నాలుగో రోజూ రికార్డ్‌ల ర్యాలీ

Rally records for the fourth day - Sakshi

ఇంట్రాడేలో, ముగింపులో కొత్త శిఖరాలకు సూచీలు

నేపథ్యం.. అంచనాలను మించుతున్న క్యూ3 ఫలితాలు

బడ్జెట్‌పై ఆశలు  

ముంబై: స్టాక్‌ మార్కెట్లో సోమవారం రికార్డ్‌ల ర్యాలీ కొనసాగింది. ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ స్టాక్‌ సూచీలు మళ్లీ కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. స్టాక్‌ సూచీలు కొత్త శిఖరాలకు చేరడం ఇది వరుసగా నాలుగో రోజు. కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు ఆరోగ్యకరంగా ఉన్న నేపథ్యంలో విదేశీ నిధులు నిలకడగా వస్తుండడం, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు జోరుగా ఉండడం, బడ్జెట్‌పై ఆశావహ అంచనాల కారణంగా స్టాక్‌ మార్కెట్‌ పరుగులు పెడుతూనే ఉంది.

తొలిసారిగా సెన్సెక్స్‌ 35,800 పాయింట్లపైకి ఎగబాకగా,  నిఫ్టీ 10,975 పాయింట్లను తాకింది. బ్యాంక్‌ నిఫ్టీ 27వేల పాయింట్లపైకి ఎగసింది. అమెరికా షట్‌ డౌన్‌ కారణంగా అంతర్జాతీయ సంకేతాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, ఇటీవల కొన్ని వస్తువులు, సేవలపై జీఎస్‌టీ రేట్లను తగ్గించడం కూడా కలసివచ్చింది. చివర్లో కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్‌ సూచీల లాభాలు తగ్గాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 286 పాయింట్లు లాభపడి 35,798 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 10,966 పాయింట్ల, బ్యాంక్‌ నిఫ్టీ 132 పాయింట్లు లాభంతో 27,041 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలకమైన 11,000 పాయింట్లకు నిఫ్టీ కేవలం 34 పాయింట్ల దూరంలోనే ఉంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 316 పాయింట్ల లాభంతో 35,828 పాయింట్ల, నిఫ్టీ 80 పాయింట్లు లాభంతో 10,975 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకాయి.  కాగా గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్‌ 1,027 పాయింట్లు పెరిగింది.

3,000 దాటిన టీసీఎస్‌
స్టాక్‌ సూచీల లాగానే టీసీఎస్‌ షేర్‌ కూడా జీవితకాల గరిష్ట స్థాయి, రూ.3,130ను తాకింది. 5.3 శాతం లాభంతో రూ.3,113 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. హెచ్‌పీసీఎల్‌ విలీనానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇంట్రాడేలో 6 శాతం వరకూ ఎగసిన ఓఎన్‌జీసీ షేర్‌ చివరకు 3.2 శాతం లాభంతో రూ.200 వద్ద ముగిసింది.

ఫలితాలు అంచనాలను అధిగమించడంతో ఇంట్రాడేలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆల్‌టైమ్‌ హైని తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు కూడా జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. క్యూ3 ఫలితాలు బాగా ఉంటుండటంతో మార్కెట్‌ జోరు కొనసాగుతోందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, బడ్జెట్‌పై అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top