మ్యాక్స్‌క్యూర్‌.. ఇక మెడికవర్‌ హాస్పిటల్స్‌!!

Maxcure rebrands as Medicove - Sakshi

వాటా పెంచుకున్న స్వీడన్‌ కంపెనీ

కొత్తగా మరో మూడు ఆసుపత్రులు

మెడికవర్‌ ఎండీ అనిల్‌ కృష్ణ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌ పేరు మారింది. ఇక నుంచి మెడికవర్‌ హాస్పిటల్స్‌గా పిలుస్తారు. మ్యాక్స్‌క్యూర్‌ను ప్రమోట్‌ చేస్తున్న సహృదయ హెల్త్‌కేర్‌లో స్వీడన్‌కు చెందిన మెడికవర్‌కు ఇప్పటి వరకు 46.5 శాతం వాటా ఉంది. నవంబరు నాటికి ఇది 51 శాతానికి చేరనుంది. హెల్త్‌కేర్, డయాగ్నోస్టిక్స్‌ సేవలతో అంతర్జాతీయంగా విస్తరించిన మెడికవర్‌.. తాజా డీల్‌తో భారత ఆరోగ్య సేవల రంగంలో ప్రవేశించినట్టయింది. సహృదయలో మెడికవర్‌ ఇప్పటికే రూ.270 కోట్లు పెట్టుబడి పెట్టింది. మిగిలిన 4.5 శాతం వాటా కోసం మరో రూ.50 కోట్ల దాకా ఇన్వెస్ట్‌ చేస్తోంది. సహృదయ హెల్త్‌కేర్‌ బోర్డులోకి మెడికవర్‌ చేరినప్పటికీ, రోజువారీ కార్యకలాపాల్లో ఎటువంటి జోక్యం ఉండబోదని కంపెనీ వర్గాలు తెలిపాయి. భారత్‌లో పెద్ద ఎత్తున విస్తరించాలన్న లక్ష్యంతో ఉన్న ఈ యూరప్‌ సంస్థ రానున్న రోజుల్లో సహృదయ హెల్త్‌కేర్‌లో వ్యూహాత్మక భాగస్వామిగా మరింత వాటా పెంచుకోనుంది.  

కొత్తగా ఆసుపత్రులు..
మ్యాక్స్‌క్యూర్‌ను ప్రముఖ వైద్యుడు అనిల్‌ కృష్ణ స్థాపించారు. హైదరాబాద్‌లో మూడు, వైజాగ్‌లో రెండు, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, నెల్లూరు, కర్నూలు, మహారాష్ట్రలోని నాసిక్‌లో ఒక్కో ఆసుపత్రి ఉంది. వీటన్నిటి పడకల సామర్థ్యం 2,000 దాకా ఉంది. కొత్తగా భాగ్యనగరిలో రెండు, ముంబైలో ఒక హాస్పిటల్‌ ఈ ఏడాది నవంబరుకల్లా సిద్ధమవుతున్నాయి. వీటి రాకతో 700 పడకలు జతకూడనున్నాయని మెడికవర్‌ ఇండియా ఎండీ అనిల్‌ కృష్ణ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వెల్లడించారు. ‘సంస్థలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాం. ఇప్పటికే 6,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి ఆసుపత్రి ద్వారా 600 నుంచి 1.000 మందికి ఉపాధి లభించనుంది’ అని వివరించారు. డీల్‌ తదనంతరం అనిల్‌ కృష్ణ వాటా 33 శాతం, వైద్యులైన ఇతర ఇన్వెస్టర్ల వాటా 16%గా ఉంటుంది.
మెడికవర్‌ ఇండియా ఎండీ అనిల్‌ కృష్ణ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top