గతవారం బిజినెస్‌

Last week's business

సామర్థ్యం పెంపుపై జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ దృష్టి
సిమెంట్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 20 మిలియన్‌ టన్నుల (ఎంటీపీఏ)కి పెంచుకునే దిశగా వచ్చే మూడేళ్లలో రూ.1,800 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఎండీ పార్థ్‌ జిందాల్‌ చెప్పారు. ప్రస్తుతం ఇది 12.5 ఎంటీగా ఉందని తెలిపారు. మహారాష్ట్రలోని డోల్వి యూనిట్‌లో అదనంగా మరో 4.5 ఎంటీ, కర్ణాటకలోని విజయనగర ప్లాంటులో 1.2 ఎంటీ, ఒడిషా ప్లాంటులో 1.2 ఎంటీ మేర ఉత్పత్తిని పెంచుకోనున్నట్లు వివరించారు. మరోవైపు 2019–20లో ఐపీవోకు వస్తామని తెలిపారు.

శాంతించిన టోకు ద్రవ్యోల్బణం!
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో శాంతించింది. 2.60 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 సెప్టెంబర్‌తో పోల్చితే 2017 సెప్టెంబర్‌లో టోకు ఉత్పత్తుల బాస్కెట్‌ ధర 2.60 శాతమే పెరిగిందన్నమాట. ఆగస్టులో ఈ రేటు 3.24 శాతం ఉండగా,  2016 సెప్టెంబర్‌లో 1.36 శాతం. టోకు ధరలు శాంతించడానికి ఆహార ఉత్పత్తులు, కూరగాయల ధరలు కొంత తగ్గుదలకు ప్రధాన కారణం.

కేజీ బేసిన్‌లో 1.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు
కేజీ డీ6 బ్లాక్‌లోని 6 అనుబంధ క్షేత్రాల్లో కనుగొన్న నిక్షేపాల నుంచి గ్యాస్‌ ఉత్పత్తి కోసం 1.5 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బీపీ భావిస్తున్నాయి. 2022 నాటికి ఈ మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌)కి క్షేత్ర అభివృద్ధి ప్రణాళికను సమర్పించాయి. లోతైన సముద్రగర్భంలోని డీ2, 6, 19, 22 నిక్షేపాలతో పాటు సమీపంలోని డీ29, డీ30 నిక్షేపాల నుంచి కూడా గ్యాస్‌ వెలికితీయాలని ఆర్‌ఐఎల్, బీపీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఐదు నెలలు.. లక్ష యూనిట్ల విక్రయాలు..  
మారుతీ డిజైర్‌ కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌ వినియోగదారులను ఆకర్షిస్తూ మార్కెట్‌లో దూసుకెళ్తోంది. దిగ్గజ వాహన తయారీ కంపెనీ ’మారుతీ సుజుకీ ఇండియా’ ఈ ఏడాది మే నెలలో ఈ మూడో జనరేషన్‌ డిజైర్‌ కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది కేవలం ఐదు నెలల కాలంలోనే లక్ష యూనిట్ల విక్రయాల మార్క్‌ను అధిగమించింది. దీంతో అత్యంత వేగంగా లక్ష యూనిట్ల విక్రయాల మార్క్‌ను అందుకున్న కారుగా ఇది రికార్డ్‌ నమోదు చేసింది.  

గోల్డ్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ ఆరంభం...
మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో బంగారం కాంట్రాక్టులకు సంబంధించి ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (ధన త్రయోదశి రోజు) ప్రారంభించారు. బంగారం ట్రేడింగ్‌ను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యల్లో ఇదొకటని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బంగారం ట్రేడింగ్‌లో ఆప్షన్స్‌ను అందుబాటులోకి తేవడం ముఖ్యమైన పరిణామమని పేర్కొన్నారు.    

ఈపీఎఫ్‌–ఆధార్‌ అనుసంధానం ఆన్‌లైన్లోనే
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు తమ ఖాతాను ఆధార్‌తో ఆన్‌లైన్లోనే అనుసంధానించుకునే అవకాశాన్ని కల్పించింది. యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌) కలిగిన వారు ఈపీఎఫ్‌ ఇండియా పోర్టల్‌కు వెళ్లి ఈ–కేవైసీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఈపీఎఫ్‌–ఆధార్‌ను అనుసంధానించుకోవచ్చు.

కృష్ణపట్నం పోర్టు నుంచి తప్పుకోనున్న 3ఐ గ్రూప్‌!
బ్రిటన్‌కి చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ 3ఐ గ్రూప్‌... కృష్ణపట్నం పోర్టు ప్రాజెక్టు నుంచి వైదొలగాలనుకుంటోంది. దీనిపై 3ఐ గ్రూప్‌కు తమకు మధ్య చర్చలు జరుగుతున్నట్లు కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్‌ యెండ్లూరి తెలిపారు. 3ఐ గ్రూప్‌ స్వల్పకాలిక ఇన్వెస్టరు అని చెప్పారాయన. 2009లో దాదాపు 161 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.వెయ్యి కోట్లు) ఇన్వెస్ట్‌ చేసిన 3ఐకి.. ప్రస్తుతం సంస్థలో 89 శాతం వాటాలు ఉన్నాయి.

