బంగారు బాట ఎటు..?

Loss With Gold Coins And Jewellery Charges in investments - Sakshi

పెట్టుబడి కోసం అయితే భౌతిక బంగారం వద్దు

ఆభరణాలు, కాయిన్లపై చార్జీల రూపంలో ఎంతో నష్టం

అందుబాటులో ఎన్నో డిజిటల్‌ సాధనాలు వీటిలో పారదర్శకత ఎక్కువ

కోరుకున్నప్పుడు నగదు చేసుకునే సౌలభ్యం

కేంద్రం అందించే సార్వభౌమ బాండ్లు ఆకర్షణీయం

వీటిపై అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీ  

బంగారం గతంలో ఆభరణంగానే ప్రసిద్ధి పొందగా, నేడు ఓ పెట్టుబడి సాధనంగానూ ఎక్కువ డిమాండ్‌ సంతరించుకుంటోంది.ఇతర పెట్టుబడి సాధనాల్లో ఉండే రిస్క్‌నుఎదుర్కొనేందుకు గాను సురక్షిత సాధనంగా బంగారాన్ని అంతర్జాతీయంగా ఇన్‌స్టిట్యూషన్లతోపాటు, కేంద్ర బ్యాంకులూ దీనికి పెద్దపీట వేస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికీఆభరణాల రూపంలో బంగారానికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అయితే, ఇందులో నిజంగా ఆభరణాలను ధరించేందుకే వాటిని అందరూ కొనుగోలు చేస్తున్నారని భావించడం పొరపాటే అవుతుంది. దాన్నొక పెట్టుబడిగానూ భావించి ఆభరణాలను కొనేవారున్నారు. బంగారం కాయిన్లను కొనేవారు ఉన్నారు. అవసరంలో అక్కరకు వస్తుందన్న భావనతోనూ మిగులు నిధులు ఉన్నప్పుడు భౌతిక బంగారాన్నిఆశ్రయించే వారూ ఉన్నారు.

హైదరాబాద్‌కు చెందిన దంతవైద్యురాలు శశిరేఖ (35) కొన్నేళ్ల క్రితం వరకు బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్ల కొనుగోలుకే మొగ్గు చూపించేవారు. ఆమె దృష్టిలో అదొక పెట్టుబడి. కానీ, ఇటీవలి కాలంలో ఆమెలో మార్పు వచ్చింది. బంగారం ఆధారిత పెట్టుబడి సాధనాలవైపు ఆమె తన విధానాన్ని మార్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసేసార్వభౌమ బంగారం బాండ్లు తదితరవాటిల్లో ఆమె పెట్టుబడులు పెడుతూ,ఆభరణాలను, కాయిన్లను కొనడం ఆపేశారు. ‘‘బంగారం నాణ్యత, దాన్ని భద్రంగాదాచుకోవాలన్న ఆందోళన వీటి విషయంలోఉండదు’’ అన్నది ఆమె అభిప్రాయం. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం భారత్‌ వద్ద 24,000–25,000 టన్నుల బంగారం ఉంటుంది.  

భౌతికమా, డిజిటలా...?
బంగారాన్ని ఓ పెట్టుబడి సాధనంగా భావించే వారు ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ రూపంలోనే దాన్ని కొనుగోలు చేయాలన్నది నిపుణుల సూచన. ఎందుకంటే ధరల్లో ఎంతో పారదర్శకత ఉంటుంది. కావాలనుకున్నప్పుడు ఈ సాధనాలను విక్రయించి బంగారంగానూ మార్చుకోవచ్చంటున్నారు. పిల్లల వివాహం కోసం ముందు నుంచే బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారు, దీనికి బదులు బంగారంతో ముడిపడిన ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని, లక్ష్యానికి సమయం సమీపించినప్పుడు వాటిని విక్రయించి నగదుగా మార్చుకుని, బంగారం ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం సరైనదని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం బంగారాన్ని  అలంకరించుకోవాలనుకుంటేనే ఆభరణాల రూపంలో కొనుగోలు చేయాలని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమోడిటీస్‌ హెడ్, అసోసియేట్‌ డైరెక్టర్‌ కిషోర్‌ నార్నే సూచించారు.  ఈక్విటీ మార్కెట్లు సంక్షోభాలను ఎదుర్కొనే సమయాల్లో బంగారం పనితీరు మెరుగ్గా ఉండడాన్ని గమనించొచ్చు. ఆ సమయాల్లో ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియో విలువను కాపాడడంలో బంగారం పాత్ర కీలకం అవుతుంది. అందుకనే ఈక్విటీల్లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ఉన్న ప్రతీ ఇన్వెస్టర్‌ కొంత మేర హెడ్జింగ్‌ కోణంలో బంగారానికి కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. డాలర్‌ తదితర కరెన్సీలతో రూపాయి మారకం విలువ క్షీణత రిస్క్‌ను హెడ్జ్‌ చేసుకునే సాధనంగానూ బంగారం అక్కరకు వస్తుంది. ‘‘దూకుడుగా ఉండే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని ఏ మాత్రం ఉంచుకోకపోవచ్చు. ఇటువంటి వారు కరెన్సీ రిస్క్‌ను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. సంప్రదాయ ఇన్వెస్టర్లు మాత్రం బంగారానికి 10–15 శాతం మేర పెట్టుబడులను కేటాయించుకోవచ్చు’’ అని ఆర్థిక సలహాదారులు విశాల్‌ధావన్‌ సూచించారు. 

