మళ్లీ రికార్డ్‌ల మోత

Markets End At All-Time Closing Highs - Sakshi

ఫెడ్‌ చైర్మన్‌ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లలో లాభాలు

వ్యాల్యూయేషన్లు అధికంగా ఉన్నా కొనసాగిన కొనుగోళ్లు

కలసివచ్చిన రూపాయి రికవరీ

ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లకు స్టాక్‌ సూచీలు

ఈ నెలలో 9వ సారి కొత్త రికార్డ్‌లు

సెన్సెక్స్‌లో నష్టపోయిన షేర్‌ ఒక్కటే

సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో స్టాక్‌ సూచీలు సోమవారం చెలరేగిపోయాయి. వరుసగా ఐదో వారమూ లాభాల జైత్రయాత్ర మొదలుపెట్టిన స్టాక్‌ సూచీలు... ఐదు ట్రేడింగ్‌ సెషన్ల విరామం తర్వాత మళ్లీ కొత్త గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. నిఫ్టీ ఒక దశలో 11,700 పాయింట్ల పైకి ఎగబాకింది. వడ్డీరేట్ల విషయంలో మరీ దూకుడుగా కాకుండా ఆచి, తూచి నిర్ణయాలు తీసుకుంటామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చీఫ్‌ జెరోమి పావెల్‌ వెల్లడించారు.

ఈ సానుకూల ప్రకటనకు కరెన్సీ విషయంలో చైనా నిర్ణయం కూడా తోడవడంతో ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం కలసివచ్చింది. స్టాక్‌ సూచీలు  ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ మళ్లీ కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. స్టాక్‌ సూచీలు కొత్త రికార్డ్‌లు సృష్టించడం ఈ నెలలో ఇది తొమ్మిదోసారి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 442 పాయింట్లు పెరిగి 38,694 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 11,692 పాయింట్ల వద్ద ముగిశాయి.

ఐదు నెలల తర్వాత ఈ సూచీలు ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు లాభపడటం ఇదే మొదటిసారి. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,737, నిఫ్టీ 11,701 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఒక్క రియల్టీ మినహా, అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. బ్యాంక్, ఆర్థిక, విద్యుత్తు, ప్రభుత్వ రంగ షేర్లు మంచి లాభాలు సాధించాయి. మొత్తం 31 సెన్సెక్స్‌ షేర్లలో సన్‌ ఫార్మా షేర్‌ మాత్రమే నష్టపోవడం విశేషం.

వేల్యుయేషన్లు అధికంగా ఉన్నా....
రేట్ల విషయంలో అమెరికా ఫెడ్‌ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు పెరిగాయని, ఈ ప్రభావంతో మన మార్కెట్‌ కూడా దూసుకుపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో అన్ని రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. వేల్యుయేషన్లు అధికంగా ఉన్నా, విదేశీ, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు కొనసాగించారని వివరించారు. అయితే మరో మూడు రోజుల్లో ఈ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనున్నందున మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు  నిఫ్టీ 11,600 పాయింట్లపైన నిలదొక్కుకుంటే 11,800–12,000  రేంజ్‌కు చేరుతుందని నిపుణులంటున్నారు.

రోజంతా లాభాలే...: లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు చూపించింది. ఒక్కొక్క గంట గడుస్తున్న కొద్దీ, లాభాల జోరు మరింతగా పెరుగుతూనేపోయింది. ఇంట్రాడేలో 485 పాయింట్ల లాభంతో 38,737 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది.  ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 144 పాయింట్ల లాభంతో 11,701 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది.  విద్యుత్‌ రంగ కంపెనీల బ్యాంక్‌ బకాయిల విషయమై కీలకమైన అలహాబాద్‌ కోర్ట్‌ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

మరిన్ని వివరాలు...
నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌ 2.6% లాభంతో రూ.378 వద్ద ముగిసింది.
 గత వారం మంచి లాభాలు సాధించిన సన్‌ ఫార్మా 1.2% నష్టంతో రూ.621 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 షేర్లలో 3 షేర్లు.. డాక్టర్‌ రెడ్డీస్, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌లు నష్టాల్లో ముగిశాయి.
 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1 శాతం లాభంతో రూ.1,292 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ రూ.1,296 వద్ద ఆల్‌ టైమ్‌ హైను తాకింది.
 1:1 బోనస్‌ షేర్ల జారీకి రికార్డ్‌ డేట్‌ను వచ్చే నెల 5గా ఇన్ఫోసిస్‌ నిర్ణయించింది. దీంతో ఈ షేర్‌ 2.5% లాభంతో రూ.1,415 వద్ద ముగిసింది.

లాభాలు ఎందుకంటే...
పావెల్‌ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లో జోష్‌
దశల వారీగానే వడ్డీరేట్లను పెంచుతామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమి పావెల్‌ గత శుక్రవారం పేర్కొన్నారు.  దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాలను సాధించింది. ఈ జోష్‌తో సోమవారం ఆసియా మార్కెట్లు లాభాల్లో ఆరంభమయ్యాయి. కరెన్సీ విషయంలో చైనా కేంద్ర బ్యాంక్‌  నిర్ణయం ఆసియా మార్కెట్ల లాభాలకు తోడైంది.  యూరప్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. మెక్సికోతో వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ట్రంప్‌ ప్రకటించడంతో అమెరికా మార్కెట్లు దూసు కెళ్లాయి. సోమవారం ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌లు మరో కొత్త ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని తాకాయి.

మళ్లీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు...
ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్యలో మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.60,000 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు గత రెండు నెలల నుంచి మళ్లీ  పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ మన స్టాక్స్‌లో రూ.2,000 కోట్లు కుమ్మరించారు. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు.
రూపాయి రికవరీ...: సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాలతో  రూపాయి ఇంట్రాడేలో 20 పైసలు బలపడింది. చివరికి 25 పైసలు నష్టంతో 70.16 వద్ద ఆల్‌టైమ్‌ కనిష్టస్థాయిలో ముగిసింది.

టెక్నికల్‌ అంశాలు...: నిఫ్టీ గత వారంలో కీలకమైన 11,500, 11,600 పాయింట్లపైన నిలదొక్కుకోలిగింది. దీంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి.

హెవీ వెయిట్స్‌ లాభాలు...
ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, ఐటీసీలు 2.6% నుంచి 1% రేంజ్‌లో పెరిగాయి. ఈ ఐదు షేర్లు మొత్తం 233 పాయింట్ల మేర సెన్సెక్స్‌ను పెంచాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top