ధరలపై ఆర్‌బీ‘ఐ’!

RBI paints a  Goldilocks economy as trade war looms - Sakshi

కీలక పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగింపు

రెపో రేటు 6 శాతం, రివర్స్‌ రెపో 5.75 శాతం, సీఆర్‌ఆర్‌ 4 శాతం

తొలి ఆరు నెలలకు ద్రవ్యోల్బణం లక్ష్యాలు తగ్గింపు 

సాధారణ వర్షాలు, మోస్తరు ఆహార ధరలు పరిగణనలోకి 

వృద్ధి రేటు 7.4 శాతానికి పెరుగుతుందని అంచనా 

ముంబై: పెరుగుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యలోటు లక్ష్యాల చేరికలో కేంద్రం వెనుకబడి ఉండడం, ఆహార ధరలు పెరుగుదల... ఈ అంశాల నేపథ్యంలో ఆర్‌బీఐ కీలకమైన రేట్లలో ఎటువంటి మార్పులకు సాహసించలేదు. భవిష్యత్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ద్రవ్యపరపతి విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి సమీక్షలో భాగంగా ఎంపీసీ బుధ, గురువారాల్లో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన భేటీ అయి తాజా నిర్ణయాలను తీసుకుంది. రెపో రేటును 6 శాతంగా, రివర్స్‌ రెపో రేటును 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌)ని 4 శాతంగా కొనసాగించింది. కీలక రేట్లలో యథాతథ పరిస్థితిని కొనసాగించడం గతేడాది ఆగస్ట్‌ నుంచి ఇది వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం. ఆర్‌బీఐ ఎటువంటి మార్పులు చేయకపోయినప్పటికీ బ్యాంకులు తమ నిధుల లభ్యత అవసరాలకు అనుగుణంగా డిపాజిట్‌ రేట్లు, రుణ రేట్లలో మార్పులు చేసే అవకాశాల్లేకపోలేదు. ఆర్‌బీఐ రేట్లలో మార్పులు చేయకపోవడానికి దారితీసిన అంశాలను చూస్తే... మధ్యకాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్షిత స్థాయిలో కొనసాగించాలన్నది ఆర్‌బీఐ విధానం. అయితే, పెరుగుతున్న చమురు, ఆహార ధరలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎంపీసీ పరిగణనలోకి తీసుకుంది. అలాగే, గత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య, రెవెన్యూలోటు సవరించిన అంచనాల కంటే తక్కువే ఉంటుందన్న ప్రభుత్వం ప్రకటనలను కూడా పరిశీలనలోకి తీసుకుంది. ఎంపీసీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు మైకేల్‌పాత్రా ఒక్కరే రేట్లను పావు శాతం మేర పెంచాలని ఓటువేయడం విశేషం.

అనిశ్చిత పరిస్థితుల వల్లే: పటేల్‌ 
ఒకవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మొదటి ఆరు నెలల కాలానికి సంబంధించి ద్రవ్యోల్బణ అంచనాలను ఎంపీసీ 4.7–5.1 శాతానికి తగ్గించింది. ఫిబ్రవరిలో జరిగిన గత పాలసీ సమీక్షలో 5.1–5.6 శాతంగా అంచనా వేసిన విషయం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో ద్రవ్యోల్బణం 4.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. గత అంచనాలు 4.5–4.6 కంటే తక్కువ కావడం గమనార్హం. సాధారణ వర్షాలకు అవకాశాలు ఉండడం, ఆహార ధరల పెరుగుదల మోస్తరుగానే ఉండడంతో అంచనాలను కుదించింది. అయితే, ఎంపీసీ ఎప్పుడూ ముందుచూపుతో వ్యవహరిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ‘‘బేస్‌లైన్‌ (వినియోగ ధరల ఆధారిత) ద్రవ్యోల్బణం పరంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని ఎంపీసీ భావిస్తోంది. అందులో మొదటిది కేంద్ర బడ్జెట్‌లో ఖరీఫ్‌ పంటలకు సంబంధించి ప్రకటించిన కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) విధానం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుంది. ఇది ఎంత అనేది రానున్న నెలల్లో స్పష్టం కానుంది. రెండోది పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి అద్దె భత్యం సవరింపు హెడ్‌లైన్‌ (టోకు ధరల ఆధారిత) ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. మూడో అంశం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొన్న ద్రవ్యలోటు అంచనాలను చేరుకోలేకపోతే అది ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది’’అని ఉర్జిత్‌ పటేల్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధిక వ్యయాల పరంగానూ ద్రవ్యలోటు ముప్పు పొంచి ఉందన్నారు.  

