మెట్రో రియల్టీ పట్టాలపైకి!

Metro train specialties - Sakshi

భాగ్యనగరం నలువైపులా అందుబాటు గృహాలకు డిమాండ్‌

సౌకర్యం, కనెక్టివిటీ.. ఇవే మెట్రో రైలు ప్రత్యేకతలు. రియల్టీ పట్టాలెక్కేందుకూ కావాల్సినవివే. అంటే ప్రయాణ సౌకర్యం, అందుబాటు ధర ఉన్న ప్రాంతాల్లోని గృహాలకే డిమాండ్‌ ఉంటుందని దీనర్థం. మెట్రో కారణంగా నాగార్జున్‌సాగర్, విజయవాడ, వరంగల్, కరీంనగర్, మేడ్చల్‌ రోడ్లలోని అందుబాటు గృహాలకు డిమాండ్‌ పెరుగుతుంది. అదేంటి? మెట్రో ప్రారంభమైంది మియాపూర్‌– నాగోల్‌ మార్గం కదా! మరి, ఈ రోడ్లలోని గృహాలకు లింకేంటి అనుకుంటున్నారా? ఓసారి చూద్దాం!

సాక్షి, హైదరాబాద్‌: నగర స్థిరాస్తి రంగాన్ని మెట్రోకు ముందు, మెట్రోకు తర్వాత అని విభజించే రోజులొచ్చేశాయి. మెట్రోకు ముందు గురించి మాట్లాడితే.. 95 శాతం ఉద్యోగ అవకాశాలు, వృద్ధి కేవలం పశ్చిమ ప్రాంతంగానే జరిగేవి. దీంతో ఇన్నాళ్లూ ఆయా ప్రాంతాల్లో ఖరీదైనా సరే ఇల్లు కొనేందుకే కస్టమర్లు ఆసక్తి చూపించారు. కానీ, ఇప్పుడు మెట్రో తర్వాత గురించి మాట్లాడితే.. మెట్రోతో తూర్పు, పశ్చిమ ప్రాంతాలు అనుసంధానమయ్యాయి.   దీంతో ఎక్కువ ధర పెట్టి పశ్చిమంలో కొనే బదులు తక్కువ ధరతో ఇతర ప్రాంతాల్లో అందుబాటు గృహాలను కొనుగోలు చేసి హ్యాపీగా మెట్రోలో ప్రయాణించేస్తారు. మొత్తమ్మీద మెట్రో పరుగులతో హైదరాబాద్‌ నలువైపులా అందుబాటు గృహాలకు డిమాండ్‌ పెరుగుతుందన్నమాట. అదీ మ్యాటర్‌!

అందుబాటు గృహాలకు డిమాండ్‌..
రియల్టీ అమ్మకాలకు ప్రధాన వనరులు ఐటీ ఉద్యోగులే. కానీ, నగరంలో 60 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు రూ.40 వేల లోపు వేతనాల వాళ్లే. వీరందరూ ఐటీ హబ్‌లకు చేరువలో నివాసాలను కొనుగోలు చేయలేరు. దీంతో ఇన్నాళ్లూ ఆయా ప్రాంతాల్లో అద్దెలకు ఉండటమో లేక శివారు ప్రాంతాల్లో తక్కువ ధరల్లో ఇళ్లను కొనుగోలు చేసి రోజూ ఎంఎంటీఎస్, బస్సు, క్యాబ్స్‌లో ప్రయాణించేవాళ్లు.

కానీ, ఇప్పుడు మెట్రోతో ఐటీ హబ్‌ కనెక్టివిటీ పెరిగింది. దీంతో పశ్చిమ ప్రాంతాల్లో అద్దెకుండటం బదులు ఇతర ప్రాంతాల్లో ఇల్లు కొనేందుకు ముందుకొస్తారని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) తెలంగాణ ప్రెసిడెంట్, ఏఆర్కే ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ సీఎండీ గుమ్మి రాంరెడ్డి చెప్పారు. మెట్రో కారిడార్లే కాకుండా స్టేషన్‌ నుంచి 3–5 కి.మీ. దూరంలోని నివాసాలకూ డిమాండ్‌ ఉంటుందన్నారు. ఉదాహరణకు కూకట్‌పల్లి మెట్రో వద్ద చ.అ.కు రూ.4,500లుగా ఉంది. అదే 3 కి.మీ. దూరంలో ఉన్న గాజులరామారంలో చ.అ.కు రూ.3,500 వరకుంది. అంటే కొంత దూరమైన అందుబాటు ధరల్లో అది కూడా ప్రీమియం గృహాలను కొనుగోలు చేసే వీలుంటుంది.

