అప్పు ఇస్తారా ? తీసుకుంటారా?

Online Pi2P companies process - Sakshi

ఇద్దరినీ కలుపుతున్న ఆన్‌లైన్‌ పీ2పీ సంస్థలు

ఇలాంటివన్నీ ఇక ఆర్‌బీఐ నియంత్రణలోకి

కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీ

హామీ లేని అప్పు; క్రెడిట్‌ స్కోరుకు లింకు  

చేతిలో డబ్బులుండి... చక్కని వడ్డీకి రుణమివ్వాలనుకునే వారు నేరుగా ఆన్‌లైన్లోనే ఆ పని కానిచ్చేయొచ్చు... అలాగే బ్యాంకుల చుట్టూ తిరగకుండా... కొంచెం ఎక్కువ వడ్డీ అయినా పర్వాలేదు హామీ లేని రుణం కావాలనుకునేవారూ ఆన్‌లైన్లోనే ఆ ప్రక్రియ పూర్తిచేయొచ్చు... ఎందుకంటే వీరిద్దరినీ కలిపే పీ2పీ (పీర్‌ టు పీర్‌) రుణ సంస్థలిపుడు వేగంగా విస్తరిస్తున్నాయి.

ఇందులో కొత్తేముంది!! పీ2పీ రుణ సంస్థలు కొన్నాళ్లుగా వ్యాపారం చేస్తూనే ఉన్నాయిగా!! అనుకుంటున్నారా? నిజమే! పీ2పీ సంస్థలు కొన్నాళ్లుగా వ్యాపారం చేస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇవిపుడు ఆర్‌బీఐ నియంత్రణలోకి వచ్చాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన కొన్ని మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయబోతున్నాయి. దీంతో ఈ రంగంలో పారదర్శకత నెలకొనటంతో పాటు... ఇలా రుణాలు ఇవ్వటం, తీసుకోవటం చట్టబద్ధమేనా? చట్టబద్ధం కాదా? అనే ప్రశ్నలకిపుడు ఫుల్‌స్టాప్‌ పడింది.

ఈ సంస్థల్లో నమోదు చేసుకున్న రుణదాతలు ఎలాంటి నిబంధనలు పాటించాలి? రుణగ్రహీతలకు లాభనష్టాలేంటి? వారెలా వ్యవహరించాలి? కంపెనీలు చేయాల్సిందేంటి? అనేవన్నీ ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో స్పష్టమయ్యాయి. దీంతో పీ2పీ రంగం వేగంగా అడుగులేయటానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అప్పులివ్వాలని అనుకునేవారు, తీసుకోవాలని అనుకునేవారు ఇరువురి కోసం ఈ ప్రాఫిట్‌ ప్లస్‌ ప్రత్యేక కథనం... – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ ప్రతినిధి

పీ2పీ లెండింగ్‌ అంటే?
పీ2పీ అంటే..? పీర్‌ టు పీర్‌... ఇద్దరు వ్యక్తుల్ని కలిపే వ్యవస్థ. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం రోజూ వాడే ‘వాట్సాప్‌’ లాంటిదన్న మాట. వాట్సాప్‌లో మెసేజ్‌ పంపినవారు, తీసుకునేవారు.. ఇద్దర్నీ నేరుగా కలిపేదే వాట్సాప్‌ ప్లాట్‌ఫామ్‌. ఇక్కడా అంతే!! అప్పులిచ్చేవారు.. తీసుకునేవారు... ఇద్దరినీ కలిపే ప్లాట్‌ఫామ్‌ లెండింగ్‌ సంస్థ. అదీ కథ.

వాట్సాప్‌ మాదిరే అప్పులివ్వాలని అనుకునేవారు, తీసుకోవాలని అనుకునేవారు ఇద్దరూ ఈ పీ2పీ సంస్థల్లో ఆన్‌లైన్లోనే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొంత ఫీజు ఉంటుంది. సంస్థను బట్టి ఈ ఫీజు మారిపోతుంది. ఉదాహరణకు హైదరాబాద్‌ కేంద్రంగా ఈ రంగంలో మొట్టమొదటి నుంచీ పనిచేస్తున్న ఐలెండ్‌ సంస్థలో రుణగ్రహీత అయితే ఒకసారి రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.500 చెల్లించాలి.

