బ్యాంకు ఉద్యోగాలకు ఎసరు!

Public and private banks in cuts to employees - Sakshi

వేగంగా విస్తరిస్తున్న రోబోటిక్, ఏఐ టెక్నాలజీ

ఉద్యోగుల కోతలో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి 16 వేల మంది ఔట్‌ 2020 వరకూ కొత్త రిక్రూట్‌మెంట్‌లూ లేనట్లే! ఈ మేరకు ప్రభుత్వంతో కొన్ని బ్యాంక్‌ల ఒప్పందం వచ్చే ఏడాదిలో 22 వేల ఉద్యోగులకు గుడ్‌బై! వ్యయ నియంత్రణకు విస్తరణ, విస్తీర్ణానిక్కూడా చెక్‌

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), రోబోటిక్‌ సాంకేతికత.. బ్యాంకింగ్‌ రంగాన్ని కుదిపేస్తోంది. ఈ ప్రభావం ఉద్యోగులపై పడుతోంది. ఫలితం... పలు బ్యాంకులు క్లర్కులు, బ్యాక్‌ ఆఫీస్‌ ఉద్యోగులను
తొలగించి నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇది చాలదననట్లు.. నష్టాల్లో ఉన్న బ్యాంక్‌లను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సైతం వాటితో టీఏపీ (టర్న్‌ అరౌండ్‌ ప్లాన్‌) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫలితంగా నిధుల సమీకరణ.. విస్తరణ, ఉద్యోగుల నియామకం అన్నిం టికీ ప్రభుత్వ బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి! 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:దేశంలో బ్యాంక్‌ ఉద్యోగాల్లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య కన్నా ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న వారే అధికం.  ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ బ్యాంక్‌ బ్రాంచీలు సుమారు 1.10 లక్షలుండగా వీటిలో దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులున్నారు. కొత్త వారిని నియమించి ఈ ఉద్యోగుల సంఖ్యను పెంచటం మాట అటుంచితే... ఈ మధ్య దిగ్గజ బ్యాంకులు కూడా ఉద్యోగుల కోతలో పడ్డాయి. గడిచిన 8 నెలల్లో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐలు దాదాపు 16 వేల మంది ఉద్యోగులను తొలగించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ ఈ ఏడాది జులై – సెప్టెంబర్‌ మధ్య 1,082 మంది ఉద్యోగులను తొలగించింది. జూన్‌ 2017 నాటికి ఈ బ్యాంకులో 84,140 మంది ఉద్యోగులు ఉండగా... అక్టోబర్‌ నాటికి ఈ సంఖ్య 83,058కి తగ్గింది. వృద్ధి క్షీణించడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జులై– అక్టోబర్‌ మధ్య 4,581 మందిని  తొలగించింది. ఈ ఏడాది 2,700 మందిని నియమించుకుంది. డిసెంబర్‌ 2016 నాటికి ఈ బ్యాంకులో 90,421 మంది ఉద్యోగులుండగా.. ఇప్పుడా సంఖ్య 86,750కి చేరింది. 
ఇక ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐది కూడా ఇదే పరిస్థితి. ఐదు అనుబంధ బ్యాంక్‌ల విలీనంతో 70 వేల మంది ఉద్యోగులు ఎస్‌బీఐలో విలీనమయ్యారు.. కానీ, ఆ తర్వాత 6 నెలల్లో 10,584 మంది ఉద్యోగులను సంస్థ తగ్గించుకుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 4,876 మందిని తొలగించే అవకాశమున్నట్లు ఎస్‌బీఐ వర్గాలు చెబుతున్నాయి. 2018 ఆర్ధిక సంవత్సరంలో 15,460 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు కూడా. ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య ఎస్‌బీఐ కొత్తగా 798 మంది ఉద్యోగులను మాత్రమే నియమించుకుంది. కానీ, ఇందులో 90 శాతం ప్రొబేషనరీ ఆఫీసర్లే. క్లర్క్‌ ఉద్యోగుల నియమకాలు దాదాపు నిలిచిపోయినట్లు బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. 

22 వేల ఉద్యోగులపై వేటు..! 
దేశీ బ్యాంకింగ్‌ రంగంలో 2006 నుంచి కారుణ్య నియామకాలను నిలిపివేశారు. గత 20 ఏళ్లుగా గ్రామీణ బ్యాంకుల్లో కొత్త ఉద్యోగ నియామకాలనేవి జరగటం లేదని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ జనరల్‌ సెక్రటరీ ఎస్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. బ్రాంచీల అవసరాలను బట్టి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మాత్రం నియమించుకుంటున్నారు. వీరికి రోజుకు రూ.320 నుంచి రూ.370 వరకు వేతనం చెల్లిస్తున్నారు. ఆటోమేషన్, రోబోటిక్‌ టెక్నాలజీల ప్రభావంతో వచ్చే ఏడాది కాలంలో సుమారు 22 వేల ఉద్యోగులను తొలగించే ప్రమాదముందని ఆయన చెప్పారు. 

90 శాతం సేవలు రోబో, ఏఐలతోనే.. 
కస్టమర్‌కు నాణ్యమైన, వేగవంతమైన సేవలందించేందుకు రోబోటిక్, ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో బ్యాంక్‌లు రంగంలోకి దిగుతున్నాయి. పాస్‌బుక్‌ ముద్రణ నుంచి మొదలెడితే నగదు, చెక్, డీడీ నిర్వహణ, కేవైసీ వెరిఫికేషన్, రుణాల ప్రాసెసింగ్, ఆర్ధిక ఉత్పత్తుల విక్రయం వంటివన్నీ రోబోలే చేసేస్తున్నాయి. దాదాపు 90 శాతం బ్యాంక్‌ సేవలను రోబో, ఏఐ టెక్నాలజీలే చేస్తున్నట్లు ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ సర్కిల్‌ జనరల్‌ సెక్రటరీ జి.సుబ్రహ్మణ్యం చెప్పారు. దీంతో బ్యాంక్‌లో క్లర్క్, నాల్గో తరగతి ఉద్యోగుల అవసరం తగ్గిందని.. డేటా ఎంట్రీ, బ్యాకెండ్‌ ఆఫీస్‌ జాబ్‌లైతే పూర్తిగా తొలగిపోయాయని చెప్పారాయన. 

బ్యాంక్‌లతో టీఏపీ ఒప్పందం.. 
ప్రస్తుతం నష్టాల్లో ఉన్న బ్యాంక్‌లను 2020 నాటికి లాభాల్లోకి తెచ్చేందకు ప్రభుత్వం టర్న్‌ ఎరౌండ్‌ ప్లాన్‌ను (టీఏపీ) తీసుకొచ్చింది. ఈ ఒప్పందంపై ఆయా బ్యాంక్‌ బోర్డ్‌ మెంబర్లు, ఉద్యోగులు, ఆఫీసర్లు సంతకాలూ చేయాలి. అంటే ఏ బ్యాంకైతే నష్టాల్లో ఉంటుందో దాని పరిహారాన్ని ఉద్యోగులు, ఆఫీసర్లు పంచుకోవాలన్నమాట. అంటే ఉద్యోగుల వేతనాలు, బ్యాంక్‌ నిర్వహణ తదితరాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. టీఏపీ కాల పరిమితిలో ఆయా బ్యాంక్‌లు శాఖలను విస్తరించడం, ఉద్యోగుల నియమించుకోవటం, నిధులు సమీకరించడం వంటివేవీ చేయకూడదని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐబీఓఏ) ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ తెలిపారు. ఆంధ్రా బ్యాంక్‌తో పాటు అలహాబాద్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దేనా బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్‌ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top