మెట్రో కారిడార్లలో 15 శాతం ధరలెక్కువ..
మెట్రో ఉన్న ప్రాంతాలకు, లేని ప్రాంతాలకు మధ్య ధరల్లో 15 శాత తేడా ఉంటుందన్నాని తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీబీఎఫ్‌) జనరల్‌ సెక్రటరీ, ఏవీ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ జక్కా వెంకట్‌ రెడ్డి చెప్పారు. మెట్రోతో నివాసాలకే కాకుండా వాణిజ్య, ఆఫీసు సముదాయాలకూ గిరాకీ ఉంటుంది. ఆయా కారిడార్లలోని చిన్న షాపింగ్‌ మాల్స్‌కు స్కైవాల్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నేరుగా మెట్రో నుంచి షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లే వీలుంటుంది.

పశ్చిమంలో ఫ్లాట్ల విస్తీర్ణాలు తగ్గుతాయ్‌..
ఇన్నాళ్లూ పశ్చిమ ప్రాంతాల్లో ఫ్లాట్లంటే ప్రీమియం. ఇక్కడ 3 బీహెచ్‌కే ఫ్లాటంటే 1,800 చ.అ. నుంచి మొదలవుతుంది. ఇతర ప్రాంతాల్లో అయితే 1,200 చ.అ. నుంచి ఉంటుంది. విస్తీర్ణం పెరిగినా కొద్ది ధర కూడా పెరుగుతుంది.

కానీ, మెట్రోకు ముందు కస్టమర్లు, అమ్మకాలూ ఉండేవి కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మించేందుకు డెవలపర్లు ముందుకొచ్చారు. కానీ, మెట్రో తర్వాత పెద్ద విస్తీర్ణంలోని ఫ్లాట్ల అమ్మకాలపై ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఖరీదైన ఫ్లాట్లను కొనుగోలు చేసే బదులు ఇదే ధరకు ఇతర ప్రాంతాల్లో ఇండిపెండెంట్‌ గృహాలొస్తాయి. పైగా మెట్రోతో కనెక్టివిటీ సులువనుకునే కస్టమర్లుంటారు. అందుకే ఇక పశ్చిమ ప్రాంతాల్లోని డెవలపర్లు ఫ్లాట్ల విస్తీర్ణాలను తగ్గించేసి.. కొనుగోలుదారులను ఆకర్షించే ప్రాజెక్ట్‌లపై దృష్టిసారిస్తారు.

నో మెట్రో మాల్స్‌..
ప్రస్తుతం మెట్రో పరుగులు పెడుతున్న మియాపూర్‌– నాగోల్‌ మార్గంలో ఒక్క మెట్రో మాల్‌ కూడా లేదు. వాస్తవానికి గతంలో ఎల్‌అండ్‌టీ నగరంలో మొత్తం 18 మాల్స్‌లను నిర్మించాలని నిర్ణయించింది. కానీ, కొన్ని కారణాల వల్ల వీటి సంఖ్యను 4కు తగ్గించేసింది. 16 లక్షల చ.అ.ల్లో పంజగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ, మూసారంబాగ్‌ ప్రాంతాల్లో ఈ మాల్స్‌ రానున్నాయి.

డిసెంబర్‌ నాటికి పంజగుట్ట, హైటెక్‌సిటీ మాల్స్‌ అందుబాటులోకి వస్తాయని.. ఒక్కో మాల్‌ 4 లక్షల చ.అ.ల్లో విస్తరించి ఉంటుందని మెట్రో అధికారి ఒకరు తెలిపారు. మియాపూర్‌– నాగోల్‌ మార్గంలో 18 మిలియన్‌ చ.అ. వాణిజ్య స్థలాన్ని అభివృద్ధి చేశారు. ప్రతి స్టేషన్‌లో 2,500 నుంచి 9 వేల చ.అ. వరకు రిటైల్‌ స్పేస్‌ను అందుబాటులో ఉంచారు.

నిర్మాణ నిబంధనలు మార్చాలి
మెట్రో కారిడార్లలో స్థలాల కొరత ఉంది. పోనీ, అందుబాటులో ఉన్న స్థలాల్లో అయినా ఎత్తయిన ఆకాశహర్మ్యాలను నిర్మింద్దామంటే నిర్మాణ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం టాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్‌ (టీఓడీ)ని దృష్టిలో పెట్టుకొని భవన నిర్మాణ నిబంధనలను మార్చాలని అవసరముంది.

అంటే ఆయా కారిడార్లలో రోడ్ల వెడల్పుతో సంబంధం లేకుండా సెట్‌బ్యాక్స్‌ ఉంటే చాలు హైరైజ్‌ బిల్డింగ్‌లకు అనుమతులివ్వాలి. దీంతో అందుబాటు ధరల్లో ఎక్కువ మందికి గృహాలను అందించే వీలుంటుంది. అలాగే కారిడార్లలోని చిన్న చిన్న అపార్ట్‌మెంట్లను విలీనమై భారీ భవంతులను నిర్మించే వీలు కల్పిస్తే ఆయా భవంతుల్లో పార్కింగ్‌ ఏర్పాటుతో సమస్య కూడా తీరుతుంది. ఇందుకోసం పీపీపీ విధానంలో పార్కింగ్‌ పాలసీను తీసుకురావాల్సిన అవసరముంది. – భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్‌ రెడ్డి
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top