షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

Redmi K20 Pro and Redmi K20 launched in India - Sakshi

వజ్రాలు పొదిగిన ఈ మోడల్‌ భారత్‌కు ప్రత్యేకం

కేవలం 20 పీసులు మాత్రమే అందుబాటులోకి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం ఫీచర్లతో తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్న చైనా టెక్నాలజీ కంపెనీ షావొమీ.. మరో సంచలనానికి సిద్ధమైంది. ‘రెడ్‌మీ కె20 ప్రో’ మోడల్‌ ఆధారంగా లిమిటెడ్‌ ఎడిషన్‌లో అత్యంత ఖరీదైన వేరియంట్‌ తయారీకి శ్రీకారం చుట్టింది. దీని ఖరీదు రూ.4.8 లక్షలు. బంగారంతో తయారైన బ్యాక్‌ ప్యానెల్‌తో ఇది రూపుదిద్దుకుంది. 100 గ్రాముల పసిడి వాడారు. ప్యానెల్‌ వైపు ‘కె’ అనే అక్షరంపై 20 వజ్రాలను పొదిగారు. కేవలం 20 పీసులను మాత్రమే తయారు చేస్తారు. విశేషమేమంటే ఇవి భారత్‌లో తయారవుతున్నాయి. అంతేకాదు భారత్‌కు మాత్రమే ప్రత్యేకం. ఫోన్‌ నుంచి ప్యానెల్‌ను విడదీయడానికి వీలుకాకుండా డిజైన్‌ చేశారు.

చారిటీకి వినియోగిస్తాం..
ఈ వేరియంట్‌ను విక్రయించాలా వద్దా అన్న విషయం ఇంకా నిర్ణయించలేదని షావొమీ ఇండియా ఎండీ మను కుమార్‌ జైన్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇన్విటేషన్‌ ద్వారా విక్రయించాలా, బహుమతిగా ఇవ్వడమా, వేలం వేయడమా అన్నది ఇంకా తేల్చలేదు. వీటి విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తాం. కె20 గుర్తుగా బ్యాక్‌ ప్యానెల్‌పై ‘కె’ అని ముద్రించాం. ఇప్పటికే ఆసక్తి కనబరిచిన కస్టమర్లు  ‘కె’ బదులు, తమ పేరులోని మొదటి అక్షరాన్ని ముద్రించాలని కోరారు’ అని వివరించారు.

కస్టమైజ్‌ చేయాల్సిందే..
చైనాలో షావొమీ విస్తృత శ్రేణిలో పలు ఉత్పత్తులను రూపొందించి విక్రయిస్తోందని, వీటిని భారత్‌లో ప్రవేశపెట్టాలంటే ప్రతి ఉత్పాదనలో మార్పులు చేయాల్సి ఉంటుందని మను కుమార్‌ వెల్లడించారు. దశలవారీగా వీటిని ఇక్కడ పరిచయం చేస్తామన్నారు. షావొమీ కోసం షూస్, టీ–షర్ట్స్, ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌ తయారీకై దేశంలోని పలు మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్‌ఫోన్లకై సంస్థకు దేశంలో నాలుగు ప్రాంతాల్లో ఏడు తయారీ కేంద్రాలున్నాయి. సెకనుకు మూడు ఫోన్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top