మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎంట్రీ

Mahindra launches XUV300 at starting price of Rs 7.90 lakh - Sakshi

చిన్న ఎస్‌యూవీల్లో మరింత జోరు..

పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో...ధరల శ్రేణి

రూ.7.9 లక్షలు–  రూ.8.49 లక్షలు

ముంబై: దేశీయ వాహన దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ300ను మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో లభించే ఈ ఎస్‌యూవీ ధరలు రూ.7.90 లక్షల నుంచి రూ.8.49 లక్షల రేంజ్‌లో ఉన్నట్లు మహీంద్రా తెలిపింది. శాంగ్‌యాంగ్‌ టివోలి ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ ఎస్‌యూవీ మూడు వేరియంట్లలో– డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8 పేరిట లభిస్తుంది. 4 మీటర్లలోపు ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే మారుతీ సుజుకీ విటారా బ్రెజాను, ఫోర్డ్‌ కంపెనీ ఈకో స్పోర్ట్‌ను, టాటా మోటార్స్‌ నెక్సాన్‌ను అందిస్తున్నా యి. వీటన్నింటికీ తమ ఎక్స్‌యూవీ300 గట్టిపోటీనివ్వగలదని మహీంద్రా వర్గాలు భావిస్తున్నాయి. ధరలు వెల్లడించక ముందే ఈ ఎస్‌యూవీకి 4,000కు పైగా బుకింగ్స్‌ రావడం విశేషం.  

రూ.1,000 కోట్లు పెట్టుబడి...: ఈ కొత్త ఎస్‌యూవీ అభివృద్ధి కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ ప్రెసిడెంట్‌ (ఆటోమోటివ్‌ సెక్టార్‌) రాజన్‌ వాధేరా చెప్పారు. ఎక్స్‌యూవీ500ను 2011లో మార్కెట్లోకి తెచ్చినప్పుడు మంచి స్పందన లభించిందని, ఇదే స్పందన ఈ ఎక్స్‌యూవీ300కు కూడా వస్తుందని ఆశిస్తున్నామని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చెప్పారు. కొరియా సాంకేతికతతో, భారత మార్కెట్‌కు అనుగుణంగా ఈ కొత్త ఎస్‌యూవీని రూపొందించామన్నారు. ‘‘ఇటీవల ప్రయాణికుల వాహన అమ్మకాలు తగ్గుతున్నాయి. ఈ కొత్త మోడల్‌తో అమ్మకాలు పుంజుకుంటాయనే ధీమా మాకుంది. నిజానికి ప్రయాణికుల వాహన విక్రయాలు తగ్గడానికి కొనుగోలుదారుల వద్ద డబ్బుల్లేకపోవడం కారణం కాదు. రకరకాల కారణాల వల్ల కొనుగోలు సెంటిమెంట్‌ దెబ్బతింది. చిన్న, తక్కువ ఖరీదు వాహనాల నుంచి కొంచెం ఖరీదు ఎక్కువగా ఉండే వాహనాలను కొనుగోలు చేయడానికి భారతీయులు మొగ్గు చూపుతున్నారు’’ అని ఆనంద్‌ మహీంద్రా వివరించారు. 

సగం వాటా మాదే... 
భారత కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్లో సగం వాటా తమదేనని కంపెనీ ఎమ్‌డీ, పవన్‌ గోయెంకా చెప్పారు. ఈ సెగ్మెంట్లో ఇటీవలే మరాజో, ఆల్ట్రస్‌ జీ4లను అందుబాటులోకి తెచ్చామని, వాటి అమ్మకాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.   

ఎక్స్‌యూవీ300 ప్రత్యేకతలు ఇవీ..
ఎక్స్‌యూవీ–300 ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో లభిస్తుంది. డీజిల్‌లో 1.5 లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను, పెట్రోల్‌లో 1.2 లీటర్‌ మూడు సిలిండర్ల టర్బో చార్జ్‌ ఇంజిన్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో డ్యుయల్‌ ఎయర్‌బ్యాగ్స్, ఏబీఎస్, అన్ని ఫోర్‌ వీల్స్‌కు డిస్క్‌ బ్రేక్‌లు, 6 గేర్లు, ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్, నాలుగూ పవర్‌ విండోలు వంటి ప్రత్యేకతలున్నాయి. డ్యుయల్‌ జోన్‌ ఫుల్లీ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్, ముందు వైపు పార్కింగ్‌ సెన్సర్లు, డ్యుయల్‌ ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ ల్యాంప్స్‌ వంటి ఫీచర్లు ఇంత వరకూ ఈ సెగ్మెంట్‌ ఎస్‌యూవీల్లో దేంట్లోనూ లేవని, తమ ఎస్‌యూవీలో ఉన్నాయని మహీంద్రా వర్గాలు వ్యాఖ్యానించాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top