పెట్టుబడులకు దిగ్గజాల సై!

Rs 68,000 crores to domestic food sector - Sakshi

దేశీ ఫుడ్‌ రంగంలోకి రూ.68,000 కోట్లు

జాబితాలో ఐటీసీ, పెప్సికో, హెర్షీ, కోక్, పతంజలి

ఫుడ్‌ ఇండియా సదస్సు తొలిరోజు 13 ఎంఓయూలు

న్యూఢిల్లీ: అపార అవకాశాలున్న దేశ ఆహార, వ్యవసాయ రంగంలో వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేసేందుకు దేశ, విదేశీ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఇందుకు సంబంధించిన పెట్టుబడి ప్రణాళికలను ఐటీసీ, పెప్సికో, హెర్షీ, పతంజలి, కోకకోలా తదితర కంపెనీలు వెల్లడించాయి. రూ.68,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలను సైతం కుదుర్చుకున్నాయి.

ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన  ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా 2017’ సదస్సు ఇందుకు వేదికయింది. సదస్సు తొలి రోజున 13 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ‘‘సదస్సు మొదటి రోజున రూ.68,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.  ఈ పెట్టుబడులు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు, గణనీయంగా ఉద్యోగాలు కల్పించాలన్న మా లక్ష్యాలకు సాయపడనున్నాయి’’ అని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ తెలిపారు.

దేశ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ రూ.10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేసి 20 సమగ్ర ఆహార ప్రాసెసింగ్, లాజిస్టిక్‌ పార్క్‌లను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ బ్రాండెడ్‌ ఆహార ఉత్పత్తులను తయారు చేస్తుంది.
పతంజలి సంస్థ కూడా రూ.10,000 కోట్ల రూపాయిలను పెట్టుబడులుగా పెట్టనుంది.
పెప్సికో ఐదేళ్లలో తన భాగస్వామ్య కంపెనీలతో కలసి భారత్‌లో 2 బిలియన్‌ డాలర్లు (రూ.12,800 కోట్లు) ఇన్వెస్ట్‌ చేస్తుంది.
కోకకోలా పళ్ల రసాల బాట్లింగ్‌కు, పళ్ల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ఎక్విప్‌మెంట్‌పై రూ.11,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనుంది.
అమెరికా చాక్లెట్‌ తయారీ దిగ్గజం హెర్షీ సైతం ఐదేళ్లలో 50 మిలియన్‌ డాలర్లు (రూ.320 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనుంది.

కంపెనీల స్పందనలు
‘‘సహజ వనరులకు కొరత, పెరుగుతున్న జనాభాకు ఆహార అవసరాల నేపథ్యంలో వ్యవసాయ ఉత్పాదకను బలోపేతం చేయడంపై పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి’’
– పౌల్‌ బుల్కే, నెస్లే చైర్మన్‌

‘‘ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది. భారత్‌లో ఆహార రంగంలో అవకాశాలు అపారం. భారత్‌లో సాగు వనరులు దండిగా ఉండడంతో ప్రాసెసింగ్‌ పరిశ్రమకు  అవకాశాలున్నాయి’’     – అమండాసౌరి, యునిలీవర్‌ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌

‘‘ఆహార ప్రాసెసింగ్‌లో మన స్థానాన్ని పెంచేందుకు పెట్టుబడులు పెరగాల్సి ఉంది’’     – నోయెల్‌ టాటా, ట్రెంట్‌ చైర్మన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top