ సూచీలతో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌ టైమ్‌ హైలను తాకాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, పేజ్‌ ఇండస్ట్రీస్, హిందుస్తాన్‌ యూనిలివర్, బాటా, బెర్జర్‌ పెయింట్స్, బ్రిటానియా, గోద్రేజ్‌ కన్సూమర్‌ ప్రొడక్ట్స్, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్, 3ఎమ్‌ ఇండియా, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్, ఇండియాబుల్స్‌ వెంచర్స్, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్, టోరెంట్‌ ఫార్మా,  జెన్‌సర్‌ టెక్నాలజీస్‌ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
 షేర్ల బైబ్యాక్‌ విషయమై ఈ నెల 23న జరిగే డైరెక్టర్ల సమావేశంలో చర్చించనున్నామని వెల్లడించడంతో ఎల్‌ అండ్‌ టీ 6.7 శాతం లాభంతో రూ.1,324 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  రూ.1,730 టార్గెట్‌ ధరకు ఈ షేర్‌ను ప్రస్తుత స్థాయిలో కొనుగోలు చేయవచ్చని  అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, సీఎల్‌ఎస్‌ఏ రికమెండ్‌ చేసింది.  
 రిలయన్స్‌ రిటైల్‌తో కలిసి చైనా రిటైల్‌ దిగ్గజం అలీబాబా భారత్‌లో  భారీ రిటైల్‌ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నదన్న వార్తలతో  రిలయన్స్‌ ఆల్‌టైమ్‌ హై, 1,238ని తాకింది. చివరకు 2.6 శాతం లాభంతో రూ.1,235 వద్ద ముగిసింది. షేర్‌ ధర పెరగడంతో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,82,636 కోట్లకు ఎగసింది. అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా టీసీఎస్‌ను తోసిరాజని మొదటి స్థానంలోకి దూసుకుపోయింది.  
 ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ రంగనాధ్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడం ఆ షేర్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది.  ఈ షేర్‌ చివరకు 3.2 శాతం నష్టంతో రూ.1,324 వద్ద ముగిసింది.  
 కోల్‌ ఇండియాలో మైనారిటీ వాటా విక్రయం ద్వారా రూ.10,000–12,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలతో షేర్‌ 1.1 శాతం లాభపడి రూ.284కు చేరింది.  
 ఓఎన్‌జీసీ విదేశీ సంస్థ, ఓఎన్‌జీసీ విదేశ్‌ ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగ ఓఎన్‌జీసీ షేర్‌ 3.5 శాతం ర్యాలీ చేసింది.  
 వచ్చే నెల 10 నుంచి ట్రేడింగ్‌ సస్పెండ్‌ కానున్న గీతాంజలి జెమ్స్, ఆమ్‌టెక్‌ ఆటో షేర్లు 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

నెక్ట్స్‌ ఏంటి..?
నిఫ్టీ 11,500 పాయింట్ల ఎగువన ముగిసి రోజువారీ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరిచిందని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ 11,630 పాయింట్లకు దూసుకుపోతుందని, తదుపరి నిరోధం  ఇదేనని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే వరుసగా గత నాలుగు వారాల పాటు స్టాక్‌ మార్కెట్‌ లాభపడినందున, రికార్డ్‌ స్థాయి లాభాల నేపథ్యంలో లాభాల స్వీకరణ ఉండొచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top