మీ ఫండ్‌ పేరు మారుతోందా!?

Mutual fund companies and their projects - Sakshi

సెబీ ‘వన్‌ స్కీమ్‌ పర్‌ కేటగిరీ’ నిబంధన నేపథ్యం

ఇప్పటికే పలు పథకాల పేర్లలో మార్పులు

ఇన్వెస్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, అడ్వైజర్లకు సమస్యే!

స్కీమ్స్‌ బ్రాండ్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చు!!

విలీనాలతో గణనీయంగా తగ్గనున్న స్కీమ్స్‌ సంఖ్య

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు వాటి పథకాల పేర్లను మారుస్తున్నాయి. మార్కెట్‌ నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఇటీవల ప్రకటించిన కొత్త నిబంధనల నేపథ్యంలో ఆయా ఫండ్‌ సంస్థలు ఈమేరకు వాటి పథకాల పేర్లలో మార్పులు చేస్తున్నాయి. దీంతో రానున్న కొన్ని వారాల్లో దాదాపు 300–400 వరకు మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) స్కీమ్స్‌ పేర్లు మారబోతున్నాయి. సెబీ ‘వన్‌ స్కీమ్‌ పర్‌ కేటగిరీ’ రూల్‌ (ఒక కేటగిరీ నుంచి ఒక స్కీమ్‌) వల్ల ప్రతి ఐదు పథకాల్లో ఒకదాని పేరు మారుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు.

పేర్ల మార్పు ప్రారంభమైంది..  
మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్స్‌ పేర్ల మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ ఎంఎఫ్, మోతీలాల్‌ ఓస్వాల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్, హెచ్‌ఎస్‌బీసీ ఎంఎఫ్‌ వంటి సంస్థలు పలు పథకాల పేర్లను మారుస్తున్నట్లు ప్రకటించాయి. ఇంకా చాలా ఫండ్‌ హౌస్‌లు రెగ్యులేటరీ అనుమతుల కోసం వేచిచూస్తున్నాయని సమాచారం. అంటే రానున్న రోజుల్లో చాలా కంపెనీలు పథకాల పేర్ల మార్పునకు  సంబంధించి ప్రకటనలు చేయనున్నాయి.  

పథకాలన్నీ ఐదు కేటగిరీల్లోనే..
సెబీ గత ఆక్టోబర్‌లో ఎంఎఫ్‌ స్కీమ్స్‌ కేటగిరైజేషన్, విలీనాలకు సంబంధించి ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం.. ఫండ్‌ పథకాలన్నీ .. ఐదు కేటగిరీల్లోనే ఉండాలి. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నిధుల సమీకరణ కోసం ఒకే థీమ్‌ కింద అనేక స్కీములను ప్రవేశపెడుతుండటాన్ని చెక్‌ పెట్టడానికి, ఇన్వెస్టర్లను మభ్యపెట్టి వారిని పథకాలలో ఇన్వెస్ట్‌ చేసేలా చేయడాన్ని అడ్డుకోవడానికి సెబీ ఈ కొత్త నిబంధనలు రూపొందించింది.

ఇకపై మ్యూచువల్‌ ఫండ్‌ స్కీముల్లో కేవలం ఐదు రకాలు ఉండాలని నిర్దేశించింది. దీని ప్రకారం స్కీములన్నింటినీ కూడా ఈక్విటీ, డెట్, హైబ్రీడ్, సొల్యూషన్‌ ఓరియంటెడ్, అదర్‌ స్కీమ్‌ అనే ఐదు కేటగిరీల్లోనే వర్గీకరించాల్సి ఉంటుంది. ఒక కేటగిరీ నుంచి ఒకటే స్కీముకు అనుమతి ఉంటుంది. అయితే ఇండెక్స్‌ ఫండ్స్, వివిధ సూచీల ఆధారంగా పనిచేసే ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), రకరకాల స్కీమ్‌ల ఆధారంగా ఉండే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్, వివిధ థీమ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే సెక్టోరల్‌ లేదా థీమాటిక్‌ ఫండ్స్‌కి దీన్నుంచి మినహాయింపు ఉంటుంది.   

