ఎస్‌బీఐ వడ్డీ రేట్లు పెంపు 

SBI hikes interest rates - Sakshi

రుణాలపై 0.2 శాతం దాకా పెరుగుదల  

8.15 శాతానికి ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ 

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన మర్నాడే రుణాలపైనా వడ్డీ రేటు పెంచింది. 0.20 శాతం దాకా వడ్డీ రేటు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో ఇప్పటిదాకా 7.95 శాతంగా ఉన్న ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణాల వడ్డీ రేటు) ఇక 8.15 శాతానికి పెరిగింది. ప్రధానంగా దీని ప్రాతిపదికనే బ్యాంకు రుణాలు మంజూరు చేస్తోంది. మరోవైపు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 0.10 శాతం పెరిగి 8 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 25 బేసిస్‌ పాయింట్లు పెరిగి 8.35 శాతానికి చేరింది. గతేడాది నవంబర్‌ నుంచి డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ వస్తున్న ఎస్‌బీఐ.. రుణాలపై వడ్డీ రేట్లు పెంచడం  2016 ఏప్రిల్‌ తర్వాత ఇదే తొలిసారి. వివిధ కాలావధుల డిపాజిట్ల రేట్లను 0.75 శాతం దాకా పెంచుతున్నట్లు ఎస్‌బీఐ బుధవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

పీఎస్‌బీలు రిస్కు నిర్వహణ సామర్ధ్యం మెరుగుపర్చుకోవాలి: ఎస్‌బీఐ చైర్మన్‌  
నిర్వహణపరమైన సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొనే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) తమ కార్పొరేట్, రిస్క్‌ గవర్నెన్స్‌ వ్యవస్థలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ‘పీఎస్‌బీలు తమ పాలనా వ్యవస్థను మెరుగుపర్చుకోవాలి. కార్పొరేట్‌ గవర్నెన్స్, రిస్క్‌ గవర్నెన్స్‌ వ్యవస్థల్లో లోపాలేమైనా ఉన్నాయేమో సమీక్షించుకోవాలి. అలాంటివేమైనా ఉన్న పక్షంలో వాటిని సాధ్యమైనంత త్వరగా సరిదిద్దుకోవాలి‘ అని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో పలు మోసాలు బైటపడుతుండటంపై రజనీష్‌ కుమార్‌ ఈ మేరకు స్పందించారు. ఎస్‌బీఐలో రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు తగిన యంత్రాంగం ఉందని ఆయన చెప్పారు. మరోవైపు, పీఎస్‌బీల విదేశీ శాఖల క్రమబద్ధీకరణ అంశం కొత్తదేమీ కాదని, వ్యయాల నియంత్రణ చర్యల్లో భాగంగా ఇది ఇప్పటికే ప్రభుత్వ అజెండాలో ఉందని వివరించారు. దీనికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మోసం కేసుకు సంబంధమేమీ లేదని పేర్కొన్నారు. ఎస్‌బీఐ గడిచిన మూడేళ్లుగా విదేశీ శాఖలను క్రమబద్ధీకరించుకుంటూనే ఉందన్నారు. ఇందులో భాగంగా జెడ్డాలోని కార్యాలయాన్ని మూసివేశామని, పారిస్‌ శాఖను రిప్రజెంటేటివ్‌ ఆఫీస్‌ కింద మార్చామని చెప్పారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top