మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ

 Market stages relief rally; bank, auto stocks jump - Sakshi

కోలుకున్న రూపాయి  

దిగివచ్చిన చమురు ధరలు  

వేల్యూ బయింగ్‌కు తోడైన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు 

10,400 పాయింట్ల పైకి నిఫ్టీ \

159 పాయింట్ల లాభంతో 10,460 వద్ద ముగింపు  

461 పాయింట్లు పెరిగి  34,761కు సెన్సెక్స్‌

జీవిత కాల కనిష్ట స్థాయిల నుంచి రూపాయి కోలుకోవడం, బ్యాంక్, వాహన, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో వేల్యూ బయింగ్‌ జరగడంతో గురువారం స్టాక్‌ మార్కెట్లో రిలీఫ్‌ ర్యాలీ చోటు చేసుకుంది.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,400 పాయింట్ల పైకి దూసుకుపోయింది. నిధుల కటకటతో కునారిల్లుతున్న ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులను రూ.45,000 కోట్ల మేర కొనుగోలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. ముడి చమురు ధరలు దిగిరావడం సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 461 పాయింట్ల లాభంతో 34,761 పాయింట్ల వద్ద, నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 10,460 పాయింట్ల వద్ద ముగిశాయి. వాహన, బ్యాంక్, మౌలిక, లోహ, ఫార్మా రంగ షేర్లు పెరిగాయి.  

ఆర్థిక ఫలితాలపైనే అందరి కళ్లూ... 
సెన్సెక్స్‌ గ్యాపప్‌ ఓపెనింగ్‌తో మొదలైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 559 పాయింట్ల లాభంతో 34,858 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 181 పాయింట్లు పెరిగింది.  గత కొన్ని రోజులుగా బాం డ్ల రాబడులు తగ్గుతుండటం, రూపాయి పటిష్టమైన రికవరీ కూడా రిలీఫ్‌ ర్యాలీకి దోహదపడ్డాయ ని నిపుణులంటున్నారు. డాలర్‌ తగ్గడం వంటి కార ణాల వల్ల ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయని, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఈ రిలీఫ్‌  ర్యాలీ మరింతగా కొనసాగుతుందని వారంటున్నారు. ఇక ఇప్పుడు అందరి కళ్లూ కంపెనీల ఆర్థిక ఫలితాలపై నే ఉన్నాయని, ఈక్విటీ మార్కెట్‌కు ఒకింత ఊరట లభించనున్నదని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సునీల్‌ శర్మ పేర్కొన్నారు.

మరిన్ని వివరాలు.. 
ఇటీవల కాలంలో బాగా నష్టపోయిన ఎన్‌బీఎఫ్‌సీలు మంచి లాభాలు సాధించాయి. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 16 శాతం, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌13 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 10 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 10 శాతం చొప్పున లాభపడ్డాయి.  విమానయాన ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకం తగ్గే అవకాశాలున్నాయన్న వార్తలతో విమానయాన రంగ షేర్లు–జెట్‌ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, ఇండిగో షేర్లు 8 శాతం వరకూ పెరిగాయి.  యాక్సిస్‌ బ్యాంక్‌ 6.6 శాతం లాభంతో రూ. 589 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  మొత్తం 31 సెన్సెక్స్‌ షేర్లలో ఐదు షేర్లు–ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్‌ ఫార్మా, విప్రో, కోల్‌ ఇండియాలు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక 50 నిఫ్టీ షేర్లలో 42 లాభాల్లో ముగియగా, 8 నష్టపోయాయి.   త్వరలో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించనున్నదన్న వార్తల కారణంగా నాల్కో షేర్‌ 9 శాతం ఎగసి రూ.66.70 వద్ద ముగిసింది.

