అందరికీ ఇళ్లు అడుగులు పడేలా!

own house for every one - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  దేశంలోని నిరుపేదలందరికీ సొంతిల్లు కల్పించాలని కేంద్రం గట్టిగానే సంకల్పించింది. అందుకే గత నాలుగు బడ్జెట్లలోనూ అందుబాటు గృహాలపై ప్రత్యేక దృష్టిసారించింది. 2017 బడ్జెట్‌లో అఫోర్డబుల్‌ హౌసింగ్‌కు మౌలిక రంగ హోదాను అందించిన ఆర్థ్ధిక మంత్రి.. తాజా బడ్జెట్‌లో ఏకంగా ఈ విభాగానికి ప్రత్యేక నిధిని కేటాయించేశారు.

అంతెందుకు సరిగ్గా వారం క్రితం కూడా రియల్టీ రంగానికి 12 శాతంగా ఉన్న జీఎస్‌టీని తగ్గించాలన్న డిమాండ్‌లోనూ అఫోర్డబుల్‌ హౌసింగ్‌కే ప్రాధాన్యమిచ్చారు కూడా. అందుబాటు గృహాలకు మాత్రమే జీఎస్‌టీని 8 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి కేంద్రం అందరికీ ఇళ్లు–2022 పథకం సక్సెస్‌లో అడుగులు పడ్డాయని స్థిరాస్తి పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అందుబాటు గృహాల నిధి ఏర్పాటు..
ఆర్థ్ధికమంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో అందుబాటు గృహాలకు ప్రత్యేక నిధి (ఏహెచ్‌ఎఫ్‌) ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) కింద ఏహెచ్‌ఎఫ్‌ ఏర్పాటవుతుంది. దీంతో నిర్మాణ సంస్థలకు రుణా ల కొరతను తీరుస్తుంది.

భారత రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి ఎన్‌హెచ్‌బీ ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ చేస్తూ ఎన్‌హెచ్‌బీ చట్టంలో సవరణ చేస్తామని జైట్లీ ప్రకటించారు. భారత ప్రభుత్వ సర్వీస్డ్‌ బాండ్ల ద్వారా నిధులను సమకూరుస్తుంది. గత బడ్జెట్‌లో అందుబాటు గృహాల విభాగానికి రూ.23 వేల కోట్ల నిధులను కేటాయించారు. ఏహెచ్‌ఎఫ్‌లోనూ అంతకంటే ఎక్కువే నిధులు కేటాయించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పట్టణాల్లో 37 లక్షలు; గ్రామాల్లో 51 లక్షలు..
ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం కింద 2018–19 సంవత్సరంలో దేశంలో కోటి ఇళ్లను నిర్మించాలని లకి‡్ష్యంచింది. వీటిల్లో పట్టణ ప్రాంతాల్లో 37 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 51 లక్షల ఇళ్లు రానున్నాయి. 2015లో ప్రారంభమైన పీఎంఏవై పథకం కింద  ప్రైవేట్‌ భాగస్వామ్యం, క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ స్కీమ్‌ (సీఎల్‌సీసీ) వంటి వాటితో మురికివాడల రిహాబిలిటేషన్, లబ్ధిదారులకు గృహాలను నిర్మిస్తుంది. గత బడ్జెట్‌లో స్థానిక డెవలపర్లను ప్రోత్సహించేందుకు 80 ఏబీఏ సెక్షన్‌ను సవరించి, అఫోర్డబుల్‌ గృహల నిర్మాణ గడువును 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచారు.

అఫోర్డబుల్‌ హౌసింగ్‌లో గిరాకీ..
వేతనజీవులకు రూ.40 వేల స్టాండర్డ్‌ డిడక్షన్, 1.5 కోట్లు ఉద్యోగ కల్పన లక్ష్యం వంటివి అఫోర్డబుల్‌ హౌసింగ్‌లో గిరాకీని పెంచుతుందని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఇండియా ఎండీ అన్షుల్‌ జైన్‌ తెలిపారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్, జాతీయ రహదారుల అభివృద్ధి, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం, బెంగళూరు, ముంబై మెట్రో రైళ్లకు నిధుల కేటాయింపు వంటి వాటితో మెట్రో, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. దీంతో కొత్త ప్రాంతాల్లో నివాస సముదాయాలకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మొత్తంగా నిర్మాణ రంగంతో పాటు సిమెంట్, స్టీల్‌ వంటి అనుబంధ సంస్థలకూ డిమాండ్‌ను తీసుకొస్తుంది.

