10,700 పైకి నిఫ్టీ

predict the stock market. Focus on these three factors while investing instead - Sakshi

తగ్గిన ఫెడ్‌ రేట్ల పెంపు భయాలు 

ఆర్థిక ఫలితాలపై ఆశావహ  అంచనాలు  

293 పాయింట్లు  ఎగసి 35,208కు సెన్సెక్స్‌  

97 పాయింట్ల లాభంతో  10,715కు నిఫ్టీ   

కంపెనీల ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సోమవారం స్టాక్‌మార్కెట్‌ లాభపడింది.  ఇటీవల బాగా నష్టపోయిన షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడం, ఆర్థిక, లోహ, వాహన షేర్లు రాణించడంతో  సెన్సెక్స్‌ 35,000 పాయింట్లు, నిఫ్టీ 10,700 పాయింట్లపైకి ఎగబాకాయి. ముడి చమురు ధరలు భగ్గుమన్నా, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ సూచీలు మంచి లాభాలు సాధించాయి. సెన్సెక్స్‌ 293 పాయింట్ల లాభంతో 35,208 పాయింట్ల వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 10,715 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలకు ఇది మూడు నెలల గరిష్ట స్థాయి.  సెన్సెక్స్‌ 34,984 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 344 పాయింట్ల లాభంతో 35,260 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది.  

బ్యాంక్‌ షేర్లు భళా.. 
రూ.10,000 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయనున్నామన్న  ఆర్‌బీఐ ప్రకటనతో బాండ్ల రాబడులు క్షీణించాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.  
తగ్గిన ఫెడ్‌ భయాలు.. 
గత శుక్రవారం వెలువడిన అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు. దీంతో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమీప భవిష్యత్తులో రేట్లను పెంచే అవకాశాలు తగ్గాయని, అమెరికా మార్కెట్‌ లాభపడిందని వివరించారు. ఇది ఇక్కడి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని పేర్కొన్నారు.  

ఆయిల్‌ షేర్ల జోరు.. 
వెనుజులాలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రం కావడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 75.49 డాలర్లకు ఎగసింది. దీంతో ఆయిల్, గ్యాస్‌ షేర్లు లాభపడ్డాయి. గెయిల్‌ 4 శాతం, ఆయిల్‌ ఇండియా 3.5 శాతం, ఐఓసీ 1.5 శాతం, బీపీసీఎల్‌ 1.4 శాతం, హెచ్‌పీసీఎల్‌ 0.8 శాతం చొప్పున పెరిగాయి.  

పీసీ జువెలర్‌  పరుగులు...
పీసీ జువెలర్‌ షేర్‌ వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభపడింది.  సోమవారం  ఇంట్రాడేలో 40 శాతం లాభంతో రూ.244ను తాకిన ఈ షేర్‌ చివరకు 38 శాతం లాభంతో రూ.241 వద్ద ముగిసింది.  ఈ నెల 3న రూ.95 వద్ద ఉన్న ఈ షేర్‌ గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో  153 శాతం ఎగసింది. ఈ మూడు ట్రేడింగ్‌ సెషన్లలో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.5,129 కోట్లు పెరిగింది. షేర్ల బైబ్యాక్‌ గురించి చర్చించాల్సిన మే 25 నాటి బోర్డ్‌ మీటింగ్‌ను ఈ నెల 10 తేదీకి ప్రి–పోన్‌ చేయడం దీనికి నేపథ్యం.  

పదవ రోజూ పడిపోయిన వక్రంగీ.. 
వక్రంగీ షేర్‌ వరుసగా పదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ పతనమైంది. సోమవారం  ఈ షేర్‌ 5 శాతం క్షీణించి రూ.81 వద్ద ముగిసింది. ఈ పది రోజుల్లో ఈ షేర్‌ 40 శాతం పతనమైంది. కంపెనీ ఖాతా పుస్తకాల్లో అవకతవకలు ఉన్నాయంటూ ఆడిటింగ్‌ కార్యకలాపాల నుంచి ప్రైస్‌ వాటర్‌హౌస్‌ సంస్థ వైదొలగడం, ఇతర విషయాలపై సెబీ దర్యాప్తు నేపథ్యంలో ఈ షేర్‌ పతనమవుతోంది.  

ఆల్‌ టైమ్‌ హైకి మహీంద్రా  
మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 3.6 శాతం లాభంతో రూ.886 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.888ను తాకింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top