ద్రవ్యోల్బణ గణాంకాలతో లాభాలు

Markets recover from slump as Sensex, Nifty rise - Sakshi

కోలుకున్న టర్కీ కరెన్సీ లిరా

జోష్‌నిచ్చిన ద్రవ్యోల్బణ గణాంకాలు

రూపాయి పతనంతో ఐటీ షేర్ల జోరు

207 పాయింట్ల లాభంతో 37,852కు సెన్సెక్స్‌

79 పాయింట్లు పెరిగి 11,435కు నిఫ్టీ  

ద్రవ్యోల్బణ గణాంకాలు జోష్‌నివ్వడంతో రెండు రోజుల నష్టాల నుంచి మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ కోలుకుంది. డాలర్‌తో టర్కీ కరెన్సీ లిరా మారకం రికవరీ కావడం కూడా కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా ఎగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 11,400 పాయింట్లపైకి ఎగబాకింది. ఆర్థిక, ఫార్మా, ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్‌ 207 పాయింట్లు లాభపడి 37,852 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 79 పాయింట్లు పెరిగి 11,435 పాయింట్ల వద్ద ముగిశాయి.  

టర్కీ లిరా రికవరీ: ఆరంభంలో జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోయిన టర్కీ కరెన్సీ, లిరా, ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ జోక్యంతో ఒకింత కోలుకుంది. దీంతో టర్కీ సంక్షోభ ప్రభావం ఒకింత తగ్గి ప్రపంచ మార్కెట్లు పుంజుకున్నాయి. జూలై నెల ద్రవ్యల్బోణ గణాంకాలు ఇన్వెస్టర్లలో జోష్‌ను నింపాయి. సోమవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడగా, మంగళవారం మధ్యాహ్నం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వచ్చాయి.

రిటైల్‌ ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల కనిష్ట స్థాయి, 4.17 శాతానికి పడిపోగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 5.09 శాతానికి తగ్గింది. జోరుగా కొనసాగుతున్న దేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, కొన్ని బ్లూ చిప్‌ కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మరింత బలాన్నిచ్చాయి. అసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభమయ్యాయి.

ఐపీఓకు బెక్టర్స్‌ ఫుడ్‌ స్పెషాల్టీస్‌
బిస్కెట్లు తయారు చేసే మెస్సర్స్‌  బెక్టర్స్‌ ఫుడ్‌ స్పెషాల్టీస్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తోంది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ సైజు రూ.800 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ కంపెనీ ఇంగ్లిష్‌ ఓవెన్, మెస్సర్స్‌ బెక్టర్స్‌ క్రిమిక బ్రాండ్ల కింద బిస్కెట్లు, బ్రెడ్, బన్‌లను విక్రయిస్తోంది.  ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ వ్యవహరిస్తాయి.   

నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బులియన్, లోహ, అన్ని టోకు ధరల కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top