గతవారం బిజినెస్‌

Last week's business

ప్రీపెయిడ్‌ సాధనాల పరిమితి నెలకు 50 వేలు  
మొబైల్‌ వాలెట్లు తదితర ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ)లో నెలకు రూ. 50,000కు మించి లోడ్‌ చేయరాదని ఆర్‌బీఐ ఆదేశించింది. అలాగే వీటిని జారీ చేసే సంస్థలు పీపీఐ బ్యాలెన్స్‌లపై వడ్డీ చెల్లించడానికి లేదని స్పష్టం చేసింది. మీల్‌ వోచర్లు మినహా పీపీఐలను పేపర్‌ రూపంలో జారీ చేయరాదని కూడా సూచించింది.

ఎగుమతులు పెరిగాయ్‌..
భారత్‌ ఎగుమతులు సెప్టెంబర్‌లో 25.67 శాతం పెరిగాయి. ఇది ఆరు నెలల గరిష్ట స్థాయి. విలువ రూపంలో 28.61 బిలియన్‌ డాలర్లు. దిగుమతులూ 18 శాతం ఎగశాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 31.83 బిలియన్‌ ఉన్న దిగుమతుల విలువ 2017 సెప్టెంబర్‌లో 37.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  

పారిశ్రామిక రంగం పరుగులు
పారిశ్రామిక వృద్ధి మళ్లీ పరుగు అందుకుంది. ఆగస్ట్‌లో 4.3 శాతం వృద్ధితో తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. మైనింగ్, విద్యుత్‌ రంగాల చక్కని పనితీరుతో ఇది సాధ్యపడింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గతేడాది ఆగస్ట్‌లో 4 శాతంగా నమోదు కావటం గమనార్హం. ఇక రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ నెలలో 3.28 శాతంగా నమోదైంది.  

 భారత్‌ వృద్ధి అంచనాలు కట్‌!!
ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 7 శాతానికే పరిమితం కాగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇది 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యలు ఇందుకు కారణం కాగలవని పేర్కొంది.

ఫండ్స్‌లోకి రూ.2 లక్షల కోట్లు..
ఇన్వెస్టర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) కాలంలో వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఏకంగా రూ.2,02,001 కోట్లమేర ఇన్వెస్ట్‌ చేశారు. ఈ మొత్తంలో ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ స్కీమ్స్‌ అధిక వాటా ఆక్రమించాయి. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఫండ్స్‌లోకి వచ్చిన నిధుల విలువ రూ.2,34,564 కోట్లుగా ఉంది.  

ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16 శాతం అప్‌
దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య కాలం లో 15.8 వృద్ధితో రూ.3.86 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్ల అంచనా (రూ.9.8 లక్షల కోట్లు)లో వీటి వాటా 39.4 శాతంగా ఉంది.

డీల్స్‌..
♦ జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (జీఎస్‌పీఎల్‌) తన రాయగఢ్, అంగుల్‌ స్టీల్‌ ప్లాంట్ల లోని ఆక్సిజన్‌ ప్లాంట్ల తాలూకు ఆస్తుల్ని శ్రేయి ఎక్విప్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌కు రూ.1,121 కోట్లకు ఏకమొత్తంగా విక్రయించింది.
♦  సుమారు 2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణలో భాగంగా ట్యాక్సీ సేవల సంస్థ ఓలా తాజాగా టెన్సెంట్‌ హోల్డింగ్స్‌ తదితర ఇన్వెస్టర్ల నుంచి 1.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 7,150 కోట్లు) సమీకరించింది. మరో బిలియన్‌ డాలర్ల కోసం కొనసాగుతున్న చర్చలు తుది దశలో ఉన్నట్లు ఓలా మాతృసంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ వెల్లడించింది.  
♦  మ్యాక్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు కోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహ్మాన్‌ నెలకొల్పిన కేఎం మ్యూజిక్‌ కన్జర్వేటరీస్‌ (కేఎంఎంసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాపిల్‌ మ్యూజిక్‌ తెలిపింది.   
♦  ఫార్మా కంపెనీ లుపిన్‌ రూ.960 కోట్లతో అమెరికాకు చెందిన సింబియోమిక్స్‌ థెరప్యూటిక్స్‌ ఎల్‌ఎల్‌సీని కొనుగోలు చేసింది.  
♦  నిర్మాణ రంగ దిగ్గజం షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్, జర్మనీకి చెందిన అలయంజ్‌ గ్రూప్‌ 500 మిలియన్‌ డాలర్ల ఈక్విటీ ఫండ్‌ ఏర్పాటు కోసం చేతులు కలిపాయి.  
♦  భారతీ ఎయిర్‌టెల్‌ రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్‌ మొబైల్‌ వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు వెల్లడించింది. నవంబర్‌ 1 నుంచి టాటా టెలీసర్వీసెస్‌ (టీటీఎస్‌ఎల్‌), టాటా టెలీసర్వీసెస్‌ మహారాష్ట్ర (టీటీఎంఎల్‌) సంస్థలకు 19 టెలికం సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికి పైగా కస్టమర్లు టాటా టెలీ నుంచి ఎయిర్‌టెల్‌కి బదిలీ అవుతారు. అయితే ఈ సంస్థల కొనుగోలు కోసం ఎయిర్‌టెల్‌ ఎలాంటి నగదూ చెల్లించటం లేదు. పైపెచ్చు తన కంపెనీలో వాటాలనూ ఇవ్వటం లేదు. టాటా టెలీ సంస్థలకు భారీ రుణాలున్న నేపథ్యంలో ఆ రుణాలను కూడా ఎయిర్‌టెల్‌ తీర్చదు. వాటిని టాటా గ్రూపే తీరుస్తుంది. కాకపోతే స్పెక్ట్రమ్‌ కోసం టెలికం విభాగానికి టాటా సంస్థలు చెల్లించాల్సిన మొత్తాలను విడతల వారీగా ఎయిర్‌టెల్‌ చెల్లిస్తుంది.  
♦  ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఫ్లిప్‌కార్ట్‌.. తన చెల్లింపుల విభాగం ఫోన్‌పేలో 50 కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది.

