మార్కెట్‌ గు‘బేర్‌’!

 Over 285 stocks hit fresh 52-week lows on NSE - Sakshi

10వేల పాయింట్ల దిగువకు నిఫ్టీ 

చైనాపై అమెరికా వాణిజ్య ఆంక్షలు  

స్పందనగా చైనా ప్రతిచర్యలు 

వాణిజ్య యుద్ధాల భయాలతో ప్రపంచ మార్కెట్లు కుదేలు

ఎగసిన ముడి చమురు ధరలు 

మరో రుణ కుంభకోణం వెలుగుతో బ్యాంక్‌ షేర్లు బేజార్‌  

5 నెలల కనిష్టానికి సూచీలు 

410 పాయింట్ల నష్టంతో 32,597కు సెన్సెక్స్‌  

117 పాయింట్లు పతనమై 9,998కు నిఫ్టీ  

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ చైనాపై పేల్చిన వాణిజ్య సుంకాల తూటా ధాటికి ప్రపంచ మార్కెట్లు కకావికలమైపోయాయి. దీనికి చైనా ప్రతిచర్య తీసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా రక్షణాత్మక విధానాలకు ప్రతిగా ఇతర దేశాలు ప్రతిచర్యలు తీసుకుంటాయని, దీంతో వాణిజ్య యుద్ధాలు చెలరేగుతాయనే ఆందోళన ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురికొల్పింది. వాణిజ్య యుద్ధ భయాలకు తోడు ముడి చమురు ధరలు భగ్గుమనడం, మరో రూ.1,241 కోట్ల బ్యాంక్‌ రుణ మోసం వెలుగులోకి రావడం, మరో వారంలోనే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమల్లోకి రానుండటం వంటి అంశాలు కూడా జత కావడంతో మన మార్కెట్లో  అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,000 పాయింట్ల దిగువకు, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 33 వేల పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఈ సూచీలు ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగజారాయి. ఐటీ, మీడియా  మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 410 పాయింట్లు(1.24%) నష్టపోయి 32,597 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు (1.15%)పతనమై 9,998 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది స్టాక్‌సూచీల  కనిష్ట స్థాయిలు ఇవే. రియల్టీ, లోహ, బ్యాంక్, క్యాపిటల్‌ గూడ్స్, హెల్త్‌కేర్, పీఎస్‌యూ, వాహన, ఆయిల్, గ్యాస్‌ షేర్లు పడిపోయాయి. నిఫ్టీ 10 వేల దిగువకు రావడం గత ఏడాది అక్టోబర్‌ 11 తర్వాత ఇదే తొలిసారి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌  522 పాయింట్లు, నిఫ్టీ 163 పాయింట్లు నష్టపోయాయి.  

నాలుగో వారమూ నష్టాలే... 
వరుసగా నాలుగో వారం కూడా సూచీలు నష్టపోయాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 579 పాయింట్లు (1.75%), నిఫ్టీ 197 పాయింట్లు(1.93%) చొప్పున నష్టపోయాయి. ఈ నెల 15 ట్రేడింగ్‌ సెషన్లలో 10 సెషన్లలో స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లోనే ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ సెన్సెక్స్‌ 3.45%, నిఫ్టీ 3.6% చొప్పున క్షీణించాయి.  

ఆల్‌టైమ్‌ హై నుంచి 10 శాతం డౌన్‌... 
వాణిజ్య యుద్ధ భయాల ఆందోళనలకు తోడు ముడి చమురు ధరలు కూడా ఎగియడంతో మార్కెట్‌ భారీగా నష్టపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. రికార్డ్‌ స్థాయిల నుంచి ప్రధాన స్టాక్‌ సూచీలు 10 శాతానికి పైగా కరెక్టయ్యాయని, లోహ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల పతనం కొనసాగుతోందని వివరించారు. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయని సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌(ఈక్విటీ) దేవాంగ్‌ మెహతా చెప్పారు. ఇక దేశీయంగా గత నెల ఆరంభం నుంచే మార్కెట్లు పతనమవుతున్నాయని పేర్కొన్నారు. దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ), బ్యాంక్‌ రుణ మోసాలు తగిన ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఎన్నికలు మరో ఏడాదిలో రానున్న కారణంగా ఒడిదుడుకులు మరింత తీవ్రంగా మరికొంత కాలం పాటు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. వారాంతం కావడం, వచ్చే వారమే ఈ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియడం వంటి కారణాల వల్ల పొజిషన్లు తీసుకోవడానికి ట్రేడర్లు ముందుకు రాలేదని, దీంతో కొనుగోళ్ల మద్దతు లభించలేదని ఒక బ్రోకర్‌ పేర్కొన్నారు. మరో వారంలో దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలు కానున్నందున మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