డిజిటల్‌ను ఆశ్రయిస్తే...
బంగారానికి సంబంధించి డిజిటల్‌ సాధనాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ డిజిటల్‌ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసే వారు అంతే పరిమాణంలో భౌతిక బంగారాన్ని ఆయా సంస్థలు నిల్వ చేస్తున్నాయా? అన్నది తప్పకుండా పరిశీలించుకోవాలి. ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), డిజిటల్‌ గోల్డ్‌ సాధనాల్లో భౌతిక రూపంలోనూ అంతే మొత్తంలో బంగారాన్ని స్టోర్‌ చేస్తారు. సార్వభౌమ బంగారం బాండ్లకు మాత్రం భౌతిక బంగారాన్ని నిల్వ చేయడం జరగదు. దీనికి కేంద్ర ప్రభుత్వమే హామీగా ఉంటుంది. ఇక ఆభరణాల సంస్థలు ఆఫర్‌ చేసే పథకాల్లో ఇన్వెస్టర్‌ చేసే వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ‘‘జ్యూయలర్‌ దివాలాతీస్తే మీకు తిరిగి ఇచ్చేందుకు కస్టోడియన్‌ వాల్టుల్లో ఎటువంటి బంగారం ఉండదు. రుణాలిచ్చిన ఇతర సంస్థల మాదిరిగా మీరు కూడా క్యూలో నించోక తప్పదు’’అని  ప్రపంచ స్వర్ణ మండలి భారత ఎండీ పీఆర్‌ సోమసుందరం హెచ్చరించారు. 

బంగారం కాయిన్లు
బంగారం కాయిన్ల ధర సహజంగా బంగారం ధర కంటే 6–7 శాతం ఎక్కువ ఉంటుంది. చాలా వరకు మార్కెట్లో విక్రయించే బంగారం కాయిన్లు హాల్‌ మార్క్‌ సర్టిఫికేషన్‌తో బ్రాండెడ్‌వే ఉంటున్నాయి. కొన్ని బ్యాంకు శాఖలతోపాటు ఆభరణాల సంస్థలు వీటిని విక్రయిస్తున్నాయి. ఆయా సంస్థలు కాయిన్లపై తమ బ్రాండ్లను ముద్రించుకోవడం సహజం. ‘‘ఎంఎంటీసీ–పీఏఎంపీ తరహా బ్రాండెడ్‌ రిఫైనరీ ద్వారా విక్రయించే కాయిన్లను కొనుగోలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే లండన్‌ బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ సర్టిఫైడ్‌ కాయిన్లు అవి’’ అని కిషోర్‌నార్నే సూచించారు. ఆభరణాల సంస్థలు విక్రయించే కాయిన్లు అన్నీ హాల్‌మార్క్‌వని అనుకోవద్దు. బైబ్యాక్‌ పాలసీ ఉన్న బ్రాండెడ్‌ జ్యూయలరీ సంస్థలు విక్రయించే కాయిన్లను పరిశీలించొచ్చు. ‘‘పేరొందిన సంస్థకు చెందిన కాయిన్‌ కాకపోతే, విక్రయించే సమయంలో దానిపై తక్కువ ధరే వస్తుంది’’ అన్నారు కిషోర్‌. 

ఆభరణాలు
ఆభరణాలపై తయారీ చార్జీలు సహజంగా 10–15 శాతం ఉంటాయి. డిజైన్లు లేని ఆభరణాలపై 3–5 శాతం వరకు తయారీ చార్జీలను సంస్థలు వసూలు చేస్తుంటాయి. చేతితో చేసిన ఆభరణాలపై 30 శాతం వరకూ తయారీ చార్జీలున్నాయి. తమ పాత ఆభరణాలను మార్పిడి చేసుకున్న సమయంలో వినియోగదారులు సగటున మొత్తం విలువలో 20–25 శాతం నష్టపోతున్నారని కిషోర్‌నార్నే తెలిపారు. అందుకే కొనుగోలు సమయంలో హాల్‌మార్క్‌ సర్టిఫికేషన్‌ అడగడం మరిచిపోవద్దన్నారు. కొన్ని సందర్భాల్లో హాల్‌మార్క్‌ సర్టిఫికేషన్‌ కూడా నకిలీదై ఉండొచ్చంటున్నారు నిపుణులు. సంబంధిత ఆభరణానికి ఏ కేంద్రం హాల్‌మార్క్‌ ధ్రువీకరణ ఇచ్చిందో కనుక్కుని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ జాబితాలో సంబంధిత కేంద్రం ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.

