8,000 కోట్లు ఆవిరి

punjab national bank sacm - Sakshi

కరిగిపోయిన ఇన్వెస్టర్ల సంపద

రెండు రోజుల్లో పీఎన్‌బీ షేరు 22% పతనం

రూ. 31వేల కోట్లకు మార్కెట్‌ క్యాప్‌ డౌన్‌

న్యూఢిల్లీ: కుంభకోణంలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) షేర్ల పతనం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజున పీఎన్‌బీ షేరు మరో 12 శాతం క్షీణించింది. బీఎస్‌ఈలో రూ. 128.35కి పడిపోయింది. స్కాం బైటపడిన బుధవారం నాడు షేరు సుమారు పది శాతం క్షీణించింది. దీంతో రెండు రోజుల వ్యవధిలోనే బ్యాంకు మార్కెట్‌ విలువ ఏకంగా రూ. 8,077 కోట్ల మేర కరిగిపోయినట్లయింది.

ఇది పీఎన్‌బీ వార్షిక లాభానికి ఆరు రెట్లు పైగా కావడం గమనార్హం. షేరు రెండు రోజుల పతనంతో గురువారం పీఎన్‌బీ మార్కెట్‌ విలువ రూ. 31,132 కోట్లకు పడిపోయింది.  మరోవైపు, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు కూడా క్షీణించాయి. గురువారం బీఎస్‌ఈలో 4.30 శాతం తగ్గి రూ. 1,199 వద్ద క్లోజయ్యాయి. 

పీఎన్‌బీ నుంచి పొందిన లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ)ని అడ్డం పెట్టుకుని బిలియనీర్‌ నీరవ్‌ మోదీ .. బ్యాంకులను రూ. 11,400 కోట్ల మేర బురిడీ కొట్టించిన సంగతి తెలిసిందే. స్కాం బైటపడిన బుధవారం రోజున షేర్లలో అమ్మకాలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ. 20,000 కోట్ల మేర క్షీణించింది.  

గీతాంజలి జెమ్స్‌కి కూడా సెగ..
నీరవ్‌ మోదీతో లింకులున్న కారణంగా గీతాంజలి జెమ్స్‌ సంస్థ షేర్లు కూడా భారీగా క్షీణిస్తున్నాయి. కుంభకోణం బైటపడిన అనంతరం గీతాంజలి జెమ్స్‌ షేర్లలో రెండు రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సుమారు రూ. 130 కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. ఫిబ్రవరి 12న దాదాపు రూ. 745 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువ గురువారం ఉదయం సెషన్లో రూ. 612 కోట్ల స్థాయికి పడిపోయింది.

మొత్తం మీద గురువారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు సుమారు 20 శాతం క్షీణించి రూ. 46.90 వద్ద క్లోజయ్యింది. నీరవ్‌ మోదీ మేనమామ మెహుల్‌ చోక్సీ.. గీతాంజలి జెమ్స్‌ ప్రమోటరుగా ఉన్నారు. కంగనా రనౌత్, సన్నీ లియోన్‌ వంటి బాలీవుడ్‌ స్టార్స్‌ దీనికి బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా ఉన్నారు.  రూ. 11,400 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో గీతాంజలి జెమ్స్, జిన్ని, నక్షత్ర సంస్థల పాత్ర కూడా ఉందని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.  

చోక్సీ, గీతాంజలి మార్కెట్‌ లావాదేవీలపై సెబీ కన్ను..
స్కాం దరిమిలా మెహుల్‌ చోక్సీ, గీతాంజలి జెమ్స్‌ సహా.. నీరవ్‌ మోదీతో సంబంధమున్న సంస్థలు, వ్యక్తుల స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలన్నింటిపైనా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. స్టాక్‌ ఎక్సే్చంజీలు, నియంత్రణ సంస్థలకు సక్రమంగా వెల్లడించకపోవడంతో పాటు ఈ వారం జరగాల్సిన బోర్డు మీటింగ్‌ను సరైన కారణాలేవీ చూపకుండా వాయిదా వేయడం తదితర అంశాలకు సంబంధించి చోక్సీ, ఆయనకు చెందిన గీతాంజలి జెమ్స్‌ వ్యవహారంపై సెబీ విచారణ జరుపుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top