1,910 పథకాలున్నాయి!
ప్రస్తుతం ఇన్‌కమ్, ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్స్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌), బ్యాలెన్స్‌డ్, మనీ మార్కెట్, ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) వంటి పలు కేటగిరీల్లో దాదాపు 1,910 మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్స్‌ ఉన్నాయి. సెబీ ఒక కేటగిరీలో ఒకటి కన్నా ఎక్కువ స్కీమ్స్‌ ఉంటే వాటిని విలీనం చేయడమో లేక వాటి ఫండమెంటల్స్‌ మార్చడమో చేయాలని అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలను కోరింది. అయితే ఇలా చేయడానికి ఆయా ఫండ్‌ సంస్థలు సెబీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

స్కీమ్స్‌ విలీనం వల్ల పథకాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు పేర్కొన్నాయి. ఇక అడ్వాంటేజ్, క్రెడిట్, ప్లస్, ఆపర్చ్యునిటీస్, ప్రుడెన్సీ, ఫోకస్ట్‌ వంటి పదాలు పథకాల పేర్లలో ఉండటానికి సెబీ అభ్యంతరం తెలిపిందని సమాచారం. ఈ పదాలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పటిస్తున్నాయని సెబీ భావిస్తున్నట్లుంది. కాగా స్కీమ్స్‌ వర్గీకరణ అనేది పరిశ్రమకు చాలా కఠినమైన పని అని నిపుణులు పేర్కొన్నారు. జూన్‌ వరకు ఈ ప్రక్రియ కొనసాగవచ్చని అంచనా వేశారు.   

గందరగోళం తప్పదు..
సెబీ ఎంఎఫ్‌ పథకాల కేటగిరైజేషన్‌ నిర్ణయం వల్ల ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొనవచ్చని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘పేరు మార్పు వల్ల ఇన్వెస్టర్లలో గందరగోళం ఏర్పడవచ్చు. కొన్ని స్కీమ్స్‌ బ్రాండ్‌గా అవతరించాయి. ప్రజలు వాటితో అనుసంధానమయ్యారు. ఏ స్కీమ్‌ పేరు ఏ విధంగా మారిందో తెలుసుకోవడం కష్టమౌతుంది’ అని మార్నింగ్‌స్టార్‌ ఇండియా ఫండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ కౌస్తుభ్‌ బెలపుర్కర్‌ తెలిపారు. ‘సెబీనే తొలిగా పేర్లకు అనుమతించింది.

దశాబ్దాలుగా ఉన్న ఆ పేర్లతోనే ఇప్పుడు సమస్య వస్తోంది. మాకు ఎలాంటి ఆప్షన్‌ లేదు. రెగ్యులేటర్‌ నిబంధనలకు అనువుగా మసులుకోవాల్సిందే. కానీ ఇది సరైన పద్ధతి కాదు’ అని పేరు వెల్లడించడానికి ఇష్టంలేని ఒక పెద్ద ఫండ్‌ హౌస్‌ సీఈవో తెలిపారు. కేవలం ఇన్వెస్టర్లకు మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు, అడ్వైజర్లకు కూడా కొత్త నిబంధన వల్ల సమస్యలు ఎదురు కానున్నాయని పేర్కొన్నారు.

‘హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, రిలయన్స్‌ గ్రోత్, రిలయన్స్‌ ఈక్విటీ ఆపర్చ్యునిటీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వాల్యు డిస్కవరీ ఫండ్, బిర్లా సన్‌లైఫ్‌ ఫ్రంట్‌లైన్‌ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఫోకస్డ్‌ బ్లూచిప్, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ప్రైమా ప్లస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వంటి పేరొందిన స్కీమ్స్‌కు ఇన్వెస్టర్లు త్వరగా కనెక్ట్‌ అవుతారు. ఇవి కేవలం స్కీమ్స్‌ మాత్రమే కాదు బ్రాండ్స్‌ కూడా’ అని ఓ డిస్ట్రిబ్యూటర్‌ తెలిపారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top