జీడీపీలో 15 శాతానికి కుబేరుల సంపద

Oxfam India Report - Sakshi

మరింత పేదరికంలోకి బడుగువర్గాలు

భారత్‌లో మూడు దశాబ్దాల్లో పెరిగిన అసమానతలు

ఆక్స్‌ఫామ్‌ ఇండియా నివేదిక

న్యూఢిల్లీ: ప్రభుత్వాల అసమగ్ర విధానాలతో భారత్‌లో గడిచిన మూడు దశాబ్దాల్లో అసమానతలు భారీగా పెరిగిపోయాయి. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) కేవలం కొద్ది మంది కుబేరుల వాటా పెరుగుతుండగా.. పేదల వాటా అంతకంతకూ తగ్గిపోతోంది. ఆక్స్‌ఫామ్‌ ఇండియా విడుదల చేసిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అయిదేళ్ల క్రితం జీడీపీలో పది శాతానికి పరిమితమైన కుబేరుల సంపద వాటా ప్రస్తుతం ఏకంగా 15 శాతానికి పెరిగిపోయింది.

వారసత్వ ఆస్తులతోను, క్రోనీ క్యాపిటలిజం మార్గంలోనూ దేశీయంగా సంపన్నులు భారీ ఎత్తున సంపదను పోగేసుకుంటున్నట్లు ఆక్స్‌ఫామ్‌ వివరించింది. భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరుగుతుండటానికి.. 1991 నాటి ఆర్థిక సంస్కరణల సమయంలోనూ, ఆ తర్వాత నుంచీ వివిధ ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్న విధానాలే కారణమని పేర్కొంది. 2017లో భారత్‌లో 101 మంది బిలియనీర్స్‌ ఉన్నారు.  

నివేదిక ప్రకారం.. ఆదాయం, వినియోగం, సంపద మొదలైన విషయాలన్నింటిలోనూ అత్యధిక అసమానతలున్న దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. ఒకదానితర్వాత మరొకటి వచ్చిన ప్రభుత్వాలు ఎంచుకున్న అసమగ్ర విధానాలే ఇందుకు కారణమని వివరించింది. 1980లలో ఒకే స్థాయిలో స్థిరంగా కొనసాగిన అసమానతలు.. 1991 నుంచి 2017 దాకా ఏ విధంగా పెరుగుతూ వచ్చాయన్నది.. వివిధ గణాంకాల ఆధారంగా ఆక్స్‌ఫామ్‌ ఇండియా విశ్లేషించింది. 

‘ఇప్పటికే కులం, మతం, ప్రాంతం మొదలైన అంశాలతో బీటలు బారిన సమాజానికి ఆర్థిక అసమానతలు కూడా తోడవుతుండటం ఆందోళనకరమైన విషయం. నైతికత కోణంలోనే కాకుండా.. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు కూడా అసమానతలను తగ్గించడం చాలా ముఖ్యం‘ అని నివేదికను రూపొందించిన ప్రొఫెసర్‌ హిమాంశు తెలిపారు.  

ప్రగతిశీల పన్నుల విధానాలే మందు..
పెరుగుతున్న ఆర్థిక అసమానతల తీరును తగ్గించేందుకు ప్రగతిశీల పన్నుల విధానాలతో పన్ను రాబడులు పెంచుకోవడమే సరైన పరిష్కారం కాగలదని నివేదిక పేర్కొంది. సంపద పన్ను, వారసత్వ పన్ను మొదలైనవి ప్రవేశపెట్టాలని.. ఆ రూపంలో వచ్చే ఆదాయాన్ని పేదల విద్య, వైద్యం, పౌష్టికాహార కల్పన తదితర అంశాలకు ఉపయోగించాలని సూచించింది. బడుగువర్గాలు అభివృద్ధి చెందేందుకు .. ఆయా వర్గాల పిల్లలకు బాల్యం నుంచే తోడ్పాటు అందించడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.  

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top