మార్కెట్లకు ఆర్‌బీఐ నిర్ణయం నచ్చింది!

Markets like RBI decision

అంచనాలకు తగ్గట్టే కేంద్ర బ్యాంకు నిర్ణయం

వరుసగా నాలుగోరోజు  లాభాల్లోనే ముగింపు

అంతర్జాతీయ సానుకూలతలు, దేశీయ కొనుగోళ్లు  9,900పైన నిఫ్టీ క్లోజ్‌

ముంబై: కీలకమైన వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోగా, దీనికి స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఆర్‌బీఐ యథాతథ స్థితినే కొనసాగిస్తుందని మార్కెట్లు ముందుగానే అంచనా వేశాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలకు తోడు, దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల (డీఐఐ) కొనుగోళ్ల తోడ్పాటుతో ప్రధాన సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఆర్‌బీఐ నిర్ణయం అంచనాలకు తగ్గట్టుగానే ఉండడంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు ర్యాలీ చేశాయి. ఒకవైపు విదేశీ ఇన్వెస్టర్లు రూ.632 కోట్ల మేర అమ్మకాలు చేయగా, అదే సమయంలో దేశీయ ఇన్వెస్టర్లు రూ.585 కోట్ల మేర కొనుగోళ్లు చేయడం సూచీల ర్యాలీకి దోహదపడింది. రూపాయి బలపడి 65 స్థాయిని దిగిరావడం కూడా బూస్ట్‌నిచ్చింది. ఎఫ్‌ఐఐలు ఆగస్ట్‌ నుంచి నిత్యం అమ్మకాలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌ మినహా ఆర్‌బీఐ పాలసీలో కొత్తదనం ఏదీ లేదు. అలాగే, జీవీఏ అంచనాలను తగ్గించడం, ద్రవ్యోల్బణం అంచనాలను పెంచడం చేసినప్పటికీ ఈ సారి అంత కఠినంగా ఆర్‌బీఐ వ్యాఖ్యలు లేవు. దీంతో ఈ ఏడాది చివర్లో మరోసారి రేట్లకోతకు అవకాశాలు ఉన్నట్టే’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌కు చెందిన వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. మార్కెట్లు ఆర్‌బీఐ విధానం పట్ల పెద్దగా స్పందించలేదని, కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాల సీజన్, లిక్విడిటీ ప్రభావితం చూపించాయన్నారు. ఎనిమిది ప్రధాన రంగాలు ఆగస్ట్‌లో 4.9 శాతం వృద్ధి చెందడం కూడా సానుకూలించినట్టు చెప్పారు.

ఫార్మా స్టాక్స్‌ అప్‌
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 174 పాయింట్ల లాభంతో 31,671.77 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ 55 పాయింట్లు పెరిగి కీలకమైన 9,900కు పైన 9,914.90 వద్ద క్లోజయింది. సెన్సెక్స్‌లోని సన్‌ఫార్మా 3 శాతం, ఆర్‌ఐఎల్, ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్, ఎంఅండ్‌ఎం లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్‌ 2 శాతానికి పైగా నష్టపోయింది. మరోవైపు ఆసియా మార్కెట్లో చాలా వరకు లాభాల్లోనే ముగిశాయి. యూరోప్‌ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. నాట్కో ఫార్మా ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ తుది అనుమతి జారీ చేయడంతో ఈ షేరు 20 శాతం పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌ తాకింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top