ప్రపంచ మార్కెట్ల పతనం
ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. యూరప్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియగా, అమెరికా మార్కెట్‌ కూడా భారీ నష్టాల్లోనే ట్రేడవుతోంది. అంతర్జాతీయ వృద్ధిపై ఐఎమ్‌ఎఫ్‌ నిరాశపూరిత అంచనాలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు, అమెరికా బాండ్ల రాబడులు పెరుగుతుండటం ప్రపంచ మార్కెట్లను పతన బాట పట్టించాయి. బడ్జెట్‌ విషయమై ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గబోమని ఇటలీ తెగేసి చెప్పడం తీవ్ర ప్రభావమే చూపింది. బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ 1%, జర్మనీ, ఫ్రాన్స్‌ సూచీలు చెరో 2% చొప్పున కుదేలయ్యాయి. ఈ వార్త రాసే సమయానికి(రాత్రి. 11.గం.లకు)ఇక అమెరికా స్టాక్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డోజోన్స్‌ 400 పాయింట్లు, నాస్‌డాక్‌ 146 పాయింట్లు, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 43 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ ప్రభావంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 115 పాయింట్ల నష్టంతో 10,366 వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రతికూలతలతో నేడు(గురువారం) ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఆరంభమవుతాయని, మన మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాల ఉన్నాయని నిపుణులంటున్నారు. బాండ్ల రాబడులు పెరిగితే ఆ మేరకు కంపెనీలకు వడ్డీ వ్యయాలు అధికమవుతాయని, ఫెడ్‌ రేట్ల పెంపు వల్ల ఈక్విటీల నుంచి పెట్టుబడులు తరలిపోతాయనే భయాలతో స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోతోంది.

లాభాలు ఎందుకంటే 
1.    గత కొన్ని రోజులుగా పతనమవుతూ వస్తున్న డాలర్‌తో రూపాయి మారకం గురువారం కోలుకుంది. ఇంట్రాడేలో 34 పైసలు బలపడి 74.05ను తాకడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది.  
2.    ఇటీవల బాగా పతనమైన మారుతీ సుజుకీ, టాటా స్టీల్, యస్‌ బ్యాంక్, ఎస్‌బీఐ తదితర షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకుంది.  
3.    ఇటీవల నాలుగేళ్ల గరిష్ట స్థాయిలకు ఎగసిన ముడి చమురు ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ వృద్ధిని ఐఎమ్‌ఎఫ్‌ తగ్గించడం, ఫ్లోరిడాలో తుపాన్‌ నేపథ్యంలో చమురు ధరలు పడిపోయాయి.  
4.    నేడు (గురువారం)ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల ద్వారా రూ.12,000 కోట్ల నిధులను వ్యవస్థలోకి ఆర్‌బీఐ విడుదల చేయనున్నదన్న వార్తలూ సానుకూల ప్రభావం చూపించాయి. మరోవైపు నిధుల లేమితో కునారిల్లుతున్న ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులను రూ.45,000 కోట్ల మేర కొనుగోలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించడం కొంత ఊరటనిచ్చింది.  
5.    రూపాయి రికవరీ కావడం, ముడి చమురు ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటం... ఈ నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరిగాయి.  
6.    వాహన బీమాకు సంబంధించి కొంత వెసులుబాటును బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్‌డీఏఐ ఇవ్వనున్నదన్న వార్తల కారణంగా వాహన షేర్లు లాభాల రోడ్డుపై పరుగులు పెట్టాయి. టీవీఎస్‌ మోటార్‌ 6.8 శాతం, ఐషర్‌ మోటార్స్‌ 6.4 శాతం, మారుతీ సుజుకీ ఇండియా 4.7 శాతం, టాటా మోటార్స్‌ 2.7 శాతం, బజాజ్‌ ఆటో 1.2 శాతం, హీరో మోటొకార్ప్‌ 1 శాతం చొప్పున పెరిగాయి.  
7.    బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు జోరుగా పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఎస్‌బీఐ, యస్‌బ్యాంక్‌లు 4–1  శాతం వరకూ పెరిగాయి.

రూ.3 లక్షల కోట్లు  పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
సెన్సెక్స్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3,08,467 కోట్లు పెరిగి  రూ.1,38,39,750 కోట్లకు ఎగసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top