‘ఖాయిలా’ జాబితాలు తయారవుతున్నాయ్‌: నీతి ఆయోగ్‌ 

'Niti Aayog working on new list of sick PSUs' - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ చేయాల్సిన ఖాయిలా ప్రభుత్వ రంగ సంస్థల మరో జాబితాను నీతి ఆయోగ్‌ సిద్ధం చేస్తోంది. ఖాయిలా పడిన 40 పీఎస్‌యూల్లో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ అమలు చేయాలని ఇప్పటికే సూచించామని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు. ఈ విషయమై దీపమ్‌(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) కసరత్తు చేస్తోందని, ఈ ప్రక్రియ తుది దశలో ఉందని వివరించారు. ఖాయిలా పడిన పీఎస్‌యూలకు సంబంధించిన ఇప్పటికే నాలుగు జాబితాలను పంపించామని, ప్రస్తుతం ఐదో జాబితాను రూపొందిస్తున్నామని, ఆరు, ఏడో జాబితాలను కూడా రూపొందించనున్నామని పేర్కొన్నారు. పీఎస్‌యూ డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిల్లో సీపీఎస్‌ఈల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.46,500 కోట్లు, వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌(పీఎస్‌యూలో వంద శాతం వాటా విక్రయం) ద్వారా రూ.15,000 కోట్లు, బీమా కంపెనీల లిస్టింగ్‌ ద్వారా రూ.11,000 కోట్లు సమీకరించనున్నారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా కేంద్రం రూ. లక్ష కోట్లు సమీకరించింది.  

స్వల్పంగా పెరిగిన ఎఫ్‌డీఐలు...
ఇదిలాఉండగా, మన దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) స్వల్పంగానే పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలానికి 3,594 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 3,584 కోట్ల డాలర్లుగా ఉన్నాయని, ఆ లెక్కన చూస్తే వృద్ధి కేవలం 0.27 శాతం మాత్రమే నమోదైందని పేర్కొంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలానికి సేవల రంగంలో అత్యధికంగా ఎఫ్‌డీఐలు వచ్చాయని డీఐపీపీ వెల్లడించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top