ఐదో రోజూ లాభాలే

Nifty closes just below 10,900, Sensex up 300 points led by metal, energy stocks - Sakshi

తగ్గిన వాణిజ్య లోటు  

 పెరిగిన రూపాయి 

36,000 పాయింట్లపైకి సెన్సెక్స్‌

307 పాయింట్ల లాభంతో 36,270 వద్ద ముగింపు 

83 పాయింట్లు పెరిగి 10,888కు నిఫ్టీ  

స్టాక్‌ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజూ స్టాక్‌సూచీలు లాభాల్లో ముగిశాయి. రూపాయి బలపడటం, వాణిజ్య లోటు తగ్గడం వంటి సానుకూల కారణాలతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36 వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,850 పాయింట్లపైకి ఎగబాకాయి. వాహన, లోహ, ఆర్థిక, వినియోగ రంగ షేర్లు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మళ్లీ పుంజుకోవడం, ముడి చమురు ధరలు నిలకడగా ఉండటం  కలసివచ్చింది. సెన్సెక్స్‌ 307 పాయింట్ల లాభంతో 36,270 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 10,888 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఐదు రోజుల్లో సెన్సెక్స్‌ 1,310 పాయింట్లు పెరిగింది.  

సానుకూల ఆర్థికాంశాలు... 
ఈ ఏడాది అక్టోబర్‌లో 1,713 కోట్ల డాలర్లుగా ఉన్న భారత వాణిజ్య లోటు గత నెలలో 1,667 కోట్ల డాలర్లకు తగ్గడం ఇన్వెస్టర్లలో జోష్‌ను నింపింది. ముడి చమురు ధరలు నిలకడగా ఉండటంతో రూపాయి లాభపడడం కలసివచ్చింది. రూపాయి ఇంట్రాడేలో 37 పైసలు బలపడి 71.53ను తాకింది. చివరకు 34 పైసల లాభంతో 71.56 వద్ద ముగిసింది. భారత్‌లో పెట్టుబడి వాతావరణం మెరుగుపడిందన్న కేర్‌ రేటింగ్స్‌ తాజా నివేదిక మార్కెట్‌ సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌  రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 349 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ముగిశాయి.  

∙టాటా మోటార్స్‌ లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ టర్న్‌ అరౌండ్‌ వ్యూహంలో భాగంగా వేలాదిగా ఉద్యోగాలను తొలగించనున్నదన్న వార్తలు వచ్చాయి. ఈ  కారణంగా టాటా మోటార్స్‌ షేర్‌ 4.1 శాతం లాభంతో రూ.174 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.  

∙స్టాక్‌ సూచీల మాదిరే బంధన్‌ బ్యాంక్‌ షేర్‌ కూడా వరుసగా ఐదో రోజూ లాభపడింది. కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు ఆర్‌బీఐ అనుమతించిన కారణంగా ఈ షేర్‌ జోరుగా పెరుగుతోంది.       
 ∙జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 3.7 శాతం పతనమై రూ.250 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మాజీ సీఈఓ నికోస్‌ కర్దాసిస్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌కు గుడ్‌బై చెప్పడం దీనికి ప్రధాన కారణం.  
∙ప్రమోటర్‌ వాటా విషయమై ఆర్‌బీఐ ఆదేశాలను కొట్టేయాలన్న కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అభ్యర్థనను బాంబే హైకోర్ట్‌ కొట్టేసింది.  దీంతో బ్యాంక్‌ షేర్‌ 2.5 శాతం నష్టంతో రూ.1,224 వద్ద ముగిసింది. 
∙ వేదాంతా కంపెనీకి ట్యుటికోరిన్‌లో ఉన్న స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌ను మూసేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వును నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌(ఎన్‌జీటీ) కొట్టేసింది. ఇంట్రాడేలో 6 శాతం వరకూ ఎగసిన ఈ షేర్‌ చివరకు 2.21 శాతం లాభంతో రూ. 206 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top