35 వేల పాయింట్ల పైకి సెన్సెక్స్‌

Rupee rise boosts Sensex, Nifty - Sakshi

ప్రపంచ మార్కెట్ల జోరు  

భారీగా పెరిగిన రూపాయి  

దిగి వచ్చిన చమురు ధరలు  

ఎఫ్‌పీఐల నికర కొనుగోళ్లు  

10,500 దాటిన నిఫ్టీ  

173 పాయింట్లు పెరిగి 10,553 వద్ద ముగింపు  

పాయింట్ల లాభంతో 35,012కు సెన్సెక్స్‌

ఒక్క ఫోన్‌ కాల్‌ ప్రపంచ మార్కెట్లను లాభాల బాట పట్టించింది. సుంకాల పోరులో తీవ్రంగా తలమునకలై ఉన్న అమెరికా–చైనా అగ్రనేతలు ఫోన్‌లో సంభాషించారు. అనంతరం చైనా అధ్యక్షుడితో సంభాషణ సానుకూలంగా సాగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేయడంతో ప్రపంచ మార్కెట్లు జోరుగా పెరిగాయి. ప్రపంచ మార్కెట్ల పరుగుకు రూపాయి బలపడటం కూడా తోడవడంతో మన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం భారీగా లాభపడింది.

ఎఫ్‌పీఐల గురువారం నికర కొనుగోళ్లు ఊతమిచ్చాయి. ముడి చమురు ధరలు దిగిరావడం సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 580 పాయింట్ల లాభంతో 35,012 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 173 పాయింట్లు పెరిగి 10,553 పాయింట్ల వద్ద ముగిశాయి.  స్టాక్‌ సూచీలకు ఇది ఒక నెల గరిష్ట స్థాయి.  ఇక వారం పరంగా చూస్తే, రెండు వరుస వారాల నష్టాలకు ఈ వారం బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 1,662 పాయింట్లు, నిఫ్టీ 523 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఈ రెండు సూచీలు చెరో 5 శాతం ఎగిశాయి.

ఆరంభమే అదిరింది....
ట్రేడింగ్‌ ఆరంభమే అదిరిపోయింది. సెన్సెక్స్‌ 312 పాయింట్ల లాభంతో 34,744 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత రోజంతా  లాభాల జోరే కనిపించింది. కొనుగోళ్ల వెల్లువతో ఇంట్రాడేలో 758 పాయింట్ల లాభంతో 35,190 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 227 పాయింట్లు పెరిగింది.    ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌కంపెనీల షేర్లు ఎగిశాయి.

ఈ  నెల 7న మూరత్‌ ట్రేడింగ్‌  
దీపావళి సందర్భంగా ఈ నెల 7(బుధవారం) రోజు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ప్రత్యేక ముహురత్‌ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. సాయంత్రం గం.5.00కు మొదలై గం.6.30ని. పాటు ట్రేడింగ్‌ జరుగుతుంది.  

రూ. 1.72 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
సెన్సెక్స్‌ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.72 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,72,870 కోట్లు పెరిగి రూ.1,40,78,702 కోట్లకు పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top