సార్వభౌమ బంగారం బాండ్లు
ఇవి ప్రభుత్వ హామీతో జారీ చేసే బాండ్లు.  ఏటా బంగారం విలువపై 2.5 శాతం వడ్డీ కూడా చెల్లిస్తుండడంతో వీటికి ఆదరణ ఉంది. కాల వ్యవధి ముగిసే సమయంలో ఉన్న బంగారం ధరనే చెల్లించడం జరుగుతుంది. ఈ బాండ్ల కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఐదో ఏట నుంచి కావాలనుకుంటే తప్పుకోవచ్చు.

పసిడి పరుగే..!
పసిడి ధరల ధోరణి పటిష్టంగానే కనబడుతోంది. శుక్రవారంతో ముగిసిన వారంలో న్యూయార్క్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) ధర ఒక దశలో 1359.50 డాలర్లను కూడా తాకింది. అయితే చివరకు వారం ప్రారంభం స్థాయిలోనే 1,345 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణులు, కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ సవాళ్లు, అమెరికా ఆర్థిక రంగం భారీగా పరుగులు తీసే పరిస్థితిలేకపోవడం వంటి అంశాలు మున్ముందు పసిడికి సానుకూల అంశాలేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పసిడి కీలక 1360 డాలర్లను దాటితే, 1400 డాలర్ల దాపులకు చేరడం ఖాయమని నిపుణుల భావన. ఇక దేశంలోనూ డాలర్‌ మారకంలో రూపాయి బలహీనపడే (శుక్రవారం ముగింపు 69.80)ధోరణే ఉందని ఇది పసిడికి సానుకూల అంశమని విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఎంసీఎక్స్‌లో శుక్రవారం పసిడి 10 గ్రాముల ధర రూ. 33,045 వద్ద ముగిసింది. 

డిజిటల్‌ గోల్డ్‌
బంగారం సాధనాల్లో ఆధునికమైనది ఇది. కస్టమర్లు కొనే బంగారానికి సరిపడా భౌతిక బంగారాన్ని ఆయా సంస్థలు ఇతర సంస్థలో టైఅప్‌ అయి వోల్టుల్లో నిల్వ చేస్తుంటాయి. రేట్లలోనూ పారదర్శకత ఉంటుంది. ఆన్‌లైన్లో, యాప్స్‌ ద్వారా పేటీఎం, ఫోన్‌పే, మోతీలాల్‌ ఓస్వాల్, ఆగ్మంట్‌ తదితర వేదికల ద్వారా డిజిటల్‌ గోల్డ్‌ను చాలా తక్కువ మొత్తం (రూపాయి నుంచి) నుంచే కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. మీరు కోరుకున్నంత మేర సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. అదే బంగారం కాయిన్లు, భౌతిక బంగారానికి కనీస మొత్తం ఉంటే తప్ప కొనుగోలు చేయలేని పరిస్థితి. సార్వభౌమ బంగారం బాండ్లు అయినా సరే కనీసం గ్రాము బంగారం కొనుగోలు చేయక తప్పదు. ‘‘చిన్న మొత్తాల్లో కొనుగోలు చేస్తూ, మీకు కావల్సినంత సమకూరిన తర్వాత ఇంటి వద్దకే భౌతిక బంగారాన్ని డెలివరీ తీసుకోవచ్చు’’ అని ఆగ్మంట్‌ డైరెక్టర్‌ సచిన్‌ కొఠారి తెలిపారు. కొన్ని సంస్థలు కస్టమర్లు పోగు చేసుకున్న డిజిటల్‌ బంగారాన్ని ఆభరణాల సంస్థలకు బదిలీ చేసుకునే ఆప్షన్‌ను ఇస్తున్నాయి. తద్వారా ఆయా ఆభరణాల సంస్థల నుంచి ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు.  

బంగారం ఈటీఎఫ్‌లు/ఫండ్స్‌
గోల్డ్‌ ఈటీఎఫ్‌లు అన్నవి షేర్ల మాదిరే స్టాక్‌ ఎక్సేంజ్‌లో క్రయ, విక్రయాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సాధనాలు. సార్వభౌమ బంగారం బాండ్లతో పోలిస్తే ఈటీఎఫ్‌లను అవసరమైనప్పుడు విక్రయించి నగదు చేసుకునే సౌలభ్యం ఉంటుంది. కాకపోతే బ్రోకింగ్, డీమ్యాట్‌ ఖాతాలు అవసరం అవుతాయి. ఏటా ఒక శాతం ఎక్స్‌పెన్స్‌రేషియో కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇవి రాబడులపై ప్రభావం చూపిస్తాయని మరిచిపోవద్దు. డీమ్యాట్‌ ఖాతా లేని వారు బంగారంలో ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top