మల్టీ క్యాప్‌ ఫండ్‌ మంచిదేనా?

Is Multi Cap Fund Good? - Sakshi

నేను గత నాలుగేళ్లుగా హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఈ నాలుగేళ్లలో హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ చక్రగతిన 22 శాతం రాబడులనివ్వగా, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ మాత్రం 17 శాతం రాబడులను మాత్రమే ఇవ్వగలిగింది. ఈ అక్టోబర్‌లో ఈ సిప్‌లను రెన్యూవల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఫండ్స్‌ ఒకే మ్యూచువల్‌ ఫండ్‌కు చెందినవి కాబట్టి, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ సిప్‌ను ఆపేసి, మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ సిప్‌ను కొనసాగించమంటారా?   –వైదేహి, విజయవాడ  
హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ పనితీరు ఇటీవల తగిన స్థాయిలో లేదు. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌ క్యాప్‌ 22 శాతం రాబడులనివ్వగా, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ 17 శాతం రాబడులనిచ్చింది. మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ కంటే ఈక్విటీ ఫండ్‌ తక్కువ రాబడి ఇచ్చిందనే ఉద్దేశంతో మీరు అసంతృప్తిగా ఉన్నారు. కానీ మీరు ఒక్క విషయం గమనించాలి. ఒక బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై ఈ నాలుగేళ్లలో గరిష్టంగా 8 శాతం రాబడిని మాత్రమే మీరు పొందగలరు. దీంతో పోల్చితే హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ రెట్టింపు రాబడిని ఇచ్చింది కదా !  పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ,  ఈ ఫండ్‌ బ్యాంక్‌ ఎఫ్‌డీ కన్నా రెట్టింపు రాబడిని ఇచ్చింది. రాబడులు తక్కువగా ఉన్నాయన్న కారణంగా ఈక్విటీ ఫండ్‌ నుంచి వైదొలగడం సరైన నిర్ణయం కాదు. దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్‌ మంచి రాబడులనే ఇస్తాయి. అందుకని ఈ ఈక్విటీ ఫండ్‌లో నిరభ్యంతరంగా సిప్‌ను కొనసాగించవచ్చు. అయితే రెండూ ఒకే మ్యూచువల్‌ ఫండ్‌కు చెందినవి కాబట్టి, ఈక్విటీ ఫండ్‌ సిప్‌ను ఆపేసి, మరో కంపెనీకి చెందిన మల్టీ క్యాప్‌ ఫండ్‌లో సిప్‌ను ప్రారంభించవచ్చు.  

నేను గత కొంత కాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోతో లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఉన్నాయి. మరికొన్ని లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. అయితే వీటికి బదులుగా మల్టీ–క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమని మిత్రులు సలహా ఇస్తున్నారు. తగిన సూచన ఇవ్వండి.  – మధు, హైదరాబాద్‌
మల్టీ క్యాప్‌ ఫండ్‌ విజయం.... ఆ ఫండ్‌ను నిర్వహించే ఫండ్‌ మేనేజర్‌ను బట్టి ఉంటుంది. ఫండ్‌ మేనేజర్‌ మంచి అనుభవజ్ఞుడై, మంచి సక్సెస్‌ ట్రాక్‌ రికార్డ్‌ ఉంటే, మల్టీ క్యాప్‌ మంచి రాబడులు సాధిస్తుంది. మార్కెట్లో ఒక్కోసారి లార్జ్‌ క్యాప్‌లు మంచి రాబడులనిస్తాయి. మరొక్కసారి మిడ్‌ క్యాప్‌లు రాణిస్తాయి. ఒక్కోసారి స్మాల్‌ క్యాప్‌లు దుమ్ము రేపుతాయి. అయితే మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడు మాత్రం స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ బాగా క్షీణిస్తాయి. మిడ్‌ క్యాప్‌ ఫండ్‌లు కూడా కుదేలవుతాయి. లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ మాత్రం తట్టుకొని నిలబడగలుగుతాయి. మూడేళ్ల క్రితం మీరు కొంత సొమ్మును వివిధ రకాల  ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. ఇప్పుడు వాటి రాబడులను పరిశీలిస్తే, స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌  ఇన్వెస్ట్‌మెంట్స్‌ రెట్టింపయ్యేవి. లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఒకటిన్నర రెట్లు పెరిగేవి. అదే 2008 నాటి పరిస్థితులను పరిశీలిస్తే, స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌70–80 శాతం వరకూ హరించుకుపోయాయి. లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 40 శాతం వరకూ ఆవిరయ్యాయి. ఏతావాతా తేలేదేమిటంటే, మార్కెట్‌ బాగా లేనప్పుడు స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌కు భారీ నష్టాలు, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌కు ఓ మోస్తరు నష్టాలు వస్తాయి. మార్కెట్‌ బాగా ఉన్నప్పుడు స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ భారీ రాబడులనిస్తుండగా, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌కు ఓ మోస్తరు లాభాలు వస్తాయి. పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా స్మాల్, మిడ్‌ క్యాఫ్‌ ఫండ్స్‌లు ఉండాలనుకుంటే, మార్కెట్‌ పతన సమయంలో కూడా ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించడం తప్పనిసరి. స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయనే విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మార్కెట్‌ ఒడిదుడుకుల పరంగా మీ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్‌ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.  ఈ గందరగోళం, అయోమయం ఎందుకులే అనుకుంటే, మంచి మల్టీ క్యాప్‌ను ఎంచుకొని, కనీసం ఐదేళ్ల పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ముందే చెప్పినట్లుగా, మీరు మంచి ఫండ్‌ మేనేజర్‌ను పట్టుకోగలిగితే, మల్టీ క్యాప్‌ ఫండ్‌ మంచిది.  ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల కంపెనీలుంటాయి. అంటే స్మాల్, మిడ్, లార్జ్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు ఉంటాయి. ఫలితంగా మీకు డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు లభిస్తాయి.  

గిల్ట్‌ ఫండ్‌ విలువ తగ్గుతుందా? అసలు ఏ సందర్భాల్లో గిల్ట్‌ ఫండ్‌ విలువ తగ్గే అవకాశాలున్నాయి?  –కృష్ణ స్వామి, చెన్నై  
గిల్ట్‌ ఫండ్స్‌.. ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. సాధారణంగా బాండ్ల విషయానికొస్తే, రెండు రకాల రిస్క్‌లు ఉన్నాయి. మొదటిది.. వడ్డీరేట్లలో ఒడిదుడుకులు. వడ్డీరేట్లు తగ్గడం, లేదా పెరగడం. ఇక రెండోది బాండ్లకు సంబంధించిన వడ్డీని కానీ, అసలును కానీ సకాలంలో చెల్లించలేకపోవడం. అయితే ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే గిల్ట్‌ ఫండ్స్‌కు రెండో రిస్క్‌ ఉండదు. ఎందుకంటే బాండ్ల విషయమై వడ్డీ, అసలు చెల్లింపుల్లో ప్రభుత్వం విఫలం కాదు కదా! ఇక మొదటి రిస్క్‌ విషయానికొస్తే, వడ్డీరేట్లు పెరిగితే గిల్ట్‌ ఫండ్స్‌ రాబడులు తగ్గుతాయి. బాండ్ల మెచ్యురిటీ దీర్ఘకాలం పాటు ఉంటుంది.దీర్ఘకాలంలో వడ్డీరేట్ల కదలికల తీవ్రత గిల్ట్‌ ఫండ్స్‌పై ఉంటుంది.
ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌  

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top