సెజ్‌లో మ్యాట్‌ లేదు..
ప్రత్యేక ఆర్థికమండళ్లు (ఎస్‌ఈజెడ్‌)లో కనీస ప్రత్యామ్నాయ పన్ను (మినిమం ఆల్ట్రానెట్‌ ట్యాక్స్‌– ఎంఏటీ)ని మినహాయింపునివ్వటం సెజ్‌ నిర్మాణ సంస్థల్లో కొంత ఉత్సాహం నెలకొల్పుతుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) మాజీ అధ్యక్షుడు సీ శేఖర్‌ రెడ్డి తెలిపారు. అలాగే సబ్‌ రిజిస్ట్రార్‌ విలువ (సర్కిల్‌ రేటు) మీద వసూలు చేసే మూలధన పన్నులో కొంత వెసులుబాటు కల్పించారు.

సర్కిల్‌ రేటు, ప్రాపర్టీ విక్రయ రేటు మధ్య 5 శాతం కంటే తక్కువ వ్యత్యాసం ఉన్న సందర్భాల్లో ఆదాయ పన్ను సర్దుబాటు సడలింపు కూడా ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. అయితే అందుబాటు గృహాల నిధిని ఎంత కేటాయిస్తారనేది స్పష్టత లేదని.. ఈ ఫండ్‌లో సింహభాగం చిన్న డెవలపర్లకు కేటాయించాలని సూచించారు. ఎందుకంటే పెద్ద డెవలపర్లకు బ్యాంకులు, ఇతరత్రా మార్గాల ద్వారా నిధులొస్తాయి. చిన్న డెవలపర్లకు నిధులను కేటాయిస్తేనే వాళ్లు ఎక్కువ మొత్తంలో అందుబాటు గృహాలను అదీ అందుబాటు ధరల్లో అందించగలుగుతారని అభిప్రాయపడ్డారు.

బడ్జెట్‌లో చోటుదక్కని అంశాలివే..
రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), బినామీ ప్రాపర్టీ, దివాలా చట్టాలతో స్థిరాస్తి రంగం పీకల్లోతు ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో కేంద్ర బడ్జెట్‌పై స్థిరాస్తి రంగం గంపెడు ఆశలు పెట్టుకుంది. కానీ, ఆర్థ్ధికమంత్రి రంగం ఆశలపై నీళ్లు చల్లారని పరిశ్రమ వర్గాలు వాపోయాయి. అందుబాటు గృహాలకు మినహాయిస్తే మొత్తం రియల్టీ రంగాన్ని విస్మరించారని.. సింగిల్‌ విండో క్లియరెన్స్, స్టాంప్‌ డ్యూటీ క్రమబద్ధీ్దకరణ, జీఎస్‌టీ తగ్గింపు వంటివేవీ కూడా బడ్జెట్‌లో ప్రస్తావించలేదని పలువురు నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెవరేమన్నారంటే..

ఆదాయ పన్ను, జీఎస్‌టీ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకపోవటం నిరాశ కలిగించిందని 99 ఏకర్స్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ నర్సింహా జయకుమార్‌ తెలిపారు. అందు బాటు గృహాలకు మాదిరే నిర్మాణ రంగమంతటికీ మౌలిక రంగ హోదా అందిస్తారని ఆశించాం. కానీ, మొండిచేయి చూపెట్టారన్నారు.
ఏహెచ్‌ఎఫ్‌తో అందుబాటు గృహాలకు రుణాల లభ్యత పెరుగుతుంది. రుణాలతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ), డెన్సిటీ నిబంధనలను కూడా ప్రభుత్వం సడలించాల్సిన అవసరముందని ప్రాప్‌ఈక్విటీ సీఈఓ సమీర్‌ జాసుజా సూచించారు.
స్థూల జాతీయోత్పత్తిలో 7.7 శాతం వాటా, 15 మిలియన్ల ఉద్యోగుల కల్పన, పన్నుల రూపంలో ఖజానాకు సింహభాగం చేయూతనందించే రియల్టీ రంగంపై చిన్నచూపు చూశారని జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈఓ, కంట్రీ హెడ్‌ రమేశ్‌ నాయర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రియల్టీ రంగానికి మౌలిక పరిశ్రమ హోదా మరిచిపోయారన్నారు. బాహ్య వాణిజ్య రుణాలు (ఈసీబీ) ఎలాంటి రాయితీలను ప్రకటించలేదని చెప్పారు. 80సీ, 80సీసీ, 24బీ పన్ను రేట్లలో మినహాయింపుల డిమాండ్‌ను తోసిపుచ్చారని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top