గంటలో రూ. కోటి రుణం!

PM announces incentives for MSMEs, Rs 1 cr loan in 59 minutes - Sakshi

చిన్న సంస్థల రుణావసరాల కోసం ప్రభుత్వ పోర్టల్‌

ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చేలా 12 చర్యలు

నిబంధనలను సడలిస్తూ ఆర్డినెన్స్‌

న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఊతమిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ పలు చర్యలు ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈలు కేవలం 59 నిమిషాల వ్యవధిలోనే రూ.కోటి దాకా రుణాలు పొందగలిగేలా ప్రత్యేక పోర్టల్‌ను (www. psbloanin59minutes.com)శుక్రవారం ఆవిష్కరించారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ)లో నమోదు చేయించుకున్న ఎంఎస్‌ఎంఈలు ఈ ప్రయోజనాలు పొందవచ్చని మోదీ చెప్పారు.

నిబంధనలను అనుసరించి 2 శాతం దాకా వడ్డీ రాయితీ పొందవచ్చన్నారు. ఎంఎస్‌ఎంఈలు చేసే ఎగుమతులకు ముందస్తుగాను, ఆ తర్వాత ఇచ్చే వడ్డీ రాయితీని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచినట్లు మోదీ తెలిపారు. మొత్తం మీద ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చేలా 12 చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. కార్మిక, పర్యావరణ చట్టాలు సరళతరం చేయడం, కంపెనీల చట్టంలో తగు మార్పులు మొదలైనవి వీటిలో ఉన్నాయి.

దీపావళి పండుగ వేళ ప్రకటించిన ఈ చారిత్రక నిర్ణయాలు ఎంఎస్‌ఎంఈ రంగం, కోట్ల కొద్దీ వ్యాపారవేత్తలు, ఉద్యోగుల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపగలవని మోదీ చెప్పారు. ప్రస్తుతం రూ. 5 కోట్ల దాకా ఆదాయాలు ఉన్న సంస్థలను లఘు సంస్థలుగాను, రూ. 5–75 కోట్ల దాకా ఆదాయాలున్న వాటిని చిన్న సంస్థలుగా, అంతకు మించి రూ. 250 కోట్ల దాకా ఆదాయం ఉన్నవి మధ్య స్థాయి సంస్థలుగాను పరిగణిస్తున్నారు.  

తనిఖీలకు కఠిన నిబంధనలు..
అధికారులు ఇష్టారీతిగా ఫ్యాక్టరీలను తనిఖీలు చేయడం నుంచి ఎంఎస్‌ఎంఈలకు ఊరటనిచ్చేలా చర్యలు తీసుకున్నట్లు మోదీ చెప్పారు. కంప్యూటరైజ్డ్‌ ప్రక్రియ ద్వారా మాత్రమే ఫ్యాక్టరీల తనిఖీలకు అనుమతులు మంజూరవుతాయని, ఇన్‌స్పెక్టర్లు 48 గంటల్లోగా తనిఖీ నివేదికను నిర్దిష్ట పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ఇక నుంచి ఏ ఇన్‌స్పెక్టర్‌ కూడా ఇష్టారీతిగా ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేయడానికి లేదు. అలా ఫ్యాక్టరీలకు వెడితే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది‘ అని మోదీ స్పష్టంచేశారు. ఇక పర్యావరణపరమైన అనుమతులను కూడా సడలించినట్లు ఆయన వెల్లడించారు.

‘‘ఏదైనా ఫ్యాక్టరీని పెట్టాలంటే గాలి, నీటి కాలుష్య నియంత్రణకు సంబంధించి ఒకే పర్మిషన్‌ తీసుకుంటే సరిపోతుంది. మొత్తం ఎనిమిది కార్మిక చట్టాలు, 10 కేంద్ర నిబంధనల పాటింపు విషయంలో ఎంఎస్‌ఎంఈలు ఏటా ఒక్క రిటర్న్‌  సమర్పిస్తే సరిపోతుంది. చిన్న చిన్న తప్పిదాలకు విధించే జరిమానాల విధానాన్ని సరళతరం చేసే దిశగా కంపెనీల చట్టంలో తగు మార్పులతో ఆర్డినెన్స్‌ రూపొందించాం’’ అని మోదీ వివరించారు.

ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) ఇప్పటిదాకా వార్షికంగా తమ కొనుగోళ్లలో (సోర్సింగ్‌) 20 శాతం తప్పనిసరిగా ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుండగా.. ఈ పరిమితిని 25 శాతానికి పెంచినట్లు ఆయన తెలిపారు. పీఎస్‌యూల సోర్సింగ్‌లో 3 శాతం కొనుగోళ్లు మహిళల ఆధ్వర్యంలో నడిచే ఎంఎస్‌ఎంఈల నుంచి ఉండాలని వివరించారు.

