ప్రపంచ సంపన్న నగరాల్లో ముంబై

Mumbai is the world's wealthiest city - Sakshi

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రపంచ సంపన్న నగరాల్లో ఒకటిగా నిలిచింది. 950 బిలియన్‌ డాలర్ల (రూ.60.8 లక్షల కోట్లు) సంపదతో అంతర్జాతీయంగా 12వ స్థానంలో ఉంది. న్యూయార్క్‌ ఈ విషయంలో ప్రపంచంలోనే అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు ప్రపంచంలో 15 సంపన్న నగరాలతో ఓ నివేదిక విడులైంది. ముంబై తర్వాత 944 బిలియన్‌ డాలర్ల (రూ.50.04 లక్షల కోట్లు)తో టొరంటో, 912 బిలియన్‌ డాలర్ల(రూ.58.3 లక్షల కోట్లు)తో ఫ్రాంక్‌ఫర్ట్, 860 బిలియన్‌ డాలర్ల(రూ.54.4 లక్షల కోట్లు)తో పారిస్‌ అధిక సంపన్న నగరాలుగా జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.

ఆయా నగర ప్రజల వ్యక్తిగత సంపద (ఆస్తులు, నగదు, ఈక్విటీలు, వ్యాపారాలు, వీటిలో అప్పులు మినహాయించి) మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని వేసిన అంచనాలు ఇవి. ప్రభుత్వ నిధుల్ని మినహాయించారు. బిలియనీర్ల జనాభా (కనీసం 100 కోట్ల డాలర్ల ఆస్తి ఉన్న వారు) పరంగానూ ముంబై ప్రపంచంలో పదో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నగరంలో 28 మంది బిలియనీర్లు ఉన్నారు. ‘‘ముంబై నగరంలో వ్యక్తుల సంపద 950 బిలియన్‌ డాలర్లు.

ఈ నగరం దేశానికి ఆర్థిక కేంద్రంగా ఉంది. ప్రపంచంలో 12వ అతిపెద్ద స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ బీఎస్‌ఈ కూడా ఇక్కడే ఉంది. ఈ నగరంలో ప్రధాన పరిశ్రమలుగా ఫైనాన్షియల్‌ సర్వీసెస్, రియల్‌ ఎస్టేట్, మీడియా ఉన్నాయి’’ అని నివేదిక తెలిపింది. రానున్న పదేళ్ల కాలంలో ముంబై సంపద వృద్ధి పరంగా అత్యంత వేగాన్ని ప్రదర్శిస్తుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది.

నివేదికలో వివరాలు...
న్యూయార్క్‌ నగరం ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ నగర సంపద విలువ 3 లక్షల కోట్ల డాలర్లు (రూ.192 లక్షల కోట్లు). రెండు అతిపెద్ద స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లు ఈ నగరంలోనే ఉన్నాయి.
2.7 లక్షల కోట్ల డాలర్ల (రూ.172.8 లక్షల కోట్లు) సంపదతో లండన్‌ రెండో స్థానంలో ఉంది.  
♦  2.5 లక్షల కోట్ల డాలర్ల సంపదతో టోక్యో, 2.3 లక్షల కోట్ల డాలర్లతో శాన్‌ఫ్రాన్సిస్కో, 2.2 లక్షల కోట్ల డాలర్ల సంపదతో బీజింగ్, 2 లక్షల కోట్ల డాలర్లతో షాంఘై, 1.4 లక్షల కోట్ల డాలర్లతో లాస్‌ ఏంజెలిస్, 1.3 లక్షల డాలర్లతో హాంకాంగ్, లక్ష కోట్ల డాలర్లతో సిడ్నీ, 988 బిలియన్‌ డాలర్లతో చికాగో టాప్‌–15లోకి చేరాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top