వృద్ధి రేటుకి రెక్కలు...
2018–19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుతుందని ఎంపీసీ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.6 శాతమే. పెట్టుబడుల వాతావరణం మెరుగుపడడమే అంచనాల పెంపునకు కారణం. దీని కారణంగా  క్యాపిటల్‌ గూడ్స్‌ ఉత్పత్తి స్థిరంగా విస్తరిస్తుందని ఎంపీసీ పేర్కొంది. అంతర్జాతీయ డిమాండ్‌ పెరుగుతుండడంతో ఎగుమతులు ఊపందుకుంటాయని ప్రస్తావించింది. మొదటి ఆరు నెలల్లో 7.3–7.4 శాతానికి, తర్వాతి ఆరు నెలల్లో 7.3–7.6 శాతానికి పెరుగుతుందని ఎంపీసీ అంచనా వేసింది.

పాలసీ ముఖ్యాంశాలు
►రెపో రేటు 6 శాతం, రివర్స్‌ రెపో రేటు 5.75% 
►2018 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ ద్రవ్యోల్బణం అంచనా 4.7–5.1% 
►2019 మార్చి వరకు ద్రవ్యోల్బణం అంచనా 4.4% 
►జీడీపీ వృద్ధి అంచనాలు 7.4 శాతం 
►చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలతో స్వల్పకాలంలో ద్రవ్యోల్బణంపై అనిశ్చితి 
►ద్రవ్యోల్బణంపై రాష్ట్రాల ద్రవ్యలోటు సమస్యలు 
►అంతర్జాతీయ డిమాండ్‌తో ఎగుమతులు పుంజుకుంటాయని ఆశాభావం 
►తదుపరి పాలసీ సమీక్ష జూన్‌ 6న.

వర్చువల్‌ కరెన్సీలపై మరిన్ని ఆంక్షలు 
బిట్‌కాయిన్‌ తరహా వర్చువల్‌ కరెన్సీల్లో లావాదేవీలకు సేవలు అందించొద్దని బ్యాంకులు, తన పరిధిలోని ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. సమర్థత పెంపుతోపాటు ఆర్థిక సేవల విస్తృతికి తోడ్పడే సామర్థ్యం వర్చువల్‌ కరెన్సీలు సహా టెక్నాలజీ ఆవిష్కరణలకు ఉందని పేర్కొంది. అయినప్పటికీ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, నల్లధన చలామణికి సంబంధించి వీటితో సమస్యలు ఉన్నట్టు పేర్కొంది. ఈ దృష్ట్యా ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని సంస్థలు వర్చువల్‌ కరెన్సీల్లో లావాదేవీల నిర్వహణకు వీలుగా సేవలు అందించొద్దని ఆదేశిస్తున్నట్టు పేర్కొంది.

అధికారిక డిజిటల్‌ కరెన్సీపై కసరత్తు.. 
అధికారిక డిజిటల్‌ కరెన్సీల జారీ చేసే అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా అంతర్‌విభాగాల కమిటీని ఏర్పాటు చేసింది. ‘సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ’ ఆవశ్యకత, సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి జూన్‌ నాటికల్లా నివేదికను సమర్పిస్తుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ బిపి కనుంగో తెలిపారు. ‘పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు.. అధికారిక డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టే అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. ప్రైవేట్‌ డిజిటల్‌ టోకెన్స్‌కి భిన్నంగా వీటిని సెంట్రల్‌ బ్యాంకే జారీ చేయడం వల్ల దానిదే బాధ్యత ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పేపర్‌ కరెన్సీకి అదనంగా ఇవి కూడా చలామణీలో ఉంటాయి’ అని చెప్పారు.