కాకపోతే ఇది ఒక నెల లేదా ఒకసారి రుణం తీసుకోవటానికి మాత్రమే పనికొస్తుంది. మరోసారి రుణం తీసుకోవాలంటే మళ్లీ కొత్త రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే. ఇక రుణదాతల వద్ద రుణమిచ్చిన మొత్తంలో 1 శాతాన్ని ప్రాసెసింగ్‌ ఫీజుగా సంస్థ వసూలు చేస్తుంది. వెరిఫికేషన్‌ వంటివన్నీ సంస్థ చేస్తుంది కనక ఈ ఖర్చులు తప్పవని ఐ–లెండ్‌ వ్యవస్థాపకుడు శంకర్‌ వడ్డాది ‘సాక్షి’ పర్సనల్‌ ఫైనాన్స్‌ ప్రతినిధితో చెప్పారు.

ఇక మరో పీ2పీ సంస్థ ఐ2ఐ ఫండింగ్‌.కామ్‌ అయితే రుణగ్రహీత తన పేరు నమోదు చేసుకోవటానికి రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. అదే రుణదాత/ఇన్వెస్టర్‌ (రాబడులను ఆశించేవారు) అయితే రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు. రుణగ్రహీత తమ పేరు నమోదు సమయంలోనే పుట్టిన తేదీ, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, బ్యాంకు స్టేట్‌మెంట్, ఆదాయ ధ్రువీకరణలను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ డాక్యుమెంట్ల ఆధారంగా ఈ సంస్థ సంబంధిత రుణగ్రహీత గుర్తింపును ధ్రువీకరించుకుంటుంది. అలాగే సంబంధిత వ్యక్తి రుణ చరిత్రను కూడా తెలుసుకుంటుంది. ఈ వివరాల్నే రుణదాతలకు అందుబాటులో ఉంచుతుంది. చాలా వరకు పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు కేవైసీ (కస్టమర్‌ గురించి తెలుసుకోవడం) నిబంధలకు అనుగుణంగానే నడుచుకుంటున్నాయి.

వడ్డీ రేటెంత? నిర్ణయించేదెలా?
ఇక్కడ వడ్డీ రేటును మార్కెట్టే నిర్ణయిస్తుంది. అంటే... రుణమిచ్చేవారు తాము ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనుకుంటున్నామో కోట్‌ చేస్తారు. తీసుకునేవారికి నచ్చితేనే ఆ రేటుకు తీసుకుంటారు. లేకపోతే తక్కువ రేటుకే ఇస్తున్న మరో రుణదాతను వెతుక్కుంటారు. సాధారణంగా పీ2పీ వేదికల్లో రుణాలపై వడ్డీ రేట్లు 12 నుంచి 30 శాతం వరకూ ఉంటాయి. కాకపోతే తక్కువ వడ్డీకి ఆఫర్‌ చేసేవారికి ఎక్కువ డిమాండ్‌ ఉంటుందన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా!!.

మరికొన్ని వేదికల్లో అయితే రుణ గ్రహీతలే తమకు ఎంత వడ్డీకి రుణం కావాలో తెలియజేస్తారు. రుణ గ్రహీత వ్యక్తిగత రుణ చరిత్ర, రిస్క్‌ ప్రొఫైల్, ఆశిస్తున్న రుణం మొత్తం వంటివన్నీ ఆ వేదికల్లో ఉంటాయి. వీరు చెల్లిస్తామని చెప్పిన వడ్డీ రేటు గనక ఆకర్షణీయంగా అనిపిస్తే... నచ్చిన ఇన్వెస్టర్లు/రుణ దాతలు వెంటనే ముందుకు వస్తారు.

ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే...
ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు పీ2పీ వేదికలు రుణాలు కావాలనుకునే వారి సమగ్ర సమాచారాన్ని రుణ దాతలకు అందించాల్సి ఉంటుంది. వ్యక్తిగత గుర్తింపు, ఆశించే రుణం మొత్తం, వడ్డీ రేటు, క్రెడిట్‌ స్కోరు తదితర వివరాలు ఇందులో ఉండాలి. అదే సమయంలో రుణ దాతలకు సంబంధించి వారు ఆఫర్‌ చేస్తున్న రుణం, వడ్డీరేటు వంటి వివరాలు మాత్రమే పేర్కొనాలి. రుణ ప్రతిపాదనను ఆమోదించడం, తిరస్కరించడం, లేదా తిరిగి చర్చించుకునేందుకు ఇరు వర్గాల మధ్య అవకాశం ఉంటుంది. డీల్‌ కుదిరితే రుణ గ్రహీత, రుణదాత ఓ అధికారిక ఒప్పందంపై సంతకం చేయాలి. దాంతో రుణం జారీ అవుతుంది. ఇంకా ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం...