ఆటోమొబైల్స్‌
♦  ‘ఫోక్స్‌వ్యాగన్‌’ తన ప్రీమియం సెడాన్‌ ’పసాట్‌’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.29.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ).
♦  షావోమి’ తాజాగా బెజిల్‌లెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఫీచర్‌తో ’మి మిక్స్‌ 2’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.35,999గా ఉంది.  
♦  ‘శాంసంగ్‌’.. ’గెలాక్సీ ట్యాబ్‌ ఏ (2017)’ పేరుతో కొత్త ట్యాబ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.17,990.  
♦  స్పోర్ట్స్‌ కార్ల తయారీ కంపెనీ ’పోర్షే’.. తన 911 పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఇది తాజాగా ’911 జీటీ3’ కారును భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2.31 కోట్లుగా (ఎక్స్‌షోరూమ్‌ ఇండియా) ఉంది.  
♦   మహీంద్రా కంపెనీ తన ‘కేయూవీ 100’లో కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ‘కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ’ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.4.39 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ముంబై) ఉంది.  
♦   ‘బజాజ్‌ ఆటో’ తన ’ప్లాటినా కంఫర్‌టెక్‌’ మోటార్‌సైకిల్‌లో కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.46,656గా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది.  
♦  భారతీ ఎయిర్‌టెల్‌ తాజాగా ‘కార్బన్‌ ఏ40 ఇండియన్‌’ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. అది కూడా రూ.2,899కే. ఈ మొత్తంలో మూడేళ్ల తరవాత రూ.1500 వరకూ తిరిగి వెనక్కు ఇస్తుండటంతో నికరంగా ఫోన్‌ కోసం చెల్లిస్తున్న మొత్తం రూ.1,399గానే ఉంటోంది.  
♦  మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ’లావా ఇంటర్నేషనల్‌’.. ’హీలియం 12’ పేరుతో నోట్‌బుక్‌ను తీసుకువచ్చింది. మార్కెట్‌లో అత్యంత విశాలమైన స్క్రీన్‌తో ఉన్న అతి తేలికైనా నోట్‌బుక్‌ ఇదేనని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.12,999గా ఉంది.

నియామకాలు..నిష్క్రమణలు..
♦   దిగ్గజ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ’ఫేస్‌బుక్‌’ నుంచి ఉమాంగ్‌ బేడి బయటకు వచ్చారు. ఆయన తన మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. ఉమాంగ్‌ బేడి ఈ ఏడాది చివరినాటికి బాధ్యతల నుంచి తప్పుకుంటారని కంపెనీ తెలిపింది. ఉమాంగ్‌ స్థానంలో తాత్కాలిక ఎండీగా సందీప్‌ భూషణ్‌ను నియమిస్తున్నట్లు వెల్లడించింది.
♦  పెప్సికో ఇండియా నుంచి డి.శివకుమార్‌ బయటకు వచ్చారు. తన చైర్మన్, సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఈయన వచ్చే 3 నెలల్లో ఆదిత్య బిర్లా గ్రూప్‌లో స్ట్రాటజీ అం డ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ హెడ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. పెప్సికో ఈజిప్ట్, జోర్డాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, జనరల్‌ మేనేజర్‌ అహ్మద్‌ ఇల్‌ షైక్‌.. శివ కుమార్‌ స్థానాన్ని భర్తీ చేస్తారని పెప్సికో ఇండియా తెలిపింది.   
♦  ఆంధ్రాబ్యాంక్‌ కొత్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా కుల్‌ భూషణ్‌ జైన్‌ నియమితులయ్యారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top