హీరో గ్లోబల్‌ రికార్డ్‌
దేశీ దిగ్గజ టూవీలర్‌ కంపెనీ ’హీరో మోటొకార్ప్‌’.. ధంతెరాస్‌ రోజు (అక్టోబర్‌ 17) ఏకంగా 3 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది. ఇది అంతర్జాతీయ రికార్డ్‌. ‘కేవలం ఒక్కరోజు లోనే 3 లక్షలకుపైగా వాహనాలను విక్రయించాం. ప్రపంచంలో ఈ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించాం’ అని హీరో మోటొకార్ప్‌ పేర్కొంది. ఇక సెప్టెంబర్‌ నెలలో 7 లక్షల యూనిట్లను విక్రయించామని పేర్కొంది. నెలవారీ అమ్మకాల్లో ఇవే ఇప్పటి వరకు అత్యుత్తమ గణాంకాలని తెలిపింది.  

6 నెలల్లో 120 కోట్ల పసిడి లావాదేవీలు: పేటీఎం
మొబైల్‌ వాలెట్‌ సంస్థ పేటీఎం తమ ప్లాట్‌ఫామ్‌పై గడిచిన ఆరు నెలల్లో రూ.120 కోట్ల విలువ చేసే పసిడి విక్రయ లావాదేవీలు నమోదైనట్లు వెల్లడించింది. ధంతెరాస్‌ రోజున పసిడి అమ్మకాలు ఏకంగా 12 శాతం పెరగ్గా, కొనుగోలుదారుల సంఖ్య పది లక్షల స్థాయి దాటిందని తెలిపింది.

10 శాతం పెరిగిన ఇంధన డిమాండ్‌
భారత ఇంధన(పెట్రోలియం ఉత్పత్తులు) డిమాండ్‌ ఈ ఏడాది సెప్టెంబర్లో 10 శాతం పెరిగింది. ఇంధన డిమాండ్‌ ఈ స్థాయిలో పెరగడం గడిచిన ఏడాది కాలంలో ఇదే మొదటిసారి. చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా.. భారత్‌.. గత నెలలో 16.25 మిలియన్‌ టన్నుల పెట్రోలియమ్‌ ఉత్పత్తులను వినియోగించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వినియోగం 14.78 మిలియన్‌ టన్నులుగా నమోదైంది.

ఐపీవో కాలమ్‌
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఐపీవోకు గ్రీన్‌ సిగ్నల్‌
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐపీవోకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) సెబీ పచ్చజెండా ఊపింది. ఈ ఐపీవో ద్వారా ఈ కంపెనీ రూ.7,500 కోట్లు సమీకరించవచ్చని మర్చంట్‌ బ్యాంకర్ల సమాచారం. ఈ ఐపీవోలో భాగంగా దాదాపు 15 శాతానికి సమానమైన 29 కోట్లకు పైగా షేర్లను జారీ చేయనున్నారు. దీంట్లో హెచ్‌డీఎఫ్‌సీ 9.55 శాతం వాటాకు సమానమైన 19.12 కోట్ల షేర్లను, స్టాండర్డ్‌ లైఫ్‌ మారిషస్‌ 5.42 శాతం వాటాకు సమానమైన 10.85 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తాయి.

ఆటో...
♦ యూకేకు చెందిన హైఎండ్‌ మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ ’ట్రయంఫ్‌’ తన ’స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌’లో కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.10.55 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఇండియా)గా ఉంది.
♦ జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ’బీఎండబ్ల్యూ’ తాజాగా ’330ఐ గ్రాన్‌ టురిస్మో ఎం స్పోర్ట్‌’లో కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను దేశీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.49.4 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఇండియా) ఉంది.

డీల్స్‌..
♦ అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ) భారత్‌లో 1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 6,500 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇందుకు సంబంధించి నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
♦ ప్రముఖ ఫర్నీచర్‌ సంస్థ ‘ఐకియా’కు ఇన్‌స్టోర్‌ రెస్టారెంట్ల వ్యాపారానికి బ్యాక్‌ ఎండ్‌ సర్వీసులను ప్రముఖ లాజిస్టిక్స్‌ కంపెనీ ‘స్నోమ్యాన్‌ లాజిస్టిక్స్‌’ అందజేయనుంది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
♦ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్, హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ కంపెనీలు భాగస్వామ్య సంస్థ ఏర్పాటుకు చేతులు కలిపాయి. అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాల అభివృద్ధికి ఈ సంస్థ వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్లను ఇన్వెస్ట్‌ చేస్తుంది. సంయుక్త సంస్థలో మహీంద్రా గ్రూపునకు 51 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌కు 49 శాతం వాటాలుంటాయి.
♦ దేశంలో ఎల్‌ఈడీ లైట్ల ఉత్పత్తిలో నిమగ్నమైన స్టాంజొ సంస్థ... యూరప్‌నకు చెందిన ఫైబర్‌ అప్టిక్‌ టెక్నాలజీ కంపెనీ కార్బన్‌–8తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో స్టాంజో ద్వారా కార్బన్‌–8 సంస్థ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top