♦ ఈ వేదికల్లో అన్‌సెక్యూర్డ్‌ రుణాలు మాత్రమే మంజూరు చేయాలి. అంటే రుణదాతలు ఎలాంటి హామీ అడగకూడదు.
♦ పీ2పీ వేదికల్లో బంగారం, భూమి వంటి వాటిని తనఖా పెట్టుకుని సెక్యూర్డ్‌ రుణాలివ్వకూడదు.
♦ రుణదాతలు ఈ పీ2పీ వేదికల్లో రూ.10 లక్షలకు మించి ఇన్వెస్ట్‌ చేయటానికి వీల్లేదు.
♦ అలాగే ఒక రుణదాత ఒకరికి రూ.10వేల కన్నా ఎక్కువ రుణాన్నివ్వటానికి కుదరదు.
♦ అయితే ఎక్కువ మొత్తం రుణం కావాలనుకున్నవారు పలువురు రుణదాతల నుంచి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
♦ అలాగే వివిధ వ్యక్తుల దగ్గర తీసుకున్నా సరే... ఈ వేదికల్లో ఒక వ్యక్తి రూ.10 లక్షలకన్నా ఎక్కువ రుణం తీసుకోవటానికి వీల్లేదు.
♦ ప్రతి పీ2పీ సంస్థా ఓ ట్రస్టీ ఆధ్వర్యంలో రెండో ఎస్క్రో ఖాతాలు తెరవాలి. రుణం ఇవ్వటానికి అంగీకరించిన వ్యక్తి ముందుగా రుణ మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. అక్కడి నుంచి రుణగ్రహీత బ్యాంకు ఖాతాకు అది బదిలీ అవుతుంది.
♦ రుణం తీసుకున్న వ్యక్తి చేసే చెల్లింపులు రెండో ఎస్క్రో ఖాతాకు వెళతాయి. అక్కడి నుంచి రుణ దాత బ్యాంకు ఖాతాకు జమవుతాయి.
♦ లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతాల నుంచే జరగాలి తప్ప నేరుగా నగదు రూపంలో జరగకూడదు.
♦ పీ2పీ సంస్థలు ఎప్పటికప్పుడు తమ పనితీరును ఆర్‌బీఐకి తెలియజేయాలి. అంటే ఎంతమంది రుణాలిచ్చారు? ఎందరు తీసుకున్నారు? ఎందరికి తిరిగి చెల్లింపులు జరిగాయి? ఎందరు ఎగ్గొట్టారు? వంటి వివరాలన్న మాట.
♦ వీటికోసం ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీ–పీ2పీ వేదికను తెస్తోంది. ఈ వేదికపై పీ2పీ సంస్థలన్నింటి సమాచారంతో పాటు వాటి పనితీరు వివరాలూ ఉంటాయి. దీంతో అప్పులిచ్చేవారు; తీసుకునేవారు ఉత్తమమైన సంస్థల్ని ఎంచుకోవచ్చు.
♦ పీ2పీ సంస్థలు రుణాల్ని తిరిగి వసూలు చేయటానికి ఎలాంటి చట్టవిరుద్ధమైన పద్ధతులకూ దిగకూడదు. బలవంతపు వసూళ్లు ఎక్కడా ఉండకూడదు. బ్యాంకులు రుణాల వసూలుకు ఎలాంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయో ఇవి కూడా అలానే వ్యవహరించాలి.

