జిల్లాల్లోనూ రియల్‌ జోరు!

Real estate boom in districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత ఏడాది కాలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం హైదరాబాద్‌ చుట్టుపక్కలే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచైతే మరీనూ! బ్యాంక్‌ల్లోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఉపసంహరించి మరీ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం ఒక్కసారిగా రెండింతలైంది.

దీనికి తోడు నగరంతో పాటూ జిల్లాల్లో పరిశ్రమలు, ఐటీ కేంద్రాల ఏర్పాటుతో జిల్లాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో ఐటీ, స్టార్టప్స్‌ కంపెనీలొచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో హైదరాబాద్‌తో సమాంతరంగా ఈ రెండు జిల్లాల అభివృద్ధి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నగరానికి దీటుగా జిల్లాల్లోనూ రియల్‌ రంగం పరుగులు పెడుతోంది. యాదాద్రి క్షేత్రం అభివృద్ధికి సర్కారు చర్యలు చేపట్టడం, హైదరాబాద్‌–వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తుండటంతో ఈ మార్గంలో పెద్ద ఎత్తున రియల్‌ వెంచర్లు వెలిశాయి. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు ఈ మార్గంలో ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ నిర్మాణాలు, స్థలాల క్రయవిక్రయాలు క్రమంగా పెరిగాయి.

  హైదరాబాద్‌లోనే కాకుండా ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లోనూ స్థిరాస్తి రంగం వేగంగా పుంజుకుంది. కరీంనగర్‌ను ప్రభుత్వం స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేసింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు కూడా రాబోతున్నాయి. ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ కూడా ఇటీవలే ప్రారంభమైంది. వరంగల్‌లో ఐటీ విస్తరణకు ప్రణాళికలను సిద్ధం చేసింది ప్రభుత్వం.

టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు శ్రీకారం చుట్టింది. కొరియా, చైనాకు చెందిన పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని టీఎస్‌ఐఐసీ సీఈఓ వీ మధుసూదన్‌ తెలిపారు. ఇవన్నీ ఆయా జిల్లాల్లో స్థిరాస్తి రంగ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top