సెన్సెక్స్‌ 352 పాయింట్లు అప్‌

Sensex up 352 points - Sakshi

జోరుగా బ్యాంక్, లోహ, వాహన షేర్లలో కొనుగోళ్లు

కలసివచ్చిన షార్ట్‌ కవరింగ్‌

32,949 పాయింట్లకు సెన్సెక్స్‌

123 పాయింట్ల లాభంతో 10,167కు నిఫ్టీ  

ఇటీవలి నష్టాల కారణంగా ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న బ్యాంక్, లోహ, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు కూడా జత కావడంతో రెండు రోజుల నష్టాల నుంచి స్టాక్‌ సూచీలు కోలుకున్నాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 352 పాయింట్ల లాభంతో 32,949 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో 10,167 పాయింట్ల వద్ద ముగిశాయి. నవంబర్‌ 1 తర్వాత సెన్సెక్స్‌ ఇన్ని పాయింట్లు లాభపడడం ఇదే మొదటిసారి. కాగా ఈ ఏడాది మే 25 తర్వాత నిఫ్టీ ఈ స్థాయిలో పెరగడం కూడా ఇదే మొదటిసారి. అన్ని రంగాల్లో కొనుగోళ్లు జోరుగా ఉండటంతో సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లోనే ట్రేడైంది. టెలికం, కన్సూ్యమర్‌ డ్యూరబుల్స్, విద్యుత్తు, క్యాపిటల్‌ గూడ్స్, వాహన, రియల్టీ,.. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 395 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్ల వరకూ లాభపడ్డాయి.

విలువ చూసి కొనుగోళ్లు...
ద్రవ్యోల్బణం అంచనాలను పెంచినప్పటికీ, కీలక రేట్ల విషయంలో ఆర్‌బీఐ తటస్థ విధానాన్ని అవలంబించడం, ఇటీవలి నష్టాల కారణంగా షేర్లు ఆకర్షణీయంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి.

ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాపై సీబీఐ ఛార్జ్‌షీట్‌బమ
ఇంట్రాడేలో 7 శాతం పతనమైన షేర్‌ ధర ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ కంపెనీపై సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దీంతో బీఎస్‌ఈలో గురువారం ఈ షేర్‌ 2 శాతం నష్టపోయింది. ఒక భూమి కొనుగోలు విషయమై ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు చెందిన ఉన్నతాధికారులతో సహా మొత్తం 16 మందిపై పుణే సెషన్స్‌ కోర్ట్‌లో సీబీఐ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top