రూ. 6,000 కోట్లతో హబ్‌లు, టూల్‌ రూమ్స్‌  
ఎంఎస్‌ఎంఈ రంగానికి సాంకేతికపరమైన తోడ్పాటు అందించేందుకు కేంద్రం రూ. 6,000 కోట్లు కేటాయించింది. టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ అవసరాలకు ఉపయోగపడేలా 20 హబ్‌లు, 100 టూల్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు మోదీ చెప్పారు.

అలాగే, ఫార్మా ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఆ రంగంలో ఎంఎస్‌ఎంఈల కోసం క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రూ. 500 కోట్లకు పైగా టర్నోవరు ఉన్న కంపెనీలన్నీ కూడా ట్రేడ్‌ రిసీవబుల్స్‌ ఈ–డిస్కౌంటింగ్‌ సిస్టమ్‌ (టీఆర్‌ఈడీఎస్‌)లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎంఎస్‌ఎంఈలకు నగదు లభ్యతపరమైన సమస్యలు లేకుండా చూడొచ్చని మోదీ పేర్కొన్నారు.  

ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌లో దూకుడు..
వ్యాపారాలకు అనువైన విధానాలు పాటిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ ఏకంగా 23 స్థానాలు ఎగబాకడంపై మోదీ స్పందించారు. తమ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ఎవరూ ఊహించని విజయాలను సాధించిందని చెప్పారు. ఏ దేశం కూడా ఈ స్థాయిలో స్థానాలను మెరుగుపర్చుకోలేదన్నారు.

ప్రపంచ బ్యాంకు రూపొందించిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‘ దేశాల జాబితాలో 2014లో 142వ ర్యాంకులో ఉన్న భారత్‌ ప్రస్తుతం 77కు చేరింది. త్వరలోనే టాప్‌ 50వ ర్యాంకును చేరుకోగలమని మోదీ పేర్కొన్నారు. సంస్కరణల ప్రక్రియతో చిన్న, మధ్య తరహా సంస్థలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు.

దీపావళి నజరానా: పరిశ్రమ వర్గాలు
చిన్న, మధ్య తరహా సంస్థలకు ఊతమిచ్చేలా ప్రధాని మోదీ ప్రకటించిన వరాల జల్లును దీపావళి నజరానాగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. ‘ఎంఎస్‌ఎంఈల సమస్యల పరిష్కారానికి ఈ చర్యలు గణనీయంగా తోడ్పడతాయి. వాటికి నూతనోత్తేజం కలిగిస్తాయి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశీ ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇవి దీపావళి నజరానాలే‘ అని అసోచాం సెక్రటరీ జనరల్‌ ఉదయ్‌ కుమార్‌ వర్మ చెప్పారు. 59 నిమిషాల్లోపే రుణాలకు సూత్రప్రాయ అనుమతులు తదితర చర్యలు.. ఎంఎస్‌ఎంఈల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అఖిల భారతీయ వర్తకుల సమాఖ్య సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ చెప్పారు. రుణాలపై వడ్డీ రాయితీల పెంపు నిర్ణయం ఎగుమతిదారులకు తోడ్పడగలదని ఎగు మతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో పేర్కొంది.    

టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా భారత్‌:  జైట్లీ
వచ్చే ఏడాదిలో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఎకానమీగా భారత్‌ ఆవిర్భవిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. ఇదే ఊపుతో రాబోయే రోజుల్లో టాప్‌ 3 ఎకానమీల్లో ఒకటిగా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.

నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ నాలుగేళ్లలో భారత్‌ అగ్రగామి ఎకానమీల జాబితాలో తొమ్మిదో స్థానం నుంచి ఆరో స్థానానికి చేరిందని జైట్లీ చెప్పారు. వచ్చే ఏడాది అయిదో స్థానానికి చేరగలదన్నారు. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2.59 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో (జీడీపీ) గతేడాది ప్రపంచంలోనే అతి పెద్ద ఎకానమీల జాబితాలో ఫ్రాన్స్‌ను తోసిరాజని భారత్‌ ఆరో స్థానానికి చేరింది. ప్రస్తుతం అయిదో స్థానంలో ఉన్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను కూడా త్వరలో అధిగమించగలదని ప్రపంచ బ్యాంకు అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top