ఆరు నెలల్లో రూ.77,000 కోట్లు

Rs.77,000 crore in six months

స్టాక్‌ మార్కెట్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు

విదేశీ ఇన్వెస్టర్లను మించి కొనుగోళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో స్టాక్‌ మార్కెట్లోకి దేశీ నిధులు వెల్లువెత్తాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగిన నేపథ్యంలో 2017 ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్యకాలంలో దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్కెట్లో 12 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 76,906 కోట్లు) కుమ్మరించాయి. ఈ మొత్తం విదేశీ పోర్ట్‌ఫోలియో (ఎఫ్‌పీఐలు) జరిపిన నికర కొనుగోళ్లకంటే బాగా ఎక్కువ.

తాజా గణాంకాల ప్రకారం ఈ మధ్యకాలంలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. 5,278 కోట్లే (0.81 బిలియన్‌ డాలర్లు). ఈక్విటీలను సైతం భారత్‌ ఇన్వెస్టర్లు ఒక ఆస్తిగా పరిగణించడంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రిటైల్‌ ఇన్వెస్టర్ల పొదుపు ప్రవహిస్తున్నదని మార్నింగ్‌స్టార్‌ సీనియర్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు.

దాంతో గత కొద్దినెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో నికర అమ్మకాలు జరుపుతున్నప్పటికీ, దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ భారీ కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌ స్థిరంగా కొనసాగుతుందన్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లతో పాటు హైనెట్‌వర్త్‌ ఇన్వెస్టర్లు కూడా ఈక్విటీ మార్కెట్‌వైపు చూస్తున్నారని కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ అన్సూల్‌ సైగల్‌ తెలిపారు.  

గత రెండు నెలల్లో మరింత జోరు...
ముఖ్యంగా గత రెండు నెలల్లో (ఆగస్టు–సెప్టెంబర్‌) ఫండ్‌ మేనేజర్లు స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల జోరు పెంచారు. భౌగోళిక ఉద్రిక్తతలు, భారత్‌ ఆర్థికాభివృద్ధి మందగించడం వంటి పలు కారణాలవల్ల ఈ మధ్యకాలంలో విదేశీ ఇన్వెస్టర్లు వారి పెట్టుబడుల్ని వెనక్కు తీసుకుంటుంటే...దేశీ ఫండ్‌ మేనేజర్లు మాత్రం పెట్టుబడులు పెంచుకున్నారని విశ్లేషకులు వివరించారు. ఈ రెండు నెలల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ రూ. 35,000 కోట్లు పెట్టుబడిచేయగా, ఎఫ్‌పీఐలు రూ. 24,000 కోట్లు వెనక్కు తీసుకున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top