మార్కెట్లో ఫెడ్‌ ప్రమత్తత

Nifty expiry likely around 11,600  - Sakshi

పెరిగిన చమురు ధరలు

మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌ 

23 పాయింట్లు పెరిగి  38,387కు సెన్సెక్స్‌ 

11 పాయింట్ల నష్టంతో 11,521కు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్‌ బుధవారం మిశ్రమంగా ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువతో వరుసగా ఎనిమిదో రోజూ సెన్సెక్స్‌ లాభపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నష్టపోయినా, కీలకమైన 11,500 పాయింట్ల ఎగువునే ముగియగలిగింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక రేట్ల నిర్ణయం నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టపోవడం, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమనడం ప్రతికూల ప్రభావం చూపించింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 23 పాయింట్ల లాభంతో 38,387 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయి 11,521 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆయిల్, గ్యాస్, విద్యుత్తు, వాహన షేర్లు నష్టపోగా, ఐటీ, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు లాభపడ్డాయి. 

174 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌ 
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆసియా మార్కెట్ల బలహీనతతో నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత  కొనుగోళ్ల జోరుతో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు  అప్రమత్తత పాటించారు. దీంతో పరిమిత శ్రేణిలో కదలాడింది. ఒక దశలో 47 పాయింట్లు పతనమైన నిఫ్టీ, మరో దశలో 127 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 174 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  

►పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.13,500 కోట్లు కుచ్చుటోపి పెట్టిన నీరవ్‌ మోదీ అరెస్ట్‌ వార్తల నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్‌ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 4 శాతం వరకూ లాభపడిన ఈ షేర్‌ చివరకు 3 శాతం లాభంతో రూ.93.55 వద్ద ముగిసింది. భారత్‌ నుంచి పారిపోయిన దాదాపు ఏడాది కాలానికి నీరవ్‌ మోదీ అరెస్ట్‌ జరిగింది.  
► షేర్ల  బైబ్యాక్‌ ఆఫర్‌ ఆరంభమైన నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ 2.3 శాతం లాభంతో రూ.738 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► ముడి చమురు ధరలు భగ్గుమనడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు–బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీలు 5%  నష్టపోయాయి.  
►  ఆర్‌కామ్‌ లాభాలు బుధవారం కూడా కొనసాగాయి. 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.4.84 వద్దకు చేరింది. 
►  మరో ఆరు విమాన సర్వీసులు రద్దు కావడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 5 శాతం పతనమై రూ.218 వద్ద ముగిసింది.   
►  జెట్‌ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసుల రద్దుతో ప్రయోజనం పొందే అవకాశాలు ఉండటంతో స్పైస్‌జెట్‌ షేర్‌ బాగా పెరిగింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలను లీజుకు తీసుకోవడానికి సంబంధిత సంస్థలతో స్పైస్‌జెట్‌ చర్చలు జరుపుతోందనే వార్తలూ వచ్చాయి. మొత్తం మీద ఈ షేర్‌ 16 శాతం లాభంతో రూ.92 వద్ద ముగిసింది.  
►‌జెట్‌ చర్చలు జరుపుతోందనే వార్తలూ వచ్చాయి. మొత్తం మీద ఈ షేర్‌ 16 శాతం లాభంతో రూ.92 వద్ద ముగిసింది.  
​​​​​​​► జపాన్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 

నేడుసెలవు 
హోలీ సందర్భంగా స్టాక్‌ మార్కెట్‌కు నేడు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top