10,500 దిగువకు నిఫ్టీ

Nifty below 10,500 - Sakshi

కొనసాగిన అమ్మకాలు   

288 పాయింట్లు పతనమై 34,011కు సెన్సెక్స్‌  

93 పాయింట్లు క్షీణించి 10,452కు నిఫ్టీ

బ్యాంక్‌ షేర్లతో పాటు వాహన, లోహ, పీఎస్‌యూ, క్యాపిటల్‌ గూడ్స్, రియల్టీ షేర్లలో కూడా అమ్మకాలు జరగడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 288 పాయింట్ల నష్టంతో 34,011 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 93 పాయింట్లు క్షీణించి 10,452 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే ఈ రెండు సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 5 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయింది.  

అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా మన స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. పీఎన్‌బీ కుంభకోణం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని, ఇతర బ్యాంక్‌లకు కూడా ఈ కుంభకోణం విస్తరించే అవకాశాలున్నాయంటూ వారు అందోళన చెందుతున్నారని వివరించారు. మరోవైపు ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా జనవరిలో వాణిజ్య లోటు 1,630 కోట్ల డాలర్లకు ఎగియడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది.

సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 211 పాయింట్ల లాభంతో 34,508 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 340 పాయింట్లు పతనమై  33,957 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మొత్తం మీద 551 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

కొనసాగిన పీఎన్‌బీ నష్టాలు..
రూ.11,300 కోట్ల కుంభకోణం నేపథ్యంలో పీఎన్‌బీ నష్టాలు మూడో  రోజు కూడా కొనసాగాయి. శుక్రవారం ఈ షేర్‌ 2 శాతం క్షీణించి రూ.126 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 6 శాతం క్షీణించి తాజా ఏడాది కనిష్ట స్థాయి రూ.121కు పడిపోయింది. శుక్రవారం బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.655 కోట్లు హరించుకుపోయి, రూ.30,478 కోట్లకు చేరింది. గత మూడు రోజుల్లో బ్యాంక్‌ మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.8,731 కోట్లు ఆవిరైంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ సాధించిన నికర లాభం, రూ.1,324 కోట్లకు దాదాపు 6 రెట్లు అధికం కావడం విశేషం.

ఇక కుంభకోణం బ్యాంక్‌ విలువ వార్షిక లాభానికి 8 రెట్లుగా ఉంది. మరోవైపు బ్యాంక్‌ అనుబంధ సంస్థ, పీఎన్‌బీ హౌసింగ్‌ 1 శాతం లాభంతో రూ.1,210 వద్ద ముగిసింది. పీఎన్‌బీ ఎల్‌ఓయూలు ఆధారంగా తాము రూ.1,900 కోట్ల మేర రుణాలు ఇచ్చామని  ప్రకటించడంతో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 1.2 శాతం వరకూ నష్టపోయింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది.  పీఎన్‌బీ స్కామ్‌ కీలక పొత్రధారి  నీరవ్‌ మోదీ వ్యాపార భాగస్వామి మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ షేర్‌ శుక్రవారం కూడా  మరో 20 శాతం పతనమైంది.

రూ.37.55 వద్ద ముగిసింది.గత మూడు రోజుల్లో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.300 కోట్లు హరించుకుపోయింది. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసేనాటికి ఈ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.445 కోట్లుగా ఉంది. టీబీజడ్‌ 3.4 శాతం, తంగమలై జ్యువెలరీ 5 శాతం చొప్పున పతనం కాగా, రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 0.5 శాతం, పీసీ జువెలర్‌ 7 శాతం చొప్పున లాభపడ్డాయి.  పీఎన్‌బీ జారీ చేసిన ఎల్‌ఓయూలు ఆధారంగా అలహాబాద్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌లు కూడా రుణాలు ఇచ్చాయని వార్తల కారణంగా ఈ రెండు షేర్లు 1 శాతం వరకూ నష్టపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top