చార్జీలు... కాల వ్యవధి
బ్యాంకుల మాదిరిగా పీ2పీ సంస్థలూ ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇవి కూడా సంస్థకు, సంస్థకు మధ్య మారిపోతున్నాయి. ఐ–లెండ్‌ సంస్థ రుణ దాత నుంచి 1 శాతాన్ని మాత్రమే ప్రాసెసింగ్‌ ఫీజుగా వసూలు చేస్తోంది. ఫెయిర్‌సెంట్‌ మాత్రం 3 – 5.5 శాతం స్థాయిలో ప్రాసెసింగ్‌ ఫీజు తీసుకుంటోంది. ఇక లెండ్‌బాక్స్‌ 2–6 శాతం మధ్య ప్రాసెసింగ్‌ చార్జీ విధిస్తోంది. ఈ వేదికల్లో జారీ చేసే రుణాల కాల వ్యవధి గరిష్ఠంగా మూడేళ్లకు మించకూడదన్నది ఆర్‌బీఐ ఆదేశాల సారాంశం.

ఇరువర్గాలకు ప్రయోజనమే...
పీ2పీ వ్యవస్థ ఆర్‌బీఐ పరిధిలోకి రావటమనేది రుణదాతలు, రుణ గ్రహీతలు ఇద్దరికీ లాభదాయకమేనన్నది ఈ రంగంలోని నిపుణుల మాట. అపసవ్య విధానాలకు అవకాశం లేకుండా, పారదర్శకతకు దారితీస్తుందని శంకర్‌ వడ్డాది అభిప్రాయపడ్డారు. పీ2పీ వేదికల ద్వారా రుణాలకు డిమాండ్‌ పెరిగితే అది పోటీకి దారి తీసి వడ్డీ రేట్లు దీర్ఘకాలంలో దిగి వస్తాయనే అంచనాలూ ఉన్నాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో మరో కీలక అంశమేంటంటే పీ2పీ వ్యవస్థలను క్రెడిట్‌ సమాచార సంస్థల పరిధిలోకి తీసుకురావడం.

దీంతో రుణం తీసుకున్న వారి సమాచారాన్ని పీ2పీ సంస్థలు సిబిల్‌ వంటి క్రెడిట్‌ బ్యూరోలకు ఎప్పటికప్పుడు అందజేస్తాయి. దీంతో తిరిగి చేసే చెల్లింపుల ఆధారంగా వారి క్రెడిట్‌ స్కోరు పెరగటం, తగ్గటం జరుగుతుంది. స్కోరు పెరిగితే భవిష్యత్తులో ఇతరత్రా రుణాలన్నీ కాస్త తేలిగ్గానే, తక్కువ వడ్డీకి మంజూరవుతాయి. ఇక స్కోరు చూసి రుణాలివ్వటం వల్ల రుణదాతలకు రుణ ఎగవేతల రిస్క్‌ కూడా తగ్గుతుంది. రుణ గ్రహీతలు కూడా తమ క్రెడిట్‌ స్కోరు పడిపోతుందన్న భయంతోనైనా తిరిగి చెల్లింపులపై శ్రద్ధ పెడతారు.

భయాలు తొలగిపోతున్నాయ్‌...
‘‘ఇప్పటిదాకా పీ2పీ లెండింగ్‌ సంస్థలు చట్టబద్ధమా? కాదా? అనే భయాలుండేవి. ఆర్‌బీఐ మార్గదర్శకాలతో అవన్నీ పోయాయి. అలాగే రూ.10 లక్షలకన్నా ఎక్కువ రుణాలివ్వకూడదని, అది కూడా ఒక వ్యక్తికి రూ.50వేల కన్నా ఎక్కువ ఇవ్వకూడదని చెప్పటం వల్ల రుణదాతలకు రక్షణ లభిస్తోంది. 20 మందికి రుణాలిస్తారు కనక ఒకటిరెండు ఎగవేతలున్నా వడ్డీ ద్వారా నష్టాన్ని కవర్‌ చేసుకోవచ్చు.

క్రెడిట్‌ స్కోరుతో లింకవుతుంది కనక రుణాలు తీసుకున్న వారూ జాగ్రత్తగా ఉంటారు. రిస్కుల్ని ముందే వెల్లడించాలన్న నిబంధన పెట్టడం, సంస్థల పనితీరును బహిరంగంగా తెలియజేయటం... ఇలాంటి నిబంధనలన్నీ ఈ రంగానికి మరింత ఊతమిచ్చేవే. మొత్తంగా ఆర్‌బీఐ మార్గదర్శకాలతో ఈ రంగానికి ఒక దిశా నిర్దేశం జరిగిందని మాత్రం చెప్పొచ్చు.

– శంకర్‌ వడ్డాది, ఐ–లెండ్‌ వ్యవస్థాపకుడు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top