మళ్లీ వాణిజ్య యుద్ధభయాలు

Major stock market indices worldwide - Sakshi

పతన బాటలో ప్రపంచ మార్కెట్లు 

ఫలితాలపై ఆశావహ  అంచనాలతో ఆరంభంలో లాభాలు  

లాభాల స్వీకరణతో నష్టాలు  

చివరకు ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు  

26 పాయింట్ల లాభంతో  36,266కు సెన్సెక్స్‌ 

1 పాయింట్‌ పెరిగి 10,948కు నిఫ్టీ  

బలహీన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ ఫ్లాట్‌గా ముగిసింది. అమెరికా చైనాల మధ్య తాజాగా వాణిజ్య యుద్ధ భయాలు చెలరేగడంతో స్టాక్‌ సూచీలు అక్కడక్కడే ముగిశాయి. ఆరంభంలో స్టాక్‌ సూచీలు లాభపడినప్పటికీ, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా ఆ లాభాలను నిలుపుకోలేకపోయాయి. స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 26 పాయింట్ల లాభంతో 36,266 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1 పాయింట్‌ లాభంతో 10,948 పాయింట్ల వద్ద ముగిశాయి. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 691 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు కుదేలవడంతో లోహ షేర్లు నష్టపోయాయి.
 
193 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌.. 
20,000 కోట్ల డాలర్ల విలువైన చైనా వస్తువులపై సుంకాలు విధించే ఆలోచన ఉందని  తాజాగా అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా–చైనాల మధ్య పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం చోటు చేసుకునే అవకాశాలున్నాయన్న ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. అయితే ఫలితాలపై ఆశావహ అంచనాలతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో 123  పాయింట్ల లాభంతో 36,362 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. ఆల్‌టైమ్‌ క్లోజింగ్‌(36,283 పాయింట్లు)ను అధిగమించింది. అయితే వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియడం, యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఆరంభం కావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారిపోయింది.  70 పాయింట్ల నష్టంతో 36,170 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద రోజంతా 193 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 29 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 24 పాయింట్లు నష్టపోయింది. 

ఆల్‌టైమ్‌ హైకి టీసీఎస్‌...
క్యూ1 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో టీసీఎస్‌ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ. 1,995ను తాకింది. చివరకు 5.4 శాతం లాభంతో రూ.1,980 వద్ద ముగిసింది. తద్వారా ముగింపులో జీవిత కాల గరిష్ట స్థాయిను నమోదు చేసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. షేర్‌ జోరుతో మార్కెట్‌ క్యాప్‌ రూ.39,282 కోట్లు పెరిగి రూ.7,57,905 కోట్లకు చేరింది. మార్కెట్‌ క్యాప్‌ పరంగా అతి పెద్ద భారత కంపెనీ ఇదే.   

ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్ల జోరు.... 
స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులమయంగా సాగినప్పటికీ ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు దుమ్ము రేపాయి. నిఫ్టీ ఎఫ్‌ఎమ్‌సీజీ ఇండెక్స్‌ కొత్త గరిష్టాన్ని తాకింది. గత జూన్‌ క్వార్టర్‌లో లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణగా ఈ జూన్‌ క్వార్టర్‌లో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు మంచి ఫలితాలను వెల్లడిస్తాయన్న అంచనాలతో ఈ షేర్లు మంచి లాభాలు సాధిస్తున్నాయి. హిందుస్తాన్‌ యూనిలివర్, గోద్రేజ్‌ కన్సూమర్‌ ప్రొడక్ట్స్, జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ షేర్లు ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top