ఏడాది కనిష్టానికి ఎస్‌బీఐ
తాజా పతనంతో పలు షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. ఎస్‌బీఐ, టాటామోటార్స్, భెల్, అంబుజా, భారత్‌ ఎలక్ట్రానిక్స్, కేడిలా హెల్త్‌కేర్, కమిన్స్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్, లుపిన్, పీఎఫ్‌సీ తదితర బీఎస్‌ఈ 500 సూచీలోని 60 షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

పతనానికి ప్రధాన కారణాలు..
వాణిజ్య ఉద్రిక్తతలు: చైనా దిగుమతులపై అమెరికా 6,000 కోట్ల డాలర్ల మేర సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా అమెరికా దిగుమతులపై చైనా 300 కోట్ల డాలర్ల మేర సుంకాలు విధించింది. రక్షణాత్మక విధానాలకు ప్రతి చర్యలు ఉంటాయని, దీంతో వాణిజ్య యుద్ధాలు చెలరేగుతాయనే భయాలతో గురువారం  అమెరికా మార్కెట్‌  భారీగా నష్టపోయింది. దీంతో ఆసియా మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. మన స్టాక్‌ మార్కెట్‌ కూడా నష్టాల్లోనే ఆరంభమైంది. జపాన్‌ నికాయ్‌ 4.5%, హాంగ్‌ కాంగ్‌  హాంగ్‌సెంగ్‌ 2.4%, షాంగై కాంపాజిట్‌ 3.3% చొప్పున నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు నష్టాలతోనే ఆరంభమయ్యాయి.  

బ్యాంక్‌ షేర్లు బేజారు...: రూ.1,394 కోట్ల రుణ మోసం విషయమై టొటొమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై సీబీఐ కేసు దాఖలు చేయడంతో బ్యాంక్‌ షేర్లు కుప్పకూలాయి. ఈ కంపెనీకి అత్యధికంగా రుణాలిచ్చిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8% పతనమై రూ.86.85 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 9% నష్టంతో 11 ఏళ్ల కనిష్టానికి, రూ.86కు పడిపోయింది.  బ్యాంక్‌ నిఫ్టీ 471 పాయింట్లు నష్టపోయి 8 నెలల కనిష్టానికి 23,670 పాయింట్లకు పడిపోయింది. యాక్సిస్, పీఎన్‌బీ, యస్‌బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, బీఓబీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 4% వరకూ నష్టపోయాయి.  

ముడిచమురు ధరలు: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమనడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 2017 నాటి ఉత్పత్తి కోతను వచ్చే ఏడాది కూడా అమలు చేయడానికి ఒపెక్‌ను, రష్యాని ఒప్పించాలని  సౌదీ యోచిస్తోందన్న వార్తల కారణంగా శుక్రవారం చమురు ధరలు 1% ఎగిశాయి. చమురు ధరలు పెరిగితే కరంట్‌ అకౌంట్‌  లోటు ఎగబాకుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురిచేసింది.

టెక్నికల్‌ కారణాలు...: నిఫ్టీ 10,200కు ఎగిసిన 4 పర్యాయాల్లో 3 సార్లు అమ్మకాల ఒత్తిడి కనిపింంచిందని, మార్కెట్‌ పెరగాలంటే నిఫ్టీకి 10,200  మార్క్‌ కీలకమని అనలిస్ట్‌లు అంటున్నారు. ప్రస్తుత స్థాయిల నుంచి పడిపోతే తాజా కనిష్ట స్థాయిలు తప్పవని వారంటున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top