ఆర్‌బీఐ ప్రతిపాదనలపై ఫిచ్‌ హెచ్చరిక

More Forced Lending To NBFCs Can Land Banks InTrouble Says Fitch - Sakshi

ఎన్‌బీఎఫ్‌సీలకు మరిన్ని రుణాలతో బ్యాంకులకు సమస్యలు

సాక్షి, ముంబై : బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), రిటైల్‌ రుణ గ్రహీతలకు బ్యాంకులు మరిన్ని రుణాలు పంపిణీ చేసే దిశగా ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న పలు చర్యలు అంతిమంగా బ్యాంకింగ్‌ రంగానికి సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ హెచ్చరించింది. గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బారిన పడిన తర్వాత నుంచి ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో... ఈ రంగానికి ఉపశమనం కల్పించే పలు నిర్ణయాలను ఆర్‌బీఐ ఎంపీసీ ఈ నెల మొదటి వారంలో ప్రకటించింది. ఇందులో బ్యాంకుల టైర్‌1 మూలధనంలో 15 శాతం వరకు ఒక ఎన్‌బీఎఫ్‌సీ సంస్థకు నిధులు సమకూర్చవచ్చన్న పరిమితిని 20 శాతానికి పెంచింది. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలకు ఎన్‌బీఎఫ్‌సీ ఇచ్చే రుణాలను ప్రాధాన్యం రంగ రుణాలుగా పరిగణించడం, కన్జ్యూమర్‌ రుణాల రిస్క్‌ వెయిటేజీని 125 శాతం నుంచి 100 శాతానికి తగ్గించడం జరిగింది. మందగమన సంకేతాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి రుణ వితరణ పెరిగేలా చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఫిచ్‌ అభివర్ణించింది. అయితే, ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్‌ రిస్కును అంగీకరించాల్సి వస్తుందని ఫిచ్‌ తెలిపింది. అంతర్జాతీయంగా ఎన్‌బీఎఫ్‌సీలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానతకు చెక్‌ పెట్టాలన్న ప్రయత్నాలకు, భారత్‌లో తాజా చర్యలు వైరుధ్యంగా ఉన్నట్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలు బ్యాంకులకు కూడా పాకుతాయని హెచ్చరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top