‘ఫండా’లంటే... ఈ తప్పులొద్దు!

News about  Mutual funds  - Sakshi

స్టాక్స్‌ విలువలు గరిష్ట స్థాయికి చేరాయి

బడ్జెట్లో పన్నుతో కాస్తంత కరెక్షనూ మొదలైంది

దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసేట్లయితేనే మంచిది

మార్కెట్ల హెచ్చుతగ్గులు చూసి సిప్‌ ఆపడం సరికాదు  

గడిచిన ఏడాది కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు 30 శాతం పెరిగిపోయాయి. 2016 డిసెంబర్‌లో రూ.16.46 లక్షల కోట్లుగా ఉంటే 2017 డిసెంబర్‌ నాటికి అవి రూ.21.37 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. సిప్‌ విధానంలో నెలనెలా ఈక్విటీలోకి వచ్చే పెట్టుబడులు ఏకంగా రూ.6,200 కోట్లకు చేరాయి.

సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం :  రయ్యిమంటూ ఎగసిన స్టాక్‌ మార్కెట్లలో... బడ్జెట్‌కు కాస్త ముందు నుంచే దిద్దుబాటు మొదలైందని చెప్పాలి. సూచీల్లోని స్టాక్‌లు పెద్దగా పడకపోయినా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ షేర్లు బాగానే పడ్డాయి. ఇక బడ్జెట్‌ నాడు, ఆ తరువాతి రోజు అన్ని షేర్లూ భారీగానే పతనమయ్యాయని చెప్పాలి. మరి మున్ముందు మార్కెట్లు ఎలా ఉంటాయి? కొందరేమో ఈ కరెక్షన్‌ కొనసాగవచ్చని అంచనాలు వేస్తున్నారు.

కొందరైతే పెరిగిన మార్కెట్లలో దిద్దుబాటు తప్పదని, ఇది తాత్కాలికమేనని చెబుతున్నారు. ఎవరేం చెప్పినా ఇపుడు ఇన్వెస్టర్ల ముందున్న ప్రశ్నల్లా ఒకటే! మనమేం చెయ్యాలి అని? ముఖ్యంగా మ్యూచ్‌వల్‌ ఫండ్లలో సిస్టమాటిక్‌ ప్లాన్‌లో (సిప్‌) ఇన్వెస్ట్‌ చేస్తున్న వారంతా... మార్కెట్లు ఇంకా పడ్డాక సిప్‌ చేద్దామా... ప్రస్తుతానికి ఆపేద్దామా అనుకుంటున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదన్నది నిపుణుల మాట. ఎందుకంటే ‘సిప్‌’కు మార్కెట్లు పెరగటం, తగ్గటంతో సంబంధం లేదు. అలా చేస్తేనే లాభాలొస్తాయి కూడా!! అందుకే... ఈ సమయంలో మ్యూచ్‌వల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లు చేయకూడని తప్పులేంటో ఒకసారి చూద్దాం..

డివిడెండ్ల కోసం పెట్టుబడులు
బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ అన్నవి డెట్, ఈక్విటీ పెట్టుబడులతో ఉంటాయి. ఒకవైపు భద్రత మరోవైపు అధిక రాబడులిచ్చే విధానంతో ఇవి పని చేస్తాయి. అయితే, వీటిని డివిడెండ్‌ ఆదాయాన్నిచ్చే ఫండ్స్‌గా పరిగణించడం అలవాటైపోయింది. దీంతో గతంలో ఏడాదికోసారే డివిడెండ్‌నిచ్చే ఈ ఫండ్లు  మూడు నెలలకోసారి, కొన్ని నెలకోసారి ఇస్తున్నాయి. పన్ను పరంగా వీటిని మెరుగైన స్థిరాదాయాన్నిచ్చే పథకాలుగా చూస్తున్నారు.

అయితే, ఈ డివిడెండ్లను ఆయా ఫండ్లు మిగులు నిల్వల నుంచి చెల్లిస్తుంటాయి. అయితే, ఈ తరహా చెల్లింపులు ఎల్లవేళలా కొనసాగుతాయనే హామీ ఏమీ ఉండదు. ఎందుకంటే మార్కెట్ల ర్యాలీకి బ్రేక్‌ పడితే ఈ ఫండ్స్‌ వద్ద మిగులు నిల్వలు తగ్గిపోతాయి. దాంతో డివిడెండ్లు చెల్లించేందుకు సరిపడా నిధులుండవు. దీనికి బదులు స్థిరాదాయం కోరుకునే వారు బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లోనే గ్రోత్‌ ఆప్షన్‌లో ఇన్వెస్ట్‌ చేసి, ఏడాది గడిచాక క్రమానుగత ఉపసంహరణ విధానంలో (ఎస్‌డబ్ల్యూపీ) నిర్ణీత మొత్తం వెనక్కి తీసుకోవాలి. దీనివల్ల మెరుగైన ఆదాయంతోపాటు, ఫండ్స్‌ వద్ద మిగిలి ఉన్న నిధులపై మెరుగైన రాబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది.

