ఎనిమిది రోజుల లాభాలకు బ్రేక్‌ 

Nifty forms bearish candle, 11572 may be key hurdle - Sakshi

అంతంత మాత్రంగా అంతర్జాతీయ సంకేతాలు  

222 పాయింట్ల నష్టంతో  38,165కు సెన్సెక్స్‌ 

64 పాయింట్లు తగ్గి 11,457కు నిఫ్టీ  

ఎనిమిది రోజుల సెన్సెక్స్‌ వరుస లాభాల జోరుకు శుక్రవారం బ్రేక్‌ పడింది. ఇటీవల లాభపడిన ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, వాహన, చమురు షేర్ల పతనం కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, రూపాయి జోరుకు కూడా అడ్డుకట్ట పడటం, మన వృద్ధి అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 222 పాయింట్ల నష్టంతో 38,165 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 11,457 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు చొప్పున పెరిగాయి.
 
అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన!  
వచ్చే ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటును 7 శాతం నుంచి 6.8 శాతానికి ఫిచ్‌ రేటింగ్స్‌ తగ్గించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ది అంచనాలను కూడా ఈ సంస్థ 7.2 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. ఆర్థిక కార్యకలాపాల జోరు అంచనాల కంటే బలహీనంగా ఉందని, అందుకే వృద్ధి అంచనాలను తగ్గించామని ఫిచ్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. జర్మనీ తయారీ రంగం మార్చిలో కూడా తగ్గింది. ఈ రంగం క్షీణించడం ఇది వరుసగా  మూడో నెల. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమిస్తోందన్న ఆందోళనలు మరింత బలపడ్డాయి. ఫలితంగా యూరప్‌ మార్కెట్లు కూడా నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది.  

475 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
మరోవైపు గత రెండు వారాల లాభాల కారణంగా పెరిగిన పలు షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణి నష్టాల్లో సూచీలు ట్రేడయ్యాయి. యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభం కావడంతో మన మార్కెట్లో అమ్మకాలు జోరుగా సాగాయి. సెన్సెక్స్‌  ఒక దశలో 178 పాయిం ట్లు లాభపడగా, మరో దశలో 297 పాయింట్లు పతనమైంది.  రోజంతా  475 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 52 పాయింట్లు లాభపడగా, మరో దశలో 87 పాయింట్లు నష్టపోయింది.

మరిన్ని మార్కెట్‌ కబుర్లు...
టాటా మోటార్స్‌ షేర్‌ 2.4 శాతం నష్టంతో రూ.175 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం నేపథ్యంలో విమానయాన రంగంలో విలీనాలు, కొనుగోళ్లు జరగవచ్చనే అంచనాలు పుంజుకున్నాయి. దీంతో స్పైస్‌జెట్‌ షేర్‌ 7 శాతం లాభంతో రూ.98 వద్ద, ఇండిగో స్వల్పంగా లాభపడి రూ.1,427 వద్ద ముగిశాయి. స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయినా ఎస్‌ఆర్‌ఎఫ్‌ షేర్‌ మాత్రం ఆల్‌టైమ్‌ హై, రూ.2,469ను తాకింది. చివరకు 2.5 శాతం లాభంతో రూ.2,459 వద్ద ముగిసింది. ఈ కంపెనీ స్పెషాల్టీ కెమికల్స్‌ వ్యాపారం పునరుజ్జీవం పొందగలదన్న అంచనాలతో   ఈ షేర్‌జోరుగా పెరుగుతోంది. ఈ షేర్‌తో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, టైటాన్‌ కంపెనీ, యూపీఎల్, బజాజ్‌ హోల్డింగ్స్, అర్‌వింద్‌ ఫ్యాషన్స్‌  ఈ జాబితాలో ఉన్నాయి.   బ్యాంక్‌ నిఫ్టీ కూడా ఆల్‌టైమ్‌ హై, 30,008 పాయింట్లను తాకింది. చివరకు 250   పాయింట్ల నష్టంతో 29,583 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ వార్త రాసే 11.30గంటలకు అమెరికా మా ర్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అం తర్జాతీయ వృద్ధిపై ఆందోళన దీనికి కారణం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top