ఎస్‌బీఐ పండుగ ధమాకా..!

SBI slashes interest rates on car loans, home loans ahead of festive season - Sakshi

తక్కువ వడ్డీపై గృహ, వాహన రుణాలు

ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీ

ప్రీ–అప్రూవ్డ్‌ డిజిటల్‌ రుణాలు కూడా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా పండుగ సీజన్‌ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ వడ్డీకే గృహ .. వాహన రుణాలు, ప్రాసెసింగ్‌ ఫీజులు మాఫీ, ప్రీ–అప్రూవ్డ్‌ డిజిటల్‌ రుణాలు మొదలైన ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘అత్యంత తక్కువగా 8.70 శాతం వడ్డీ రేటు నుంచి కారు రుణాలు అందిస్తున్నాం. పండుగ సీజన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు కూడా ఉండదు‘ అని బ్యాంకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

అలాగే వడ్డీ రేట్ల మార్పులకు సంబంధించి ఈ రుణాలపై ప్రతికూల ప్రభావాలేమీ ఉండవని వివరించింది. యోనో వంటి సొంత డిజిటల్‌ ప్లాట్‌ఫాం నుంచి లేదా వెబ్‌సైట్‌ ద్వారా కారు లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారికి వడ్డీపై 25 బేసిస్‌ పాయింట్లు (పావు శాతం) మేర తగ్గింపు కూడా పొందవచ్చు. వేతన జీవులు కారు ఆన్‌ రోడ్‌ ధరలో 90 శాతం దాకా రుణంగా పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్లు ఎప్పటిదాకా అమల్లో ఉంటాయన్నది మాత్రం ఎస్‌బీఐ వెల్లడించలేదు.

చౌకగా గృహ రుణాలు..
సెప్టెంబర్‌ 1 నుంచి ప్రస్తుత, కొత్త గృహ రుణాలన్నింటికి రెపో రేట్‌ ఆధారిత వడ్డీ రేట్లు వర్తింపచేయనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణాలపై ఎస్‌బీఐ వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది. ఇటీవలే మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత వడ్డీ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా గృహ రుణాలపై వడ్డీ రేటు 35 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గింది. మరోవైపు రూ. 20 లక్షల దాకా వ్యక్తిగత రుణాల విషయంలో వడ్డీ రేటు అత్యంత తక్కువగా 10.75% నుంచి ప్రారంభమవుతుందని ఎస్‌బీఐ తెలిపింది.

సుదీర్ఘంగా 6 సంవత్సరాల పాటు చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చని పేర్కొంది. ఇక ఎస్‌బీఐలో శాలరీ అకౌంటు ఉన్న ఖాతాదారులు యోనో యాప్‌ ద్వారా రూ. 5 లక్షల దాకా ప్రీ–అప్రూవ్డ్‌ రుణాలను పొందవచ్చని వివరించింది. అటు విద్యా రుణాలపై వడ్డీ రేటు 8.25% నుంచి ప్రారంభమవుతుందని ఎస్‌బీఐ తెలిపింది. దేశీయంగా విద్యకు రూ.50 లక్షల దాకా, విదేశీ చదువు కోసం రూ.1.50 కోట్ల దాకా రుణాలు పొందవచ్చు. సుదీర్ఘంగా 15 ఏళ్ల పాటు రుణాల చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చని, తద్వారా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చని ఎస్‌బీఐ వివరించింది.

రెపోతో బల్క్‌ డిపాజిట్‌ రేట్ల అనుసంధానం..
రిజర్వ్‌ బ్యాంక్‌ తగ్గించే పాలసీ రేట్ల ప్రయో జనాలను ఖాతాదారులకు బదలాయించాలంటే బల్క్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించేలా బ్యాంకుల ను ఆర్‌బీఐ ఆదేశించాలని ఎస్‌బీఐ ఒక నివేదికలో పేర్కొంది. చిన్న డిపాజిట్‌దారులు, సీనియర్‌ సిటిజన్స్‌ ప్రయోజనాలను దెబ్బతీయకుండా, అటు నిధుల సమీకరణ వ్యయాలను బ్యాంకులు తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ‘ఎకోర్యాప్‌’ నివేదికలో వివరించింది. ఎస్‌బీఐ సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే స్వచ్ఛందంగా తమ వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించాయి.

రూ. 2 కోట్ల పైబడిన డిపాజిట్లను బల్క్‌ డిపాజిట్లుగా వ్యవహరిస్తారు. బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో వీటి వాటా సుమారు 30 శాతంగా ఉంటుందని అంచనా. చాలామటుకు బల్క్‌ డిపాజిట్లు పెద్ద సంస్థల నుంచి ఉంటాయని, చిన్న డిపాజిటర్లతో పోలిస్తే ఇవి వడ్డీ రేట్ల పరంగా కాస్త రిస్కులు భరించగలిగే అవకాశం ఉంటుందని ఎస్‌బీఐ నివేదిక వివరించింది. రుణాలపైనా, డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను రెపోతో అనుసంధానించాలంటూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బ్యాంకులకు సూచించిన నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.  

ఓబీసీ నుంచి రెపో ఆధారిత రుణాలు..
ప్రభుత్వ రంగ ఓరియంటల్‌ బ్యాంక్‌(ఓబీసీ) ఇకపై గృహ, వాహన రుణాలను రెపో ఆధారిత వడ్డీ రేట్లకు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గృహ రుణాలపై వడ్డీ రేటు 8.35% నుంచి, వాహన రుణాలపై రేటు 8.70% నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. ఎంసీఎల్‌ఆర్‌ లేదా రెపో రేటు ఆధారిత వడ్డీ రేట్లలో ఏదో ఒక దాన్ని కస్టమర్లు ఎంచుకోవచ్చని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top