స్వల్పకాలం కోసం పెట్టుబడి..!
మార్కెట్లలో సిప్‌ ద్వారా పెట్టుబడులు ఆరంభించేవారు అవసరమైతే మరింత ఎక్కువ కాలం కొనసాగేందుకు ముందే సిద్ధపడాలి. ఎందుకంటే 1997 ఏప్రిల్‌ నుంచి 2000 మార్చి మధ్య ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ప్లస్‌ పథకంలో సిప్‌ ద్వారా ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేసి ఉంటే ఆ పెట్టుబడుల విలువ మూడేళ్లలో రూ.10.41 లక్షలకు చేరి ఉండేది.

అదే 2000 ఏప్రిల్‌లో సిప్‌ ఆరంభించి 2003 మార్చి వరకు చేసి ఉంటే పెట్టుబడుల విలువ రూ.3.8 లక్షలయి ఉండేది. ఇక్కడ రెండు భిన్న సమయాల్లోనూ నికర పెట్టుబడి రూ.3.6 లక్షలు. కానీ మొదటి ఉదాహరణలో అది రూ.10.41 లక్షలకు పెరిగితే, రెండో ఉదాహరణలో కేవలం 3.6 శాతం వృద్ధితోనే రూ.3.8 లక్షలకు చేరింది. మార్కెట్ల పరిస్థితిని బట్టి రాబడులుంటాయి కనక అవసరమైతే అధిక కాలం ఇన్వెస్ట్‌మెంట్‌ కొనసాగించాల్సి ఉంటుంది.

సిప్‌ ఆపేయడం సరికాదు...
ఇన్వెస్టర్లు 2017లో రూ.1.9 లక్షల కోట్ల విలువైన హోల్డింగ్స్‌ను విక్రయించేశారు. 2016 కంటే ఇది 45 శాతం అధికం. కొందరు ఇన్వెస్టర్లు మొత్తం పెట్టుబడులకు సంబంధించి లాభాల స్వీకరణ చేయగా, కొందరు విలువలు పెరగడంతో సిప్‌ పెట్టుబడులను ఆపేశారు. ఇలా చేయడం దీర్ఘకాలంలో నష్టానికి కారణమవుతుంది. కరెక్షన్‌ వస్తుందన్న అంచనాలతోనే, వచ్చిందన్న భయంతోనో మీ పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటే వాటిపై కాంపౌండింగ్‌ ప్రయోజనాలను కోల్పోతారు. దీంతో మీ లకి‡్ష్యత నిధి కంటే తక్కువే సమకూరడానికి దారితీయవచ్చు.

స్మాల్, మిడ్‌క్యాప్స్‌ విషయంలో జాగ్రత్త
గత మూడు సంవత్సరాల్లో మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ 23 శాతం, 17 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చాయి. దీంతో అవి మల్టీక్యాప్, లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ మించి రాబడులను ఇచ్చాయి. ఈ పనితీరు చూసిన వారు ఈ ఫండ్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపడం సాధారణం. అయితే, స్మాల్‌ క్యాప్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌కు కేటాయింపులు పెంచడం సరికాదనేది నిపుణుల అభిప్రాయం. అధిక రాబడులను ఇచ్చే సామర్థ్యం ఈ పథకాలకు ఉంటుంది.

అయితే, మార్కెట్లు ప్రతికూలంగా మారినప్పుడు వీటిలో ఆటుపోట్లు ఎక్కువవుతాయి. తాజా బడ్జెట్‌లో లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను వేయటంవల్ల శుక్రవారం మార్కెట్‌ సూచీలు భారీగా దాదాపు 2 శాతానికి పైనే నష్టపోయాయి. కానీ స్మాల్, మిడ్‌క్యాప్‌ షేర్లు కొన్ని 10 శాతం కన్నా ఎక్కువే పడ్డాయి. అందుకే ఇప్పటికే మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు వారికి సౌకర్యం అనిపించే స్థాయిలో అలా కొనసాగించడమే మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇన్వెస్ట్‌ చేసి ఉండకపోతే వాటికి ఈ సమయంలో దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

అవసరమైతే సలహా తీసుకోక తప్పదు
ఫండ్స్‌లో ఓ పథకంలో నేరుగా పెట్టుబడులు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. వీటిని డైరెక్ట్‌ ప్లాన్లుగా పేర్కొంటారు. రెగ్యులర్‌ పథకాలతో పోలిస్తే డైరెక్ట్‌ ప్లాన్లలో ఖర్చుల శాతం తక్కు వ ఉంటుంది. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల తగినంత అవగాహన లేని వారు నేరుగా ఇన్వెస్ట్‌ చేయకుండా ఉండడమే నయం. ఎందుకంటే తగి న పథకాన్ని ఎంచుకోకపోయినా, తరచూ పెట్టుబడుల నుంచి వైదొలగినా, అననుకూల సమయాల్లో పెట్టుబడులు పెట్టినా డైరెక్ట్‌ ప్లాన్లు లక్ష్యాలను చేరేందుకు సాయపడలేవు. ఈ సమయంలో ఆర్థిక సలహాదారుల అవసరం ఏర్పడుతుంది. వారు అన్ని రకాల పరిస్థితులకు తగినట్టు సూచనలు చేస్తారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top