ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ అత్యుత్తమ పనితీరు

LIC is the best performance of South Central Zone - Sakshi

2017–18లో రూ.50,000 కోట్ల ప్రీమియం ఆదాయం

హైదరాబాద్‌: ప్రభుత్వరంగ బీమా కంపెనీ ఎల్‌ఐసీలో సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో కూడిన) తన చరిత్రలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 కోట్ల ప్రీమియంను వసూలు చేసింది. వార్షికంగా చూస్తే ఇది ఏడు శాతం అధికం. కొత్త వ్యాపార ప్రీమియం వసూళ్లలోనూ 13 శాతం పెరుగుదల ఉంది. 29.73 లక్షల కొత్త పాలసీల ద్వారా తొలి ప్రీమియం రూ.5,574 కోట్లు వసూలైంది. ఈ వివరాలను జోనల్‌ మేనేజర్‌ టీసీ సుశీల్‌ కుమార్‌ మీడియాకు విడుదల చేశారు. పెద్ద గ్రూపు పథకమైన ‘చంద్రన్న బీమా’ను తాము సొంతం చేసుకున్నామని, ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రూ. 200 కోట్ల ప్రీమియం ఆదాయం ఎల్‌ఐసీకి లభించినట్లు చెప్పారు.

ఈ పథకం 2 కోట్ల మందిని కవర్‌ చేస్తుందన్నారు. క్లెయిమ్‌ల గురించి మాట్లాడుతూ... 2017–18లో కాల వ్యవధి తీరిన 33,36,654 పాలసీలకు సంబంధించి రూ.12,458 కోట్లు చెల్లించడం ద్వారా పరిష్కరించినట్టు చెప్పారు. 1,44,609 మరణ పరిహార క్లెయిమ్‌లకు సంబంధించి రూ.1,777 కోట్లు చెల్లించామని, సెటిల్‌మెంట్‌ రేషియో 99.88శాతంగా ఉన్నట్టు తెలిపారు. పాలసీల పునరుద్ధరణ విషయంలో దేశంలోనే సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ నంబర్‌ 1 స్థానంలో నిలిచిందని, కస్టమర్ల రిలేషన్‌షిప్‌ విషయంలో ప్రతిష్టాత్మక స్థానంలో ఉన్నట్టు సుశీల్‌కుమార్‌ వెల్లడించారు. పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎల్‌ఐసీ సొంత కార్యాలయాల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top