లీజుకు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కార్యాలయం

Reliance Infra to lease out headquarters in Mumbai to reduce debt - Sakshi

రుణాల చెల్లింపునకు కంపెనీ ప్రయత్నాలు

2020 నాటికి రుణరహిత సంస్థగా మారాలని లక్ష్యం

న్యూఢిల్లీ: రుణభారం తగ్గించుకునే దిశగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఆర్‌ఇన్‌ఫ్రా) మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముంబైలోని శాంటాక్రూజ్‌ ఈస్ట్‌లో ఉన్న రిలయన్స్‌ సెంటర్‌ ఆఫీస్‌ కార్యాలయాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ డీల్‌ ద్వారా వచ్చే నిధులను పూర్తిగా రుణాల చెల్లింపునకు మాత్రమే వినియోగించనున్నట్లు పేర్కొంది. ‘కార్యాలయాన్ని దీర్ఘకాలిక లీజుకివ్వడం ద్వారా నిధులు సమకూర్చుకుంటాం. సదరు ఆవరణ మాత్రం రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ యాజమాన్యంలోనే ఉంటుంది‘ అని స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు కంపెనీ తెలియజేసింది.

2020 నాటికి రుణ రహిత సంస్థగా మారాలని నిర్దేశించుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం రిలయన్స్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను గ్రూప్‌ కంపెనీలకు ముంబైలో ఉన్న వివిధ కార్యాలయాలకు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు సుమారు రూ. 6,000 కోట్ల రుణభారం ఉంది. మరో గ్రూప్‌ సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌)కు రూ, 57,500 కోట్ల అప్పులు ఉన్నాయి. వీటిలో రూ. 7,000 కోట్ల మొత్తాన్ని సొంత గ్రూప్‌ కంపెనీలకే ఆర్‌కామ్‌ చెల్లించాల్సి ఉంది.  

బ్లాక్‌స్టోన్‌తో చర్చలు..
అధికారికంగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వెల్లడించనప్పటికీ.. లీజు ప్రతిపాదనలకు సంబంధించి బ్లాక్‌స్టోన్‌ సహా పేరొందిన పలు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు, అమెరికాకు చెందిన ఒక ఫండ్‌ సంస్థతో కం పెనీ చర్చలు జరుపుతోందని సమాచారం. 15,514 చ.మీ. ప్లాట్‌లో నిర్మించిన రిలయన్స్‌ సెంటర్‌ ఆఫీస్‌ భవంతి విస్తీర్ణం సుమారు 6.95 లక్షల చ.అ.లు ఉంటుంది. 425 కార్లకు పార్కింగ్‌ స్పేస్‌ ఉంది.
సోమవారం బీఎస్‌ఈలో ఆర్‌ఇన్‌ఫ్రా షేరు 4.4 శాతం క్షీణించి రూ. 53.05 వద్ద క్లోజయ్యింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top