ఎస్‌బీఐ ‘ఆఫ్‌లైన్’..!

ఎస్‌బీఐ ‘ఆఫ్‌లైన్’..!


పది రోజులుగా సతాయిస్తున్న నెట్ బ్యాంకింగ్  

రోజులో ఎప్పుడో కాసేపు పనిచేస్తున్న ఆన్‌లైన్

ముంబై సర్వర్లో సమస్యంటూ అధికారుల దాటవేత 

బ్యాంకు నుంచి ఇప్పటికీ రాని అధికారిక ప్రకటన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఎస్‌బీఐ అంటే... దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. అంతేకాదు!! ప్రైవేటు బ్యాంకులతో పోల్చినా నంబర్ వన్ స్థానం దీనిదే. 22 వేలకు పైగా బ్రాంచీలు, 32 దేశాల్లో విస్తరించిన ఈ బ్యాంక్‌కు... దేశంలో కోట్ల మంది ఖాతాదారులున్నారు. మొత్తం దేశీ బ్యాంకింగ్‌లో 20 శాతం వాటా దీనిదే. ఇక ఆన్‌లైన్ విషయానికొస్తే లావాదేవీల సంఖ్యలో అగ్రస్థానం దీనిదే.

 

  అలాంటి బ్యాంక్... గడిచిన పది రోజులుగా ‘ఆఫ్‌లైన్’ అయిపోతోంది. రోజు మొత్తంలో ఎప్పుడైనా సమస్య వస్తే ఓకే అనుకోవచ్చుగానీ... రివర్స్‌లో ఈ బ్యాంక్ వెబ్‌సైట్ రోజు మొత్తంలో ఎప్పుడైనా కాసేపు మాత్రం పనిచేస్తోంది. మొబైల్ నుంచి లావాదేవీలు జరపాలన్నా అదే పరిస్థితి. పోనీ ఏదో ఒకటి రెండు రోజుల్నుంచి ఇలా ఉంటే... ఏదో సమస్య వచ్చిందిలే అనుకోవచ్చు. కానీ గడిచిన పది రోజులుగా ఇదే పరిస్థితి. లక్షల మంది ఆన్‌లైన్ ఖాతాదారులు లావాదేవీలు జరపలేక... బిల్లులు చెల్లించలేక నానా యాతనా పడుతున్నా బ్యాంకు నుంచి మాత్రం అధికారికంగా స్పందించటం గానీ, సమస్య ఎప్పటిదాకా ఉంటుందో చెప్పటం కానీ ఏమీ లేదు. ఖాతాదారులకు కలుగుతున్న కష్టంపైగానీ, తనకు వాటిల్లుతున్న నష్టంపైగానీ బ్యాంకు ఇప్పటిదాకా కనీసం స్పందించిందీ లేదు.

 

 ఎస్‌బీఐ దీనిపై స్పందించకపోయినా... ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు దీనిపై పలు సూచనలు చేస్తుండటం విశేషం. ‘‘మీరు ఎస్‌బీఐ ద్వారా మాకు చెల్లించాలని ప్రయత్నిస్తే కుదరకపోవచ్చు. ఎందుకంటే ఎస్‌బీఐ ఆన్‌లైన్ సరిగా పనిచేయటం లేదు. అంతగా కావాలంటే ఎస్‌బీఐ డెబిట్ కార్డునో, ఏటీఎం కార్డునో ఆన్‌లైన్లో వాడండి. ఇంకా చాలా మార్గాలున్నాయి కదా!!’’ అని ఆ సంస్థలు సూచిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం మధ్యాహ్నం సతాయించిన ఆన్‌లైన్ ఎస్‌బీఐ... రాత్రికి కూడా అలాగే ఉండటంతో దీనిపై ఓ అధికారిని ‘సాక్షి’ ప్రతినిధి సంప్రతించారు.

 

  ‘‘రెండు రోజుల కిందటే ఈ సమస్య పరిష్కరించాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు’’ అని ఆయన సమాధానమిచ్చారు. ఒకవేళ ఏవైనా సమస్యలుంటే ముంబాయి అధికారులతో మాట్లాడతానన్నారు. నిజానికి రాత్రి కూడా ఎంత ప్రయత్నించినా అటు మొబైల్‌లో, ఇటు వెబ్‌లో ఎస్‌బీఐ సైట్ తెరుచుకుంటే ఒట్టు. నాలుగు రోజల కిందట కూడా సమస్య తీవ్రంగా ఉన్నపుడు మరో అధికారిని సంప్రతించగా... ‘‘ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్ వ్యవస్థను రక్షణ పరంగా మరింత సమర్థంగా చేయటానికి చర్యలు తీసుకుంటున్నాం.అందుకని కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది’’ అని చెప్పారు. ఎస్‌బీఐ కూడా తన సర్వీస్ ప్రొవైడర్ టెక్ మహీంద్రా, ఇతర ఐటీ పార్ట్‌నర్స్‌తో కలసి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తన వెబ్‌సైట్లో పేర్కొంది. కానీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవటం గమనార్హం. అడ్వాన్స్ ట్యాక్స్‌లు చెల్లించడానికి చివరి రోజైన డిసెంబర్ 15న కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ పనిచేయకపోవడంతో అనేకమంది పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో అతిపెద్ద బ్యాంకైన ఎస్‌బీఐలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ పది రోజులుగా పనిచేయడం లేదంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఒక ఐటీ ఉద్యోగి వ్యాఖ్యానించారు.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top