జీవీఏ వద్దు.. జీడీపీయే ముద్దు!
వృద్ధి అంచనాల కొలమానానికి గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ) విధానం నుంచి ఆర్‌బీఐ మళ్లీ పూర్వపు గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ (జీడీపీ) విధానానికి మళ్లింది. కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి నుంచి జీవీఏ విధానాన్ని వృద్ధి అంచనాల విశ్లేషణకు వినియోగిస్తోంది. ఇందుకు బేస్‌ సంవత్సరంగా 2018 జనవరికి మార్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే తిరిగి జీడీపీకి మారినట్టు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య తెలిపారు.  తయారీ, సరఫరా పరంగా ఆర్థిక కార్యకలాపాలను జీవీఏ ప్రతిఫలిస్తే.. జీడీపీ వినియోగదారులు, డిమాండ్‌ను ప్రతిఫలిస్తుంది.  
భారతీయ అకౌంటింగ్‌కు మరో ఏడాది  భారతీయ అకౌంటింగ్‌ ప్రమాణాలు (ఇండ్‌ఏఎస్‌) అమలుకు బ్యాంకులకు మరో ఏడాది గడువు ఇస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. కొత్త విధానానికి బ్యాం కులు సన్నద్ధం కాకపోవడంతో ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తొలుత పేర్కొన్న ప్రకారం అయితే ఈ గడువు ఏప్రిల్‌1తో ముగిసిపోయింది.

చట్టాల్లో అసమానత్వాన్ని సరిచేయాలి: ఆర్‌బీఐ
ప్రైవేటు రంగ బ్యాంకులపై పూర్తి నియంత్రణాధికారాలు ఉండి, అదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులపై పరిమిత అధికారాల నేపథ్యంలో... చట్టపరంగా అసమానత్వాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. ఇందుకుగాను బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ చట్టంలో సవరణలు తీసుకురావాలని పాలసీ సమీక్ష సందర్భంగా కోరింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)లో రూ.13,000 కోట్ల కుంభకోణాన్ని గుర్తించడంలో ఆర్‌బీఐ విఫలమైందన్న విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

పాలసీ గురించి ఎవరేమన్నారంటే...
ద్రవ్యోల్బణ అంచనాలు కుదించడం, వృద్ధి అంచనాలు పెంచడం సానుకూలం. ఆర్‌బీఐ రేట్లలో మార్పులు చేయకుండా ఉండడం ఆశ్చర్యం కలిగించేదే. 
– రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌ 
 
ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గించడం ఆర్‌బీఐ పాలసీలో ఎంతో సానుకూల అంశం. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, జీడీపీ వృద్ధి రేటు పెరుగుదల అన్నవి ఆర్థిక వ్యవస్థ పురోగతికి కీలకమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఎంపీసీ గుర్తించింది. 
– చందాకొచర్, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో 
 

ఆర్‌బీఐ నుంచి ఇది ఊహించని విధానం. ఒకవైపు ద్రవ్యోల్బణ సమస్యలను హైలైట్‌ చేస్తూనే అదే సమయంలో మరోవైపు ద్రవ్యోల్బణ అంచనాలను ఎంపీసీ తగ్గించింది. 
– అభిషేక్‌ బారువా, హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ ఎకనమిస్ట్‌ 
 

వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుంటూనే ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యం వద్ద కొనసాగించాలన్న ఆర్‌బీఐ కట్టుబాటును పాలసీ తెలియజేస్తోంది.
– దీనబంధు మహాపాత్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ  

పాలసీ  రేట్ల తగ్గింపును ఆర్‌బీఐ పరిశీలిస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం. దీని ద్వారా డిమాండ్, పెట్టుబడులకు ఊతం లభిస్తుంది. 
– రషేష్‌ షా, ఫిక్కీ ప్రెసిడెంట్‌ 
 

ఎంఎస్‌పీ ప్రభావం, ద్రవ్యలోటు లక్ష్యాలు తప్పే అవకాశం వంటి రిస్క్‌లను ఆర్‌బీఐ సరిగానే అంచనా వేసింది. ద్రవ్యోల్బణం అంచనాలు, జీడీపీ, వర్షాలు, చమురు ధరలు వంటివన్నీ వేచి చూడాల్సినవే. 
– సందీప్‌ జజోదియా, అసోచామ్‌ ప్రెసిడెంట్‌ 
 
యథాతథ స్థితిని ఆహ్వానిస్తున్నాం. ద్రవ్యోల్బణం సౌకర్యవంతమైన జోన్‌ లోనే ఉన్నందున పావు శాతం మేర రేట్ల కోతకు అవకాశాలు అయితే ఉన్నాయి. 
– అనిల్‌ ఖైతాన్, పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top