10 నెలల కనిష్టానికి రూపాయి

10 నెలల కనిష్టానికి రూపాయి


 31 పైసలు డౌన్; 62.33 వద్ద ముగింపు



ముంబై: రూపాయి మళ్లీ బక్కచిక్కుతోంది. గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ మరో 31 పైసలు దిగజారి.. 62.33 వద్ద ముగిసింది. ఇది 10 నెలల కనిష్ట స్థాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఈ స్థాయికి దిగజారడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడి చమురు(క్రూడ్) ధరలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో దేశీ ఆయిల్ కంపెనీలు క్రూడ్ దిగుమతిని పెంచడంతో డాలర్లకు డిమాండ్ పోటెత్తడం దీనికి ప్రధాన కారణంగా నిలిచినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దేశీ స్టాక్ మార్కెట్ పతనం కూడా రూపాయిపై ప్రభావం చూపింది.



కాగా, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోకి జారిన రూపాయి.. మొత్తం మీద 56 పైసలు క్షీణించింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవచ్చన్న ఆందోళనలు... అంతర్జాతీయంగా ప్రధాన కరెన్సీలతో(ఇండెక్స్) డాలరు బలపడటం దేశీ కరెన్సీ బలహీనతలకు కారణమైందని ఒక ఫారెక్స్ డీలరు వ్యాఖ్యానించారు. నేడు(శుక్రవారం) రిటైల్ ధరల ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఫారెక్స్ మార్కెట్లో అప్రమత్త ధోరణి నెలకొందన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top