ఒడిదుడుకుల వీడ్కోలు

Nifty forms bearish candle on last day of 2018, 10,850 crucial for bulls - Sakshi

మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ 

మిశ్రమంగా విదేశీ మార్కెట్లు 

తీవ్ర హెచ్చుతగ్గుల్లో సూచీలు 

8 పాయింట్లు తగ్గి 36,068కు సెన్సెక్స్‌

3 పాయింట్లు పెరిగి 10,863కు నిఫ్టీ 

రూపాయి బలపడినా... 2018వ సంవత్సరానికి చివరి రోజైన సోమవారం స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే ముగిశాయి. సూచీలు మిశ్రమంగా 2018కి వీడ్కోలు పలికాయి. దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 8 పాయింట్లు పతనమై 36,068 పాయింట్ల వద్ద, నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 10,863 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, ఫార్మా షేర్లు లాభపడగా, ఆర్థిక రంగ షేర్లు నష్టపోయాయి.  

252 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌  
అమెరికా– చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సడలగలవనే సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో సోమవారం సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. అయితే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన నెలకొనడం, ఆసియా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో స్టాక్‌ సూచీలు లాభ, నష్టాల మధ్య కదలాడాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 209 పాయింట్లు లాభపడగా, మరో దశలో 43 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 252 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 64 పాయింట్లు వరకూ లాభపడింది.  

రూ.7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి  
గత ఏడాది సెన్సెక్స్‌పెరిగినా, ఇన్వెస్టర్ల సంపద మాత్రం తగ్గింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ విలువ రూ.7.25 లక్షల కోట్లు తగ్గి రూ.1,44,48,466 కోట్లకు పడిపోయింది.    

మూడో ఏడూ లాభాల్లోనే..
ఏడాది పరంగా చూస్తే స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లోనే ముగిసింది. స్టాక్‌ సూచీలు వరుసగా మూడో ఏడాదీ లాభపడ్డాయి. 2018లో సెన్సెక్స్‌ 2,011 పాయింట్లు (6 శాతం), నిఫ్టీ 332 పాయింట్లు(3.2 శాతం) చొప్పున పెరిగాయి. 

చిత్తయిన చిన్న షేర్లు  
గత ఏడాది సెన్సెక్స్‌ 6%పెరిగినా, చిన్న షేర్లు మాత్రం చిత్తయ్యాయి. చిన్నషేర్లకు ప్రాతినిధ్యం వహించే బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 4,524 పాయింట్లు(24%), బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2,384 పాయింట్లు (13%) చొప్పున పతనమయ్యాయి. నిబంధనల్లో మార్పులు, 2017లో వేల్యూయేషన్లు అధికంగా ఉండటం, స్టాక్‌ మార్కెట్‌ తీవ్రమైన హెచ్చుతగ్గులు దీనికి ప్రధాన కారణాలు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top