నిపుణుల కొరత.. తీవ్రం!

Manpowergroup Survey on expert shortage - Sakshi

12 ఏళ్లలో ఇప్పుడే ఎక్కువ  

మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ సర్వేలో వెల్లడి   

న్యూఢిల్లీ: దేశంలో కరెన్సీ నోట్లకు మాత్రమే కటకట ఉందనుకుంటే పొరపాటే!! కానీ తాజా సర్వే చూస్తే నిపుణుల కొరత ఎంత తీవ్రంగా ఉందో తేటతెల్లమవుతోంది. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు.. నిపుణుల కొరతకు సంబంధించి గత 12 ఏళ్లలోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

నిపుణుల కొరత వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే టాప్‌–10 దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఇక్కడ 56 శాతం కంపెనీలు ఖాళీగా ఉన్న ఉద్యోగానికి వేరేవారిని తీసుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ నిర్వహించిన టాలెంట్‌ షార్టెజ్‌ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

అంతర్జాతీయంగా 40,000 కంపెనీలను సర్వే చేస్తే.. ఇందులో 45 శాతం సంస్థలు సిబ్బంది నియామకంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా నిపుణుల కొరత ఎక్కువగా ఉంది.

ఈ నేపథ్యంలో టాలెంట్‌ కోసం జల్లెడ పట్టడం కన్నా, టాలెంట్‌ ఉన్న వారికి తయారు చేయడానికి ప్రాధాన్యమివ్వాలి’ అని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ చైర్మన్, సీఈవో జోనస్‌ ప్రిజింగ్‌ తెలిపారు. మార్కెట్‌లోకి కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయని, అందువల్ల ఆర్గనైజేషన్లు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. దీని వల్ల అటు కంపెనీలు విజయవంతమవ్వడంతోపాటు, ఇటు ఉద్యోగులకు కూడా దీర్ఘకాల ఉద్యోగ భద్రత లభిస్తుందని పేర్కొన్నారు.  

కొరత జపాన్‌లో ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా చూస్తే నిపుణుల కొరత వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే దేశాల్లో జపాన్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 89 శాతం కంపెనీలు నియామక అంశంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. జపాన్‌ తర్వాతి స్థానంలో రొమేనియా (81%), తైవాన్‌(78%) నిలిచాయి.

హాంకాంగ్‌ (76%), బల్గేరియా(68%), టర్కీ(66%), గ్రీస్‌ (61%), సింగపూర్‌(56%), స్లోవేకియా(54%) వంటి దేశాలు టాప్‌–10లో ఉన్నాయి. ఇక అతితక్కువ ప్రభావితమయ్యే దేశాల్లో 13 శాతంతో చైనా టాప్‌లో ఉంది. దీని తర్వాతి స్థానంలో ఐర్లాండ్‌(18%), యూకే(19%), నెదర్లాండ్స్‌ (24%), స్పెయిన్‌(24%) ఉన్నాయి.  ఆసియా–పసిఫిక్‌ దేశాలు నిపుణుల కొరతతో ఎక్కువగా ప్రభావితమౌతున్నాయి. ఎందుకంటే జాబితాలో జపాన్, తైవాన్, హాంకాంగ్, సింగపూర్, ఇండియా వంటి దేశాలున్నాయి.  

సాఫ్ట్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం
కంపెనీలు డిజిటల్‌ బాటపట్టడం, పదవీ హోదాల్లో మార్పులు వంటి అంశాల నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యాలు, మానవ సామర్థ్యాలు సమపాళ్లలో కలిగిన అభ్యర్థుల ఎంపిక చాలా ప్రధానమైనదని సర్వే పేర్కొంది. అభ్యర్థుల లేమి, అనుభవం లేకపోవడం, హార్డ్‌ స్కిల్స్‌ లోపం వంటివి నిపుణుల కొరతకు ప్రధాన కారణమని తెలిపింది. ఇక కంపెనీలు అభ్యర్థుల్లో సాఫ్ట్‌ స్కిల్స్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న సగానికిపైగా కంపెనీలు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ బాగున్న అభ్యర్థులవైపు మొగ్గుచూపుతామని పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top