పబ్లిసిటీకి మోదీ ప్రభుత్వం భారీ ఖర్చు

Rs 37,54,06,23,616 - Narendra Modi Govt's Expenditure on Publicity Blitz Since 2014 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మూడేళ్ల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం పబ్లిసిటీకి భారీ ఎత్తునే ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు మూడున్నర ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం రూ.3,754 కోట్ల వెచ్చించినట్టు ఆర్‌టీఐ ఫిర్యాదులో వెల్లడైంది. ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా, అవుట్‌డోర్‌ పబ్లిసిటీల ద్వారా 2014 ఏప్రిల్‌ నుంచి 2017 అక్టోబర్‌ వరకు ప్రకటనలపై రూ.37,54,06,23,616 ఖర్చుచేసినట్టు సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రేటర్‌ నోయిడాకు చెందిన సామాజిక కార్యకర్త రామ్‌వీర్‌ తన్వార్‌ ఫిర్యాదు మేరకు సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాలను వెల్లడించింది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రకటనలకు రూ.1,656 కోట్లు, ప్రింట్‌ మీడియాకు రూ.1,698 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు వెల్లడైంది.

హోర్డింగ్స్‌, పోస్టర్స్‌, బుక్‌లెట్స్‌, క్యాలెండర్స్‌ వంటి అవుట్‌డోర్‌ ప్రకటనలకు రూ. 399 కోట్లను వెచ్చిస్తున్నట్టు ఆర్‌టీఐ బహిర్గతం చేసింది. ఈ బడ్జెట్‌ను పబ్లిసిటీ బిజినెస్‌ల కోసం కీలక మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వ ప్లాగ్‌షిప్‌ ప్రొగ్రామ్‌లకు అందజేస్తారు. నరేంద్రమోదీ ఫీచరింగ్‌గా వచ్చిన ప్రకటనల కోసం 2014 జూన్‌నుంచి 2016 ఆగస్టు 31 వరకు రూ, 1100 కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేసిందని తన్వార్‌ స్పష్టం చేశారు. ప్రతి నెలా ప్రధాని మోదీ జీ ప్రసంగించే 'మన్‌ కీ బాత్‌'  కార్యక్రమం ప్రచురించడానికి ఒక్క న్యూస్‌పేపర్‌ ప్రకటకే రూ.8